ఆయనో రాజకీయ శిఖరం... రాజకీయాల్లో ఆయన చూడని ఎత్తులు లేవు పై ఎత్తులు లేవు. మొదటి ప్రధాని నుంచి... మన్మోహన్ సింగ్ వరకు ఆయన చూడని ప్రధానులు లేరు ఆయన చూడని రాష్ట్ర పతులు లేరు. రాజకీయాల్లో ఆయనను మించిన వ్యూహ చతురత కలిగిన నాయకుడు, విపక్షాలకు కూడా ఆయనను మించిన సౌమ్యుడు లేరు. ఆయన రాజకీయం చేస్తే కర్రా విరగదు పాము చావదు. ఆయన రాజకీయం చేస్తే విపక్షాలు కూడా ఆయనను గట్టిగా విమర్శలు చేయలేవు. ఆయన మాటలు తూటాలు... 

 

ఆయన ఒక్క మాట మాట్లాడితే దాని వెనుక ఎంతో పెద్ద అర్ధం ఉంటే గాని మాట్లాడరు. అనవసర ప్రసంగాలు ఆయన నుంచి రావు.  ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ నుంచి ఎవరు సిఎం అయినా సరే ఆయన కేబినేట్ లో ఉండాల్సిందే. ప్రజల్లో మాస్ ఇమేజ్ లేకపోయినా సరే ఆయనకు ప్రభుత్వంలో మాత్రం  సిఎం తర్వాత సిఎం గా ప్రాధాన్యత ఉండేది. హోం మంత్రి అయినా ఆర్ధిక మంత్రి అయినా రెవెన్యూ శాఖా మంత్రి అయినా సరే ఆయన నిర్ణయాలను కాదనేవారు ఉండరు. ఆయన ఒక సూచన చేస్తే దాన్ని కచ్చితంగా అమలు చెయ్యాల్సిందే. 

 

ఆయన ఒక్క మాట చెప్తే పార్టీలో అయినా, ఏ ప్రభుత్వంలో అయినా, ఏ సిఎం ఉన్నా సరే, ఎలాంటి మంత్రి అయినా సరే పని జరగాల్సిందే. ఎందరో సిఎం లను చూసారు, ఎందరో నాయకులు ఆయన కళ్ళ ముందే పైకి వచ్చారు. ఆయనను ఇబ్బంది పెట్టిన నాయకుడు లేరు, ఆయన ఇబ్బంది పెట్టిన నాయకుడు లేరు. ఆయనే కొణిజేటి రోశయ్య. ఆర్ధిక శాఖా మంత్రిగా రెవెన్యూ శాఖా మంత్రిగా, మండలిలో విపక్ష నేతగా, హోం మంత్రిగా, ఎంపీ గా ఆయన సాధించని విజయాలు లేవు. ఆయనకు దక్కని గౌరవం కూడా లేదు. 

 

టెన్ జన్ పద్ లోకి నేరుగా వెళ్ళిపోయే తెలుగు నాయకుడు ఆయన ఒక్కరే. టెన్ జన్ పద్ అంటే దేశ రాజకీయాలను శాసించిన భవనం. అలాంటి భవనం లోకి ఆయనకు ఏ చెకింగ్ ఉండదు, ఆయనను ఆపే వారు ఉండరు. ఆయన వెళ్తే అప్పుడు ఇందిరా లేచి నిలబడే వారు, ఆ తర్వాత రాజీవ్ నిలబడ్డారు, ఆ తర్వాత సోనియా, మన్మోహన్, పీవీ ఎవరు అయినా సరే ఆయన వెళ్తే నిలబడాల్సిందే. గాంధీ కుటుంబానికి నమ్మిన బంటు. రాజకీయ జీవితంలో పార్టీలు మారని ఏకైక నాయకుడు ఆయన ఒక్కడే. 

 

ఉమ్మడి ఏపీలో ఆయన సాధించిన విజయాలు ఇప్పటి వరకు ఏ ఆర్ధిక మంత్రి కూడా సాధించలేని విధంగా ఆయన దూసుకుపోయారు. 1978 నుండి ఎం. చెన్నా రెడ్డి ఆధ్వర్యంలో  రాష్ట్ర రవాణా మరియు రోడ్లు మరియు భవనాల మంత్రి, 1980 నుండి టి. అంజయ్య ఆధ్వర్యంలో ఎపి రాష్ట్ర రవాణా మరియు గృహనిర్మాణ మంత్రి. 1982 నుండి కోట్ల విజయ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర హోంమంత్రి, 1989 నుండి ఎం. చెన్నా రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ఆర్థిక, రవాణా మరియు విద్యుత్ శాఖ మంత్రి. 

 

1990 డిసెంబర్ నుండి నేదురుమల్లి జనార్థనారెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య, విద్య మరియు విద్యుత్ శాఖల మంత్రి. అక్టోబర్ 1992 నుండి కోట్ల విజయ భాస్కర రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య, విద్య మరియు విద్యుత్ శాఖ మంత్రి. ఏప్రిల్ 2004 నుండి వైయస్ రాజశేఖరరెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక మరియు శాసన వ్యవహారాల మంత్రి. 31 ఆగస్టు 2011 - 30 ఆగస్టు 2016 వరకు తమిళనాడు గవర్నర్ గా. అప్పుడే ఏపీ సిఎం గా కిరణ్ కుమార్ రెడ్డి బాధ్యతలు చేపట్టగా ఆయనకు ఏదోక పదవి ఇవ్వాలని భావించి తమిళనాడు గవర్నర్ ని చేసారు సోనియా. 

 

స్వతంత్ర అభ్యర్ధిగా రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ఆయన అక్కడి నుంచి కాంగ్రెస్ లో తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. గెలుపు ఓటములు ఆయనకు సంబంధం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది అంటే ఆయన పదవికి ఏ డోకా ఉండదు. 1968, 1974, 1980 మరియు 2009 లో ఎమ్మెల్సీ గా మరియు చిరాల అసెంబ్లీ నియోజకవర్గం నుండి 1989 మరియు 2004 లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1998 లో నరసరావు పేట నుంచి ఎంపీ గా ఆయన ఎన్నికయ్యారు.

 

వైఎస్ అకాల మరణంతో ఆయనకు క్లిష్ట పరిస్థితుల్లో సిఎం గా ఎన్నికయ్యే పరిస్థితి వచ్చింది. ఆయన సిఎం అనగానే అప్పటి కాంగ్రెస్ నాయకులు ఎవరూ కూడా ఆయనను కాదనలేదు. జేసి దివాకర్ రెడ్డి లాంటి సీనియర్ నేతలు ఉన్నా సరే ఆయనను వద్దని ఎవరూ చెప్పలేదు. అయితే తెలంగాణా ఉద్యమాన్ని ఆయన కట్టడి చేయలేకపోయారు అనే  పేరు ఆయనను బాగా ఇబ్బంది పెట్టింది. రోసయ్య రాష్ట్ర బడ్జెట్‌ను వరుసగా 7 సార్లు సహా 16 సార్లు రాష్ట్ర బడ్జెట్‌లో సమర్పించారు. ఇప్పటి వరకు దేశంలో ఏ ఆర్ధిక మంత్రికి దక్కని గౌరవం ఇది.

 

మర్రి చెన్నా రెడ్డి , కోట్ల విజయ భాస్కరారెడ్డి , నేదురుమల్లి జనార్థనారెడ్డి మరియు వైయస్ రాజశేఖరరెడ్డి ఆధ్వర్యంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు . చెన్నా రెడ్డి మంత్రివర్గంలో ఆర్థిక మంత్రిగా ఉన్న కాలంలో, ఉపాధ్యాయులకు పదవీ విరమణ ప్రయోజనాలు అందేలా చూసారని ఆయనను ఇప్పటికీ కీర్తిస్తారు. ఏ శాఖ నిర్వహించినా సరే ఆ శాఖకు ఆయన ఒక అందం తీసుకొస్తారు. శాంతి భద్రతలు అయినా సరికొత్త సంస్కరణలు అయినా, కఠిన నిర్ణయాలు అయినా సరే ఆయన తర్వాతనే ఎవరు అయినా అనే విధంగా ఆయన వ్యవహరించారు. నేడు ఆయన జన్మదినం కావున... ఆయనే నేటి హెరాల్డ్ విజేత.

మరింత సమాచారం తెలుసుకోండి: