కార్లంటే అందరికి ఇష్టమే. ప్రతి ఒక్కరూ హాయిగా కార్లో కూర్చొని విహారించాలని కోరుకుంటారు. కొంతమందికి కార్లంటే పిచ్చి. పిచ్చంటే మామూలు పిచ్చి కాదండోయ్. మహా పిచ్చి. ఆ పిచ్చి వల్ల ఏమేమో పిచ్చి పనులు చేస్తారు. అలాగే ఓ వ్యక్తి స్పోర్ట్స్ కార్ కావాలనే పిచ్చితో ఏకంగా 40 రోజులు దీక్ష చేశాడు.వివరాల్లోకి వెళితే...జింబాబ్వేలోని రిసెన్ సైంట్స్ చర్చ్‌కు చెందిన నాయకుడు మార్క్ మార్దాజిరాకు ఈ ఆలోచన కలిగింది. అతడికి ఎన్నాళ్ల నుంచో ఖరీదైన లంబోర్ఘిని స్పోర్ట్స్ కార్ కొనాలని ఆశ. అయితే, తన కోరికను కేవలం దేవుడు మాత్రమే తీర్చగలడని మార్క్ నమ్మకం. ఈ సందర్భంగా అతడు దేవుడిపైనే భారం వేసి.. 40 రోజులు 40 రాత్రులు కఠిన ఉపవాస దీక్ష చెయ్యాలని ఫిక్స్ అయ్యాడు.


కార్ ఖరీదు కోటిన్నర కావడంతో మార్క్ దేవుడు పైనే భారం వేసి దీక్ష కోసం ఇంటిని వదిలేసి పర్వత ప్రాంతాల్లోకి వెళ్లిపోయాడు. మన దేశ చరిత్రలో ఋషులు లాగే ఒంటరిగా తప్పస్సు చేస్తున్నాడు. అడవుల్లో తనకు తినేందుకు ఏమీ లభించవని, పైగా ఎవరూ తనని ఆహారం తినాలని ఒత్తిడి చేయలేరని మార్క్ తెలిపాడు. అయితే, అతడు ఊహించినట్లుగా ఏమీ జరగలేదు. పైగా ఉపవాస దీక్ష వల్ల అతడు బాగా బలహీనమైపోయాడు. 33 రోజులు గడిచిపోవడంతో అతడు అనారోగ్యంతో కదల్లేకపోయాడు.

అతను ఎక్కడున్నాడో తెలుసుకోవడం కోసం ఆహారం తినిపించాలని అతడి స్నేహితులు ఎంతో ప్రయత్నించారు. అడవిలో ఉండటం వల్ల అది సాధ్యం కాలేదు. చివరికి ఆ పర్వత ప్రాంతం అంతా తిరిగి 33వ రోజు రిసెన్ ఆచూకీ తెలుసుకున్నారు. హుటాహుటిన అతడిని దగ్గర్లో బిందురా జనరల్ హాస్పిటల్‌లో చేర్చారు. ఇంకాస్త ఆలస్యమై ఉంటే అతడు అడవిలోనే చనిపోయేవాడు.ఇక ఆ తరువాత స్నేహితులు అతడికి గట్టిగానే గడ్డి పెట్టారు. కారు గురించి కాకుండా మంచి ఉద్యోగం కోసం ప్రయత్నించి ఉంటే జీవితంలో స్థిరపడేవాడని, ఆ సంపాదనతో కారు కొనుక్కోవచ్చని చెప్పారు. అయితే, మార్క్ సైలెంట్ గానే వుండిపోయాడు. ఇప్పటికీ అతడు ఆ దేవుడు లంబోర్ఘిని స్పోర్ట్స్ కారును కానుకగా ఇస్తాడనే ఆశతోనే ఉన్నాడు.ఈ సమాచారం మీడియాకు తెలియడంతో నెట్టింటా తెగ వైరల్‌ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: