ఇంటర్నెట్ డెస్క్: రెస్టారెంట్‌కు వెళ్లినా, హోం డెలివరీ తీసుకున్నా.. ఎలా అయినా చిన్నా, పెద్దా తేడా లేకుండా ఇష్టపడి తినే ఆహార పదార్థం ఏదో తెలుసా..? పిజ్జా. అవునండీ 2020లో అత్యధికంగా దీనికోసమే ఆన్‌లైన్‌లో సెర్చ్ చేశారట నెటిజన్లు. పలు పరిశోధనల్లో, అధ్యయనాల్లో తేలటమే కాదు ఫుడ్ సర్వీసు చేసే రెస్టారెంట్ల డేటా కూడా ఇదే విషయాన్ని మరోమారు తేటతెల్లం చేసింది.

గ్లోబల్‌గా అత్యధిక ఆర్డర్లు పొందే ఏకైక ఫుడ్ పిజ్జానేని 2020 పిజ్జా ఆర్డర్లు మరోసారి బల్లగుద్ది మరీ చెప్పాయి. విదేశాలతో పాటు మనదేశంలోనూ ఈ పిజ్జాకు భారీ గిరాకీ ఉంది. ఇండియా, అర్జెంటినా, ఈజిప్ట్, ఫ్రాన్స్, ఫిన్లాండ్, మొరాకో, స్పెయిన్, జర్మనీ, సౌత్ కొరియా.. వంటి దేశాలన్నింటిలో అత్యధికంగా ప్రజలు ఇష్టపడే ఆహారంగా పిజ్జా రికార్డు నెలకొల్పింది.

పిజ్జా.. ఓ ఇటీలియన్ వంటకం. ఇటలీలోని నేపుల్స్‌లో వర్కింగ్ క్లాస్ ప్రజలు 18వ శతాబ్దంలో కనిపెట్టారు. పని మధ్యలో తినడానికి తక్కువ సమయం దొరకడంతో వెంటనే అయిపోవాలని రొట్టెలను ఇలా చేసుకుని తినేవారట. చాలా ఈజీగా, చిటికెల్లో తయారు చేసే ఆహారం కావటంతో వీరంతా ఫ్లాట్ బ్రెడ్ తయారు చేయటం, దానిపై వారికి నచ్చిన టాపిన్స్ వేసుకుని నిమిషాల్లో తినేసి పనిలో పడేవారట.

ఇక పిజ్జా తరువాత అత్యధికంగా చైనీస్ ఫుడ్స్‌కు గిరాకీ ఉందట. అమెరికా, చైనా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, నేపాల్, శ్రీలంక, చిలీ, బొలీవియా, నైజీరియా, ఘనా వంటి దేశాల్లో చైనీస్ ఫుడ్ సేల్స్ పరంగా 2వ స్థానంలో నిలిచింది. మనీబీచ్ అనే సంస్థ చేసిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. మూడో స్థానంలో జపాన్‌కు చెందిన సూషి ఉందట.

దాదాపు 10 దేశాల్లో సూషీ టాప్ సెర్చింగ్స్‌లో ఉందట. అక్కడి ప్రజలు ఈ డిష్‌ను ఇష్టంగా తింటున్నారట. జపాన్‌తో పాటు బ్రెజిల్, మొజాంబిక్, స్వీడన్, వియత్నాం, ఉక్రెయిన్, రొమేనియా వంటి పలు దేశాల్లో సూషీకి చాలా డిమాండ్ ఉందట. ఆ తరువాత నాలుగో స్థానంలో బ్రిటీష్ స్టాపుల్ గా పేరుగాంచిన ఫిష్ అండ్ చిప్స్ ఉన్నాయి. ఐదో స్థానంలో ఫ్రైడ్ చికెన్ ఉంది. ఐదో స్థానంలో మన భారతీయ వంటకాలున్నాయి.

ప్రపంచమంతా ఇప్పుడు పిజ్జా మయం అయిపోయింది. అంతేకాదు ఆయా దేశాల్లో ప్రజల ఇష్టాలకు, అభిరుచులకు అనుగుణంగా పిజ్జా తయారీలో మార్పులు చేశారు. ఉదాహరణకు మనదేశంలో ఇండి మసాలా, ఇండి తందూరి పనీర్, ఇండియన్ టికా మసాలా పిజ్జా, చెట్టినాడ్ పిజ్జా వంటివి రావటంతో మనవారు వీటిని లొట్టలేసుకుని లాగించేస్తున్నారు. వెజ్, నాన్ వెజ్, వేగన్ పిజ్జాలతో పాటు ఫ్రూట్ పిజ్జాలు కూడా హాట్ కేకుల్లా మారాయి. పిజ్జా డెలివరీ చెయిన్స్ అయిన డామినోస్, పిజ్జా హట్, యుఎస్ పిజ్జా వంటి బ్రాండ్లు పిజ్జాను చిటికెల్లో డెలివరీ చేస్తూ మంచి బిజినెస్ చేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: