మొబైల్ ఇండస్ట్రీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో వేరే చెప్పక్కర్లేదు. కానీ అంతే వేగంగా చార్జర్లు అభివృద్ధి చేస్తున్నారా? అంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికీ ప్రముఖ బ్రాండ్ల మొబైల్స్‌కు సాధారణ చార్జర్లే వస్తున్నాయి. అంటే ఈ విషయంలో ఇండస్ట్రీ పెద్దగా దృష్టి పెట్టలేదనే చెప్పాలి. అయితే ఇటీవలి కాలంలో వైర్ లెస్ చార్జింగ్ అనే అంశం బాగా పాపులర్ అయింది. ఈ క్రమంలోనే ఓ ప్రముఖ కంపెనీ కొత్తగా అలోచించింది. దాదాపు మనమందరం పడుకునేటప్పుడు తల దగ్గర అలారం పెట్టుకుంటాం.

ఉదయాన్నే మనల్ని నిద్ర లేపేది అదే మరి. అలాంటప్పుడు ఈ అలారం క్లాక్‌నే చార్జర్‌లా ఉపయోగించు కోవచ్చు కదా! సరిగ్గా ఇదే ఆలోచన వచ్చింది ప్రముఖ వాచ్ బ్రాండ్ టైమెక్స్. దీన్ని వైర్ లెస్ పవర్ కన్సార్షియంలో ప్రదర్శనకు ఉంచారు. ఈ చార్జర్ అలారం చాలామంది దృష్టిని ఆకర్షించింది. దీనికి సదరు కన్సార్షియం నుంచి ధ్రువీకరణ కూడా దొరికింది. అంటే మరికొన్ని రోజుల్లో ఈ అలారం క్లాక్ మార్కెట్లోకి వచ్చేస్తుందన్న మాట. ఈ సర్టిఫికెట్‌తో పాటు కన్సార్షియం ఓ పొటోను అటాచ్ చేసింది. దీన్ని చూస్తే ఇది కచ్చితంగా మనకు ఉపయోగకరంగా ఉంటుందనే అనిపిస్తోంది. టైమెక్స్ నుంచి వస్తున్న ఈ అలారం చార్జర్.. చూడటానికి చాలా సింపుల్ డిజైన్ తో ఆకట్టుకుంటోంది.

దీని మోడల్ నంబర్ టీడబ్ల్యూ300 అని టైమెక్స్ తెలిపింది. ఇది గనుక మార్కెట్లోకి వస్తే హాట్ కేకులా అమ్ముడుపోయే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంటున్నారు. టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా ఇప్పటికీ చాలామంది అలారం క్లాక్‌లు వాడుతున్నారని, కాబట్టి ఈ ప్రొడక్ట్ కచ్చితంగా హిట్ అవుతుందని అంచనా. ఈ ఫొటో చూస్తే మీకూ ఒకటి కొన్ని అనిపించదు లేదూ.  కానీ  ఈ చార్జింగ్ గడియారం కావాలంటే అది మార్కెట్ లోకి వచ్చే వరకూ ఆగాల్సిందే. కొంచెం వెయిట్ చేయండి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: