ఈ త‌రం కుర్రాళ్లు ఈజీగా డ‌బ్బు సంపాదించాల‌నే ఆశ‌తో ప‌లు నేరాల‌కు పాల్ప‌డుతున్న ఘ‌ట‌న‌లు ఎన్నో చోటు చేసుకుంటుంటాయి. కొంద‌రూ ఈజీగా కోట్లు సంపాదించాల‌ని క‌ల‌లు కంటుంటారు. కానీ ఆచ‌ర‌ణ‌లో మాత్రం నోచుకోదు. మ‌రికొంద‌రేమో ఎంత క‌ష్ట‌ప‌డినా అంతంత మాత్రం సంపాద‌న‌ల‌తో బ‌తుకు వెళ్ల‌దీస్తూ ఉంటారు యువ‌కులు. ముఖ్యంగా కేర‌ళ‌లో ఓ వ్య‌క్తి గురించి త‌ప్ప‌కుండా తెలుసుకోవాలి ఎవ‌రైనా.. త‌న కాళ్లు చ‌చ్చుబ‌డి మంచానికి ప‌రిమితం అయినా ప‌ట్టుద‌ల‌ను మాత్రం వ‌ద‌ల‌లేదు. మంచం దిగ‌లేకుండా ఉన్నా కానీ కోట్లు సంపాదిస్తూ.. అంద‌రికీ ఆద‌ర్శంగా నిలుస్తూ ఉన్నాడు.

కేరళలోని కాసరగడ్ జిల్లా ఈస్ట్ ఎలేరి పరిధిలో ఉన్న కంబలోర్‌కు చెందిన షాజవాస్(47) డిగ్రీ పూర్తయ్యాక పరప్పా అనే ప్రాంతంలో ఓ ఎలక్ట్రికల్ షాపు నడిపించేవాడు.  అదే ప్రాంతంలో అతని మేనమామ కలప వ్యాపారం చేస్తుండేవాడు. ఈ త‌రుణంలోనే అతని మేనమామ ఆకస్మికంగా మృతి చెందాడు.  ఆ త‌రువాత ఆ వ్యాపారాన్ని షాజవాస్ కొనసాగించాడు. విజయవంతంగా వ్యాపారం చేస్తూ మంచి లాభాలను కూడా పొందేవాడు. అనంత‌రం రెహ్మత్ అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

వ్యాపారంలో లాభాల బాటలో దూసుకుపోతున్న క్రమంలో షాజవాస్ జీవితంలో అనుకోని ఘటన ఎదురైంది.  కలప కొనుగోలు చేసేందుకు 2010 మేలో కరకాల అనే ప్రాంతానికి వెళ్లాడు. రెండు లారీల్లో కలపను లోడ్ చేయించి,  లారీలను తీసుకుని తన మిత్రుడితో పాటూ తిరుగు ప్ర‌యాణంలో కారులో వస్తున్నాడు. కేరళ సరిహద్దు దాటి కునియ సమీపంలోని పెరియతడుకమ్ చేరుకునే  వ‌ర‌కు రాత్రి స‌మ‌యం అయింది. తన మిత్రుడు కునుకు తీశాడు. దీంతో వాహనం ఓ వైపునకు వెళ్తూ ఉన్న‌ది. చేయితో తట్టి లేపగా.. ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేసాడు.  ఒక్క‌సారిగా వాహనం పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో షాజవాస్‌ తలకు తీవ్ర గాయాలయ్యాయి.

ఇది గమనించిన స్థానికులు అతన్ని సమీపంలోని కన్హంగాడ్ ఆసుపత్రికి తరలించారు. రక్తం ఎక్కువగా పోవడంతో పరిస్థితి సీరియస్ గా మారింది. తిరిగి మంగళూరులోని యూనిటీ ఆసుపత్రికి తరలించారు. అక్క‌డ పరీక్షించిన వైద్యులు.. తలలో స్పైనల్ కార్డ్ దెబ్బతిన్న‌దని వెల్ల‌డించారు.  ఆపరేషన్ చేయడం కష్టమవ్వ‌డంతో  దాదాపు నాలుగు నెలల పాటు ఐసీయూలోనే ఉంచారు. అనంతరం ఆపరేషన్ చేసేందుకు వెల్లూరులోని క్రిస్టియన్ మెడికల్ క‌ళాశాల‌కు తరలించారు. ఎట్టకేలకు ఆపరేషన్ విజయవంతం అయింది.  దాదాపు అక్క‌డే ఐదు నెలలు పాటు ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.

ఆపరేషన్ పూర్తయినా నడవడం మాత్రం కష్టమని వైద్యులు చెప్పారు. మంచానికి పరిమితం కావాల్సిన పరిస్థితి వచ్చినా అతను మాత్రం  భయపడలేదు. అక్కడి పరిస్థితులు చూశాక ఎలాగైనా బతికి సాధించాలని, వ్యాపారం కొనసాగించాలని బ‌లంగా  నిర్ణయించుకున్నాడు. వైద్యానికి డబ్బులు భారీగా ఖర్చు చేయడంతో వ్యాపారం చేసేంత పెట్టుబడి తన దగ్గర లేదని, అతని భార్య తన ఆభరణాలను ఇవ్వ‌డంతో వాటిని తాకట్టు పెట్టడం ద్వారా వచ్చిన మొత్తంతో కలప కొని వ్యాపారం మొద‌లు పెట్టాడు.  లాభాలు రావడంతో మళ్లీ కలప కొనడం, అమ్మడం చేసేవాడు.

మంచానికే ప‌రిమిత‌మైన త‌న ఎడ‌మ చెవికి ఎయిర్ పాడ్ త‌గిలించుకుని వ్యాపారం ప‌ర్య‌వేక్షిస్తూ ఉన్నాడు. టింబ‌ర్ డిపోలో సీసీ కెమెరాల‌ను ఏర్పాటు చేసి, త‌ద్వారా కార్య‌కలాపాల‌ను ప‌ర్య‌వేక్షిస్తుంటాడు. విలువైన కోట్ల రూపాయ‌ల వ్యాపార కార్య‌క‌లాపాల‌ను మంచంపై నుంచే ప‌ర్య‌వేక్షిస్తున్నాడు. కోట్ల రూపాయ‌ల‌కు ఇప్పుడు అధిప‌తి అయ్యాడు. త‌న ఇద్ద‌రు కూతుర్లు, భార్య స‌హ‌కారంతోనే సాధ్యం అయింద‌ని గ‌ర్వంగా చెబుతున్నాడు షాజ‌వాస్‌. విదేశాల నుంచి క‌ల‌ప‌ను తెప్పిస్తూ.. వ్యాపారాన్ని మ‌రింత విస్త‌రించాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: