ఇంటర్నెట్ అశ్లీలత గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఇంటర్నెట్ వచ్చిన తర్వాతే బూతు ఎక్కువగా జనం మధ్యలోకి వచ్చిందనడంలో అతిశయోక్తి లేదు. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉన్న ఎవరైనా సునాయాసంగా, రహస్యంగా బూతుని వెతుక్కోవచ్చు, చూడొచ్చు. అయితే ఈ రహస్యం పరిమితి ఎంతవరకు అనేది మాత్రమే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. రహస్యంగా ఏదైనా చూడాలనుకున్నా, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ జరపాలనుకున్నా ఇన్ కాగ్నిటో విండో ఓపెన్ చేసుకోవడం చాలామందికి అలవాటు. మొబైల్ ఫోన్ లో కూడా ఈ ఫెసిటిలీ అందుబాటులో ఉండటంతో అందరూ దీన్ని ఉపయోగిస్తుంటారు. ఇన్ కాగ్నిటోలో ఏదైనా వెబ్ సైట్ గురించి సెర్చ్ చేసినా, ఓపెన్ చేసినా.. హిస్టరీలో అది కనిపించదు. అయితే అది కూడా నిజం కాదని అంటున్నారు టెక్ నిపుణులు. ఇన్ కాగ్నిటో విండోలో ఓపెన్ చేసిన సమాచారం కూడా సర్వర్లకు ఈజీగా అందుతుందట.

ముఖ్యంగా అశ్లీల వెబ్ సైట్లు ఇలాంటి సమాచారాన్ని సేకరిస్తున్నాయని తాజా అధ్యయనం పేర్కొంది. తమ వెబ్ సైట్లు చూసేవారి వివరాలు సేకరించి, వారిని వివిధ రూపాల్లో ఆకర్షించడం ఆయా సైట్ల పని. ఎస్కార్ట్ వెబ్ సైట్లు, డేటింగ్ వెబ్ సైట్లు.. ఇలా సమాచారాన్ని రాబట్టి నెటిజన్ల బలహీనతను అడ్డు పెట్టుకుని వ్యాపారం చేస్తుంటాయి.

మరోవైపు గూగుల్‌, ఫేస్‌ బుక్‌ సహా అనేక వెబ్‌సైట్లు యూజర్‌ ఇన్ ‌కాగ్నిటో మోడ్‌ను ఉపయోగించినా ఇంటర్నెట్‌లో వారు చేస్తున్న పనుల్ని ట్రాక్‌ చేస్తున్నాయని పలు అధ్యయనాలు వెల్లడించాయి. ఏయే వెబ్‌ సైట్లు చూస్తున్నారు.. వారి ఆసక్తులేంటనే విషయాన్ని పసిగడుతున్నాయి. వీటిల్లో కొన్ని వెబ్‌ సైట్లు యూజర్‌ యాక్టివిటీని ఇతర డేటాను థర్డ్ ‌పార్టీ సంస్థలు, అడ్వర్టైజింగ్‌ ఏజెన్సీలకు చేరవేస్తున్నాయని తేలింది. గూగుల్‌, ఫేస్ ‌బుక్‌ కూడా యూజర్ల ఆన్ ‌లైన్‌ పనుల్ని ట్రాక్‌ చేస్తుండటంతో ఏ వెబ్ ‌సైట్‌ తెరిచినా వారి ఆసక్తులను బట్టి అడ్వర్టైజ్‌ మెంట్లు ప్రదర్శిస్తున్నాయి.

ఇంటర్నెట్ లో మనం చూసే వెబ్ ‌సైట్లు, మనకు ఇంటర్నెట్‌ సేవలు అందిస్తున్న సర్వీస్‌ ప్రొవైడర్లు గుర్తిస్తాయి. ఇన్ కాగ్నిటో విండోలో ఓపెన్ చేసినా వాటి వద్ద మన సమాచారం ఉంటుంది. ఆఫీసుల్లో కంప్యూటర్లను వాడితే కంపెనీ యాజమాన్యాలు, పాఠశాలలో కంప్యూటర్లయితే పాఠశాల యాజమాన్యాలు ట్రాక్‌ చేయగలవు. వారి సర్వర్లలో మన బ్రౌజింగ్‌ హిస్టరీ స్టోర్ అవుతుంది. ఇన్‌కాగ్నిటో మోడ్‌లో ఉన్నా కూడా కొన్ని వెబ్‌సైట్లు కుకీస్ ని అనుమతించమని కోరుతుంటాయి, దీనివల్లే ఇది సాధ్యమవుతుందని చెబుతున్నారు నిపుణులు. సో.. ఇన్ కాగ్నిటో విండో ఓపెన్ చేశాం కదా, మనం చేస్తున్న పని ఎవరికీ తెలియదు కదా అనుకోవడం మన అమాయకత్వమే అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: