వాట్సాప్.. పెద్ద‌గా ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు.  మెసేజులు పంపడానికి, వాయిస్, వీడియో కాల్స్ చేయడానికి, ఫోటోలు, డాక్యుమెంట్లు షేర్ చేసుకోవడానికి ఈ యాప్‌లో సులువుగా మారింది. ఇన్‌స్టెంట్ మెసేజింగ్ ప్రపంచంలోకి పెను ఉప్పెనలా దూసుకొచ్చిన వాట్సాప్‌ను రకరకాల కమ్యూనికేషన్ అవసరాల దృష్ట్యా ప్రతిరోజు కోట్ల‌లో యూజర్లు వినియోగించుకుంటున్నారు. యూజ‌ర్ల‌ను ఆక‌ట్టుకునే విధంగా ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త కొత్త ఫీచ‌ర్ల‌తో ముందుకు వ‌స్తోంది వాట్సాప్‌. ఇక తాజా స‌మాచారం ప్ర‌కారం  ఇన్‌స్టంట్‌ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ నుంచి డిజిటల్‌ చెల్లింపుల సేవలు త్వరలో ప్రారంభం కానున్నాయి. 

 

దశల వారీగా డిజిటల్‌ చెల్లింపుల ఫ్లాట్‌పాం వాట్సాప్‌ పే సేవలను ప్రారంభించేందుకు భారత జాతీయ చెల్లింపుల కార్పొరేషన్‌ (ఎన్‌పీసీఐ) వాట్సాప్‌కు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. వాట్సాప్‌ పే సేవల్లో జాప్యానికి కారణమైన డేటా లోకలైజేషన్‌ నిబంధనలపై నియంత్రణసంస్ధలకు భరోసా ఇవ్వడంతో క్లియరెన్స్‌లు లభించాయి. డేటా లోకలైజేషన్‌ నిబంధనలకు అనుగుణంగా సేవలు అందిస్తామని వాట్సాప్‌ రెగ్యులేటర్లకు స్పష్టం చేసింది. అయితే ఆర్‌బీఐ అనుమతి లభించిన కొద్దిరోజులకే ఎన్‌పీసీఐ నుంచి ఆమోదం లభించడం విశేషం.

 

ఇక మొద‌టి ద‌శ‌లో వాట్సాప్‌ భారత్‌లో కోటి యూజర్లకు చెల్లింపు సేవలను అందుబాటులోకి తీసుకువస్తుంది. ఇతర నిబంధనలకు అనుగుణంగా చర్యలు చేపట్టే క్రమంలో పూర్తిస్ధాయిలో వాట్సాప్‌ పే సేవలు దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తాయని సమాచారం. మ‌రి వాట్సాప్‌ పే సేవలు పూర్తిస్ధాయిలో అందుబాటులోకి వస్తే దేశంలోనే అతిపెద్ద చెల్లింపుల వ్యవస్థగా మారుతుంది అన‌డంలో ఏ మాత్రం సందేహం లేదు. ఫోన్‌పే, గూగుల్‌ పేలను 40 కోట్ల మంది భారత యూజర్లను కలిగిన వాట్సాప్‌ పే దీటుగా అధిగమిస్తుందని అంచనా కూడా వేస్తున్నారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: