వాషింగ్టన్: ఐఫోన్ పేరు వింటే చాలు. దాని నాణ్యత, సెక్యూరిటీ, సూపర్ ఫీచర్లే మనకు గుర్తుకొస్తాయి. ఇతర దేశాలకు చెందిన మొబైల్స్ ఎన్ని మార్కెట్లోకి వచ్చినా ఐఫోన్‌కు ఉన్న డిమాండే వేరు. ఫీచర్ల విషయంలో మిగతా బ్రాండ్‌ల కంటే తక్కువ ఉన్నా.. ధర విషయంలో మాత్రం టాప్‌లో ఉంటుంది. ఒక్క ఐఫోన్ కొనడం కోసం దొంగతనాలూ, మోసాలూ చేసిన వాళ్లున్నారు. కిడ్నీలు అమ్ముకుని మరీ ఐఫోన్ కొనుక్కున్న వారినీ మనం చూశాం. అలాంటి యాపిల్‌ సంస్థ తన వినియోగదారులను మోసం చేసింది. అవును. నమ్మడం లేదా..? కానీ ఇది నిజం. ఫీచర్ల విషయంలో వినియోగదారులను తప్పుదోవ పట్టించినందుకు దాదాపు రూ.90 కోట్ల జరిమానా కూడా చెల్లించాల్సిన పరిస్థితికి వచ్చింది.

ఇటలీకి చెందిన కాంపిటీషన్ అథారిటీ ఈ జరిమానా విధించింది. దాదాపు 10 మిలియన్ యూరోలు అంటే భారత కరెన్సీలో రూ.90 కోట్లకు పైగా చెల్లించాలని టెక్ దిగ్గజం యాపిల్‌ను ఆదేశించింది. మొబైల్ ఫోన్లలో లేని ఫీచర్లు ఉన్నట్లు వినియోగదారులను నమ్మించి మోసం చేసినందుకు గానూ ఈ భారీ జరిమానాను విధించినట్లు ఆ సంస్థ తెలిపింది. వాటర్ రెసిస్టెంట్ ఫీచర్.. ఇప్పుడు చాలా కంపెనీల మొబైల్ ఫోన్లలో ఈ ఫీచర్ ప్రముఖంగా ఉంటోంది. యాపిల్ ఈ ఫీచర్‌ను ఎన్నో ఏళ్లుగా కొనసాగిస్తోంది. అయితే ఈ ఫీచర్ లేని మొబైల్స్‌ను కూడా ఫీచర్ ఉన్నట్లే నమ్మించి విక్రయించేస్తోందట. అంతేకాదు వాటర్ రెసిస్టెంట్ మోడళ్లు నీటి వల్ల దెబ్బతిన్నప్పటికీ వీటికి వారెంటీని ఇవ్వడం లేదట.

వాటర్ రెసిస్టెంట్‌పై ల్యాబుల్లో చేసిన పరీక్షల్లో ఈ విషయం తేలిందట. ముఖ్యంగా యాపిల్ ఇటీవల విడుదల చేసిన ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్, ఐఫోన్ ఎక్స్ఆర్, ఐఫోన్ ఎక్స్ఎస్, ఐఫోన్ ఎక్స్ఎస్ మ్యాక్స్, ఐఫోన్ 11, ఐఫోన్ 11 ప్రొ, ఐఫోన్ 11 ప్రొ మ్యాక్స్ మొబైల్స్‌లలో ఏ ఒక్కటి కూడా వాటర్ రెస్టిస్టెంట్ టెస్ట్‌లో పాస్ కాలేకపోయాయని ఇటలీ సంస్థ తెలిపింది.  స్థిర, స్వచ్ఛమైన నీటితో ప్రయోగశాలలో నిర్వహించిన పరీక్షల్లో ఇవి నిలబడలేకపోయాయని ఆ సంస్థ తెలిపింది. ఇదతా వినియోగదారులను తప్పుదోవ పట్టించినట్లేనని, అందువల్లే యాపిల్‌పై 10 మిలియన్ యూరోల జరిమానా విధించామని ఇటలీ కాంపిటిషన్ అథారిటీ వెల్లడించింది. మరి దీనికి యాపిల్ యాజమాన్యం ఎలా స్పందింస్తుందో.. ఎలాంటి వివరణ ఇస్తుందో వేచి చూడాలి. ఏది ఏమైనా యాపిల్ వంటి సంస్థ ఇలా వినియోగదారులను మోసం చేయడం శోచనీయం.

మరింత సమాచారం తెలుసుకోండి: