వ్యవసారంగంలో వస్తున్నఅనుగుణంగా రైతుకు అనేక పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. ఈ క్రమంలో యాంత్రిక సాగు విధానం బాగా ప్రభావితం చేస్తుందనే చెప్పాలి. పెరిగిన వ్యవసాయ ఖర్చులు, రైతు కూలీల కొరత వంటి అంశాలతో  ఆధునిక పద్ధతులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్లాస్టిక్‌ షీటుపై వరి నారు పెంచే విధానం అందుబాటులోకి వచ్చింది. రోడ్లు వేసేటప్పుడు సిమెంట్‌ మెటీరియల్‌ జారిపోకుడా రోడ్డు కింద వేసే తెల్లని పాలిథీన్‌ షీటును నారు పెంచుకోవడానికి ఉపయోగించుకోవాలి. ఈ షీటు వెడల్పు 76 సెం.మీ ఒక కిలో షీటు పొడవు 26 మీటర్లుంటుంది. ఈ షీటు మందం 60 మైక్రాన్లుంటుంది. ఒక కిలో పాలిథీన్‌ షీటు ఖరీదు రూ.140, ఒక ఎకరం పొలానికి సరిపడా నారు పెంచేందుకు అరకిలో షీటు సరిపోతుంది. దమ్ము చేసిన పొలంలో సరైన సమయంలో నాటు వేయకపోవడంతో మళ్లీ ఆ వరి పొలాల్లో గడ్డిమొలవడం, దాని కోసం మళ్లీ దమ్ము చేసే పరిస్థితి నెలకొంటుంది. దీనివల్ల విలువైన నీరు, సమయం, శ్రమ వృధా అవుతుంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని 2011లోనే మిషన్‌ల ద్వారా వరి నాటే ప్రయత్నాలు మొదలుపెట్టారు.





సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకునిజపాన్‌, చైనా ఇతర దేశాల నుండి మిషన్లు, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని వ్యవసాయ విశ్వవిద్యాలయంతోపాటు కొన్ని ప్రయివేటు కంపెనీలు కూడా కాంట్రాక్టు పద్ధతిలో నారును పెంచి నాటు వేయడం ప్రారంభించాయి. అనుకున్నంత స్థాయిలో ఈ పరిజ్ఞానాన్ని రైతుల వద్దకు తీసుకపోలేకపోయారు. ముఖ్యంగా నారు పెంచినప్పుడు నారు పెరుగుదల లోపించడం, సూక్ష్మధాతు లోపాలు ముఖ్యంగా ఇనుప ధాతు సమస్యను గుర్తించడ జరిగింది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కేరళ, ఇతర రాష్ట్రాలలో రైతాంగం మిషన్‌ నాట్లను అనువుగా పాలిథీన్‌ షీట్లపై పెంచుతున్న నారు పద్ధతిని మన పరిస్థితులకు అనువుగా, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వరంగల్‌ శాస్త్రవేత్తలు రూపొందించి రైతుల పొలాల్లో ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు.




పాలిథీన్‌ షీటును సమానంగా ముడతలు పడకుండా దమ్ము చేసిన మడిలో పర్చాలి. ప్లాస్టిక్‌ ట్రే సైజుతో తయారు చేసిన చెక్క లేక అల్యూమినియం ట్రేలను ఈ పాలిథీన్‌ షీటుపై ఎదురెదురుగా ఉంచాలి. ఒక ప్రేమును 4ట్రేల సైజులో తయారు చేసుకోవచ్చు. ఇద్దరు మనుషులు వ్యతిరేక దిశలో నిలబడి వాళ్ల కాళ్ల దగ్గర నుండి దమ్ము చేసిన బురద మట్టిని రాళ్లు లేకుండా చూసుకొని ప్రేములలో నింపాలి. ఒక్కో ట్రేలో మట్టి మందం ఎటువంటి పరిస్థితిలోనూ ఒక ఇంచు దాటకూడదు. బురద మట్టిని తేలిగ్గా నింపి ఎక్కువైన మట్టిని ప్లాస్టిక్‌ రేకుతో తీసేయాలి. బురద మట్టిని చేతులతో సమానం చేయకూడదు. మట్టి మందం ఎక్కువైతే రోలింగ్‌ చేసేటప్పుడు ముక్కలు ముక్కలు అవుతంది. పైగా సరిగ్గా నాటు పడదు.





మొలకెత్తిన వరి గింజలను ప్రేములోని ఒక్కో అరలో 120గ్రా. సన్నగింజ, 160గ్రా. దొడ్డుగింజ వచ్చేటట్టు చల్లుకోవాలి. ఎకరానికి సుమారుగా 80 షీట్ల నారు అవసరం ఉంటుంది. కనుక విత్తిన మోతాదు సన్నగింజ రకాలైతే 8నుంచి 10 కిలోలు, దొడ్డురకాలైతే 12నుంచి 14 కిలోలుగా ఉంటుంది. అకాల వర్షానికి విత్తనం దెబ్బతినకుండా, పక్షులు తినకుండా ఉండడానికి నారు మడులపై గడ్డిని కప్పాలి. కల్తీ కాకుండా ఉండేందుకు అదే రకానికి సంబందించిన గడ్డిని పరుచుకోవడం ఉత్తం. గడ్డి అందుబాటులో లేనప్పుడు గోనె సంచులు లేదా షేడ్‌ నెట్‌లను వాడుకోవచ్చు. పాలిథీన్‌ షీటు పర్చిన పక్కనుండి బురద మట్టి తీస్తాము కనుక అది ఒక కాలువగా మారి, బెడ్‌కు నీరు పెట్టుకోవడానికి, తీసుకోవడానికి ఉపయోగపడుతుంది.





ప్లాస్టిక్‌షీట్లపై నారు పెంచినప్పుడు వర్షం పడని రోజుతప్పా మిగతా రోజులలో తప్పకుండా నీరు పెట్టాలి. లేనట్టయితే సూర్యరశ్మి వేడికి షీటు బాగా వేడెక్కి నారు చనిపోయే ప్రమాదం ఉంటుంది. షీట్లపై పర్చిన గడ్డి లేదాగోనె సంచులు షేడ్‌ నెట్‌లను వారం రోజుల తర్వాత తీసేయాలి. అవసరాన్నిబట్టి నారుపై 19:19:19 లేదా 13:0:45, 10గ్రా. లీ నీటికి ద్రావణాన్ని పిచికారి చేసుకోవాలి. నారుమడులల్లో జింకు, ఇనుపధాతులోప లక్షణాలు అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి. ఇనుము లోపం వల్ల లేత చిగురుటాకులు తెల్లగా మారి ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఇటుక రంగు మచ్చలు వచ్చి ఆకులు నిర్జీవమవుతాయి. నివారణకు 10 లీటర్ల నీటికి 25గ్రా. ఫెర్రస్‌ సల్ఫేట్‌ కలిపి రెండు సార్లు పిచికారి చేయాలి. జింకు లోపం వల్ల మధ్య ఈనెకు ఇరుపక్కల తువ్వ లేక ఇటుక రంగు మచ్చలు కనపడతాయి.






నివారణకు 10 లీటర్ల నీటికి 10గ్రా. జింకు సల్ఫేట్‌ చొప్పున కలిపి పిచికారి చేయాలి. నారు ఎత్తు 15నుంచి 20 సెం.మీ, 3 ఆకులు కలిగిన 14నుంచి 17 రోజుల నారు మిషన్‌ద్వారా నాటు వేసుకోవడానికి అనుకూలం.సరైన నారును మడత చేసుకుని నాటు యంత్రాల ద్వారా నాటుకోవచ్చు.పొలం తయారు చేసుకోవడం పంట కాలం పూర్తయిన తర్వాత ఒకసారి ట్రాక్టర్‌ కల్టివేటర్‌తో ఒట్టి దుక్కి చేయాలి. యంత్రాలతో వరి నాటడానికి ముందుగా పొలాన్ని రెండు మూడు సార్లు రోటవేటర్‌తో దమ్ముచేసుకోవాలి. మొదటిసారి లోడ్‌గేర్‌తో రెండోసారి హైస్పీడ్‌ గేరుతో రోటవేటర్‌ను నడపాలి. దీనివల్ల నీరు ఇంకకుండా ఉంటుంది. మిషన్‌లలో నాటు వేసే పొలాలను ట్రాక్టర్‌తో ఎక్కువ సార్లు దమ్ము చేయడం వల్ల భూమి కుంగే గుణం ఎక్కువై నాటుకు కష్టమవుతుంది. అందువల్ల ఎక్కువసార్లు దమ్ము చేయకూడదు.


మరింత సమాచారం తెలుసుకోండి: