భారత టెలికాం చరిత్రలో తనదైన ముద్ర వేసుకున్న ప్రభుత్వ టెలికాం సంస్థ భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బీఎస్ఎన్‌ఎల్‌) సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. మిగతా ప్రైవేట్ టెలికాం సంస్థలకు పోటీ ఇవ్వలేక కింద మీద పడుతోంది. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉండిపోయింది. పైగా బి‌ఎస్‌ఎన్‌ఎల్ కు 4జీ స్పెక్ట్రమ్‌ లేకపోవడం ఇంకా ఇబ్బందిగా మారింది. దీంతో ఈ సంక్షోభాలు నుంచి బయటపడేందుకు బి‌ఎస్‌ఎన్‌ఎల్ ఓ సంచలన నిర్ణయం తీసుకునే దిశగా వెళుతుంది. అందులో ముఖ్యంగా 70 నుంచి 80 వేల మంది ఉద్యోగులు స్వచ్ఛందంగా వైదొలిగేందుకు వీలుగా స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్‌) పథకాన్ని ఆఫర్‌ చేయనున్నారు.


ఎందుకంటే సంస్థలో వచ్చే ఆదాయంలో 75 శాతం ఉద్యోగాల జీతానికే పోతుంది. అందుకే వీఆర్ఎస్ పథకాన్ని ఆకర్షణీయంగా రూపొందించి అమలు పరచాలని చూస్తోంది. ఇక వీఆర్‌ఎస్‌ పథకాన్ని ఉపయోగించుకునే సిబ్బందికి ఆకర్షణీయమైన ప్యాకేజీలు ఆఫర్‌ చేయాలంటే భారీ మొత్తంలో నిధులు అవసరమవుతాయి. ఇందుకోసం బి‌ఎస్‌ఎన్‌ఎల్ బాండ్ల జారీ ద్వారా నిధులు సేకరించే అవకాశం ఉంది. ఈ బాండ్లకు గాను కంపెనీ తన ఆస్తులను హామీగా చూపెట్టొచ్చు.


అటు బి‌ఎస్‌ఎన్‌ఎల్ కేంద్ర ప్రభుత్వం చేసే సాయం కోసం ఎదురు చూస్తుంది. ఇటీవల ఆర్థిక కష్టాల్లోంచి బి‌ఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్‌ను గట్టెక్కించేందుకు కేంద్రం భారీ బెయిల్ అవుట్‌ ప్యాకేజీ ప్రకటించవచ్చన్న ఊహాగానాలు కూడా వచ్చాయి. కానీ ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. అదేవిధంగా ఆర్ధిక సంక్షోభం నుంచి బయటపడేందుకు బి‌ఎస్‌ఎన్‌ఎల్ మరో నిర్ణయం తీసుకునేందుకు రెడీ అవుతుంది.


అందులో భాగంగా దేశవ్యాప్తంగా తన సొంత భూములను విక్రయించాలని బి‌ఎస్‌ఎన్‌ఎల్ చూస్తుంది. ఇక కంపెనీ అంచనా ప్రకారం గత ఆర్థిక సంవత్సరం బి‌ఎస్‌ఎన్‌ఎల్ భూములు మార్కెట్లో రూ.20,000 కోట్ల వరకు ధర పలికే అవకాశం ఉంది. ఈ భూములతోపాటు మొబైల్‌ టవర్లు, ఫైబర్‌ నెట్‌వర్క్‌ను విక్రయించగలిగితే దివాలా పరిస్థితుల నుంచి బయటపడొచ్చని కంపెనీ భావిస్తున్నట్లు సమాచారం.


ఇదిలా ఉంటే సంస్థలో ఉద్యోగులకు ఐదారు నెలలుగా జీతాలు అందలేదు. దాంతో దేశవ్యాప్తంగా కంపెనీ కార్యాలయాల్లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అయితే వీలైనంత మంది ఉద్యోగులు వీఆర్‌ఎస్‌ను ఎంచుకునే పరిస్థితులు కల్పించేందుకే జీతాల చెల్లింపును కావాలనే జాప్యం చేస్తున్నారని అంటున్నారు. ఇక వీఆర్ఎస్ ద్వారా ఒకేసారి వేలాది ఉద్యోగులని తొలగిస్తే మిగతా వాళ్ళ మీద పని భారం పడిపోతుంది. అలా కాకుండా ఉండేందుకు వివిధ ఉద్యోగాల్లో ఔట్‌సోర్స్‌ చేయడం లేదా కాంట్రాక్టు పద్ధతిలో కొందరిని నియమించుకునే ఆలోచన చేస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: