కరోనా మహమ్మారి నుంచి ప్రజల ప్రాణాలను కాపాడేందుకు డాక్టర్లు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి చికిత్స చేస్తున్నారు. అలాంటి డాక్టర్లకు మనస్ఫూర్తిగా చేతులెత్తి మొక్కాలి. అయితే వీళ్ళందరూ ఒక ఎత్తు ఐతే, ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్న డాక్టర్ గారు మరొక ఎత్తు. ఆయన పేరు రామచంద్ర దనేకర్. ఆయనొక హోమియోపతి మహారాష్ట్రలోని చంద్రపూర్ లో నివాసం ఉంటున్న ఈయన కరోనా సోకిన పేద ప్రజల ఇళ్లకు వెళ్ళి మరీ చికిత్స చేస్తున్నారు. ఇది ఎంత గొప్ప విషయమో కదా. ఇదే గొప్ప విషయం అనుకుంటే, ఆయన సైకిల్ మీద వెళ్ళి మరీ చికిత్స చేస్తున్నారు. అదీ 87 ఏళ్ల వయసులో. ఆ వయసులో సైకిల్ తొక్కడం చాలా కష్టం. పైగా ఈ వయసు వారికి కరోనా సోకే అవకాశాలు ఎక్కువ. అయినా సరే లెక్క చేయక కరోనా రోగులకి వైద్యం అందిస్తున్నారంటే ఈయన్ని ఏమని పిలవాలి? దేవుడు కన్నా పెద్ద పదం ఏం ఉంటుంది చెప్పండి. అందుకే ఈయన్ని అక్కడి వారు దేవుడు అని పిలుస్తుంటారు.


ఈ దేవుడు రోజుకి 10 నుండి 15 కిలోమీటర్లు సైకిల్ మీద ఇంటింటికీ తిరుగుతూ కరోనా సోకిన వారికి వైద్యం అందిస్తారు. ఆయన డాక్టర్ గా స్టెతస్కోప్ పట్టినప్పటి నుంచి ఇప్పటివరకూ ఎంతో మంది పేదలకు వైద్యం అందించారు. 60 ఏళ్ళలో రోజూ దాదాపు అన్ని గ్రామాలకి వెళ్ళి వైద్యం అందించేవారని అన్నారు. కరోనా వల్ల డాక్టర్లు పేద వాళ్ళకు చికిత్స చేసేందుకు వెనకడుగు వేస్తున్నారు. కొంతమంది డాక్టర్లు ఐతే కేవలం డబ్బుల కోసమే పని చేస్తున్నారు. పేదలకు సేవ చేయాలన్న ఆలోచన వారికి లేదు. అందుకే నేను ఈ వయసులో కూడా సైకిల్ మీద వెళ్తూ, కరోనా వస్తుందన్న భయం లేకుండా, డబ్బు కోసం ఏ మాత్రం ఆలోచించకుండా సేవే లక్ష్యంగా పేదలకు వైద్యం అందిస్తున్నానని డాక్టర్ రామచంద్ర గారు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.


ఈ వయసులో కృష్ణా రామ అని ఇంట్లో కూర్చుని సరదాగా మనవలతో ఆడుకోకుండా పేద ప్రజలే మనవాళ్లు, వాళ్ళే నా వాళ్ళు అనుకుని జీవిస్తున్నారంటే చాలా గొప్ప మనసు ఆయనది. సైకిల్ మీద రోజూ అన్ని కిలోమీటర్లు తొక్కుకుంటూ ఆయాసపడడం ఎందుకు? నాకెందుకొచ్చిన తలనొప్పి అని అనుకోలేదు. ఈ వయసులో రిస్క్ చేయడం ఎందుకు అని భయపడలేదు. హాస్పిటల్ లో ఉంటే వాళ్ళే వస్తారు, నేనెందుకు వాళ్ళ దగ్గరకి వెళ్ళాలి అని అనుకోలేదు. డబ్బు వెనకేసుకోవడానికి ఇదే సరైన సమయం అని కొంతమంది కక్కుర్తి డాక్టర్స్ లా డబ్బు కోసం ఆశపడలేదు. అందుకే ఆయన ఇండియాలోనే గొప్ప డాక్టర్ గా పేరు తెచ్చుకున్నారు. ఆయనకి ఇప్పుడు లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. 


నీకెందుకు, నాకెందుకు అనే రెండు పదాలతో లైఫంతా స్వార్ధంతో బతికేస్తున్న నేటి సమాజంలో ఇలాంటి నిస్వార్ధపరులు ఉండడం వల్లే ఈ భూమి ఇంకా పచ్చగా ఉంది. డబ్బుకి ఆశపడకుండా, జబ్బుకి భయపడకుండా, వయసుతో సంబంధం లేకుండా ఈయనలా ఉంటే ప్రతీ ఒక్క డాక్టరూ దేవుడే అవుతారు. మరి ప్రతీ డాక్టరూ యాక్టర్ లా కాకుండా, దేవుడై ప్రజలకి, ముఖ్యంగా పేదలకు మెరుగైన వైద్యం అందిస్తారని ఆశిద్దాం. అలానే పేద ప్రజల దేవుడయినటువంటి డాక్టర్ రామచంద్ర దనేకర్ గారికి భారతీయులందరి తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఈయన చేస్తున్న సేవలకు గాను ప్రభుత్వం ఆయనకు అవార్డు అభినందించాలను కోరుకుందాం. సెల్యూట్ డాక్టర్ రామచంద్ర గారు.



మరింత సమాచారం తెలుసుకోండి: