ఏటీఎం.. ఇటీవ‌ల కాలంలో వీటి వినియోగం విప‌రీతంగా పెరిగిపోయింది. పగలు, రాత్రి అని తేడా లేకుండా ఏ సమయంలోనైనా ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసుకోవచ్చు. ఏటీఎంల‌ రాకతో బ్యాంకులలో పని భారం గణనీయంగా తగ్గింద‌ని చెప్పవ‌చ్చు. వాస్త‌వానికి మొదట ప్రజలు త‌మ ఖాతాలోని డబ్బును తీసుకోవడానికి బ్యాంకుల‌లో గంట‌లు త‌ర‌బ‌డి వెయిట్ చేసేవారు. కానీ ఇప్పుడు కొన్ని నిమిషాల్లోనే ఏటీఎంల ద్వారా త‌మ‌ ఖాతాలో ఉన్న నగదును తీసుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే ఏటీఎంల వినియోగం భారీ స్థాయిలో పెరిగింది. అయితే ఏటీఎంలో డబ్బులు తీసుకోవాలంటే.. క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డు ఉండాల్సిందే. ఆ కార్డులను మిషన్‌లో పెట్టి.. ఆ తర్వాత పిన్ నంబర్‌ ఎంటర్‌ చేస్తే డబ్బులు బయటకు వస్తాయి. 

 

ఇదంతా నిన్నటి మాట. ఇప్పుడు కరోనా కాలంలో బ్యాంకులు కూడా కస్టమర్ల ఆరోగ్యంపై దృష్టి సారించాయి. ఈ క్ర‌మంలోనే  కార్డ్‌ లేకుండానే నగదు తీసుకునేలా చర్యలు తీసుకుంటున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఏటీఎం మిషన్‌ను సాధ్యమైనన్ని తక్కువసార్లు తాకడానికి కార్డ్‌లెస్ ఉపసంహరణ ఎంతో ఉపయోగకంగా ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ సౌకర్యం ప్రస్తుతం కొన్ని బ్యాంకుల్లో ఉంది. ఈ బ్యాంకులు ఇలా నగదు తీసుకునేందుకు పలు యాప్‌లను అందుబాటులో ఉంచాయి. ప్రస్తుతం ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐసీఐసీఐ బ్యాంకు వినియోగదారులు.. ఇలా కార్డ్‌ లెస్ విత్‌ డ్రా చేసుకునేందుకు ఆయా బ్యాంకులకు సంబంధించిన యాప్స్‌ను ఫోన్‌లలో డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. 

 

ఉదాహరణకు ఎస్బీఐ కోసం యోనో యాప్ డౌన్ లోడ్ చేయాలి. ఇందుకు ముందుగా, మీ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ ప్లే స్టోర్ నుంచి యోనో యాప్ డౌన్‌లోడ్ చేయాలి. యాప్ డౌన్లోడ్ అయిన తరువాత దాంట్లో మీరు రిజిస్టర్ కావాలి. యాప్‌లో రిజిస్టర్ చేసుకున్న తర్వాత రిక్వెస్ట్ యోనో క్యాష్ క్లిక్ చేయాలి. అక్కడ మీకు అకౌంట్ నంబర్ కనిపిస్తుంది. అకౌంట్ నెంబర్ సెలెక్ట్ చేసి ఎంత నగదు కావాలో ఎంటర్ చేయాలి. తర్వాత 6 అంకెల యోనో క్యాష్ పిన్ సెట్ చేసుకోవాలి. దాన్ని సెట్ చేసుకోగానే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు 6 అంకెల రిఫరెన్స్ నెంబర్ ఎస్ఎంఎస్ వస్తుంది. ఈ రిఫరెన్స్ నెంబర్ కేవలం అర‌గంట మాత్రమే పనిచేస్తుంది. 

 

ఇప్పుడు మీకు దగ్గర్లో ఉన్న ఏటీఎంకు వెళ్లాలి. అక్కడ ముందుగా మీకు ఎస్ఎంఎస్‌లో వచ్చిన 6 అంకెల రిఫరెన్స్ నెంబర్ ఎంటర్ చేయాలి. మీరు యాప్‌లో ఎంటర్ చేసిన అమౌంట్‌ను కూడా ఏటీఎంలో ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మీరు యాప్‌లో క్రియేట్‌ చేసిన 6 అంకెల యోనో క్యాష్ పిన్‌ను ఎంటర్ చేసి డబ్బులు డ్రా చేసుకోవచ్చు.  

 

 
 
 
 
  

మరింత సమాచారం తెలుసుకోండి: