ఇంటర్నెట్ ద్వారా లభించే ఆన్ లైన్ వేదికను సోషల్ నెట్ వర్కింగ్ సర్వీస్ అంటున్నారు. దీని ద్వారా వివిధ వ్యక్తుల మధ్య సామాజిక సంబంధాలు ఏర్పడి సోషల్ నెట్ వర్క్ లుగా మారతాయి. ఇవి ఒకే రకమైన అభిరుచులు కలిగిన వ్యక్తుల మధ్య ఏర్పడవచ్చు. లేదా ఒకే ప్రయోజనాలు, కార్యక్రమాలు, నేపథ్యాలు కలిగిన వ్యక్తులు, బృందాల మధ్య ఏర్పడేవి కావచ్చు లేదా నిజ జీవితంలో స్నేహితులు, బంధువుల మధ్య ఏర్పడేవి కావచ్చు. ఈ సోషల్ వెబ్ సైట్లలో ప్రతీ వ్యక్తీ తన పేరు, వివరాలు, వృత్తి, ఆసక్తి, అభిరుచులతో కూడిన ప్రొఫైల్ ను ఏర్పాటు చేసుకోవచ్చు. దాని ద్వారా స్నేహితులతోనూ, కొత్తగా మిత్రులయ్యే వారితోనూ ఆన్ లైన్లో సంభాషించవచ్చు, బంధాలు పెంచుకోవచ్చు.


సోషల్ మీడియా అప్లికేషన్లు పలురకాలుగా విస్తరిస్తున్నాయి. ఇంటర్నెట్ మ్యాగజైన్లు, ఫోరంలు, వెబ్ బ్లాగులు, మైక్రో బ్లాగులు, వికీస్, పాడ్ కాస్ట్ లు, బొమ్మలు, వీడియోలు, రేటింగ్, సోషల్ బుక్ మార్కెటింగ్ సైట్లు మొదలైనవి సోషల్ మీడియాకు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. భారతదేశంలో సోషల్ మీడియా


సమాచార సాంకేతిక రంగాలకు ప్రాధాన్యతనిచ్చి సాంకేతిక పరిజ్ఞానాన్ని శరవేగంగా నేర్చుకొని, ప్రపంచదేశాలకు విస్తృత సేవలందిస్తూ, ఈ రంగంలో మొదటి వరుస దేశాల్లో స్థానం సంపాదించుకుంది భారతదేశం. అలాగే అంతర్జాలాన్ని వేగంగా అందుకుని దాని ప్రయోజనాల్ని పూర్తిగా వినియోగించుకోవడంతోపాటు పలు కొత్త ఆవిష్కరణలకు భారతీయులు దారివేశారు. ఈ రంగంలో సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్లు అందుబాటులోకిరావడంతో పూర్తిగా వినియోగించుకుంటున్నారు. అతి స్వల్పకాలంలోనే మనదేశంలో, ముఖ్యంగా యువతలో ఈ సైట్లు అమితమైన ప్రజాదరణను పొందాయి.  మనదేశంలో సోషల్ మీడియా ఏటా 100 శాతం వృద్ధి చెందుతోంది.  భారత్, ఇతర ప్రపంచ దేశాలలో సంప్రదాయ మీడియాకి సోషల్ మీడియా పెనుసవాలు విసురుతోంది. పరస్పరం మాట్లాడుకునే పాత తరహా పద్ధతిని సోషల్ మీడియా దెబ్బతీస్తున్నదనే విమర్శలు ఉన్నప్పటికీ కొత్త కొత్త పద్ధతుల్లో ఈ లోటును పూడుస్తుంది.


సోషల్ నెట్ వర్కింగ్, సోషల్ మీడియా వృద్ధికి దోహదం చేసిన ప్రముఖ సాధనాలలో మొబైల్ ఫోన్ ఒకటి. నీల్సన్ నివేదిక ప్రకారం సోషల్ మీడియాతో అనుసంధానానికి చాలా మంది స్మార్ట్ ఫోన్ లు, టాబ్లెట్ లను వాడుతున్నారు. ఎప్పుడైనా, ఎక్కడినుంచైనా, ఎలా కావాలన్నా సోషల్ మీడియా వాడుకునే స్వేచ్ఛ లభించింది. పట్టణ ప్రాంత భారతీయులలో విస్తృతంగా ఇంటర్నెట్ వినియోగిస్తున్నారు.  ప్రతి నలుగురిలో ముగ్గురు సోషల్ మీడియాను వాడుతున్నారు. మొబైల్ ద్వారా సోషల్ నెట్ వర్క్ సగటు వినియోగంలో భారతదేశం ముందువరుసలో ఉంది.


టెలివిజన్, పత్రికల స్థాయిలో సోషల్ మీడియా ఏ మేరకు ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేస్తుందనే అంశంపై ఇప్పటికి స్పష్టత రాలేదు. ఇంటర్నెట్ అందుబాటు, వినియోగంలో గ్రామీణ-పట్టణ ప్రాంతాల మధ్య అంతరాలు ఉన్నాయి.  ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియా పెరగుతూనే ఉంది. భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశముంది. అలాగే పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో ఈ విషయంలో తీవ్రమైన అంతరాలు ఉండడం సోషల్ మీడియా వినియోగానికి ఆటంకంగా మారుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: