భారతీయ విమాన రంగం మరో ముందడుగు హైదరాబాదులో ఉన్న శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఒక మైలురాయిని అందుకుంది.హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం అన్ని దేశీయ గమ్యస్థానాలకు, అన్ని రకాల ఎయిర్‌లైన్స్ సంస్థల ద్వారా ఈ-బోర్డింగ్ సేవలను అందిస్తున్న విమానాశ్రయంగా గుర్తింపు పొందింది. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఇప్పుడు ‘ఆత్మనిర్భర్’ స్ఫూర్తిని పాటిస్తూ, తాము సొంతంగా తయారు చేసిన ఈ-డిజిటల్ సొల్యూషన్‌ను అంతర్జాతీయ ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చింది.

తద్వారా భారతదేశంలో అంతర్జాతీయ ప్రయాణికులకు ఈ-బోర్డింగ్ సేవలను ప్రారంభించిన మొట్టమొదటి విమానాశ్రయంగా నిలిచింది హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం. భారత విమానయాన రంగంలోనే ఇదొక గొప్ప మైలురాయిగా విమానాశ్రయ యాజమాన్యం పేర్కొనింది.భారత ప్రభుత్వ డిజిటల్ ఇండియా లక్ష్యానికి అనుగుణంగా, GHIAL అంతర్జాతీయ ఈ-బోర్డింగ్ సేవలు కరోనా మహమ్మారి విజృంభిస్తున్న కాలంలో కూడా అంతర్జాతీయ ప్రయాణీకులకు భద్రతను మరింత చేకూరుస్తాయి. ప్రస్తుతం ఈ సేవలు ఇండిగో ఎయిర్ లైన్స్‌లోని ఎంపిక చేసిన అంతర్జాతీయ విమాన సర్వీసుల ప్రయాణికులకు అందుబాటులో ఉన్నాయి. పైలెట్ ప్రయోగాలు విజయవంతమై, ప్రభుత్వ ఆమోదం పొందిన అనంతరం ఈ ఈ-బోర్డింగ్ సేవలను అంతర్జాతీయ ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చారు.

అక్టోబర్ 2న ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన షార్జా విమానం 1405 మంది విమాన ప్రయాణికులు హైదరాబాద్ నుండి ఈ-బోర్డింగ్‌ సేవలను అందుకున్నారు. హైదరాబాద్ నుంచి బయలుదేరే మిగతా అంతర్జాతీయ షెడ్యూల్డ్ విమాన సర్వీసులలోనూ ఈ-బోర్డింగ్ సేవలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రపంచంలోనే భారత్ విమానయాన రంగం తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. ఎప్పటికప్పుడు విమానయాన రంగం అభివృద్ధి చెందుతూ సాంకేతికపరంగా ఎంతో ముందుకు సాగడం భారతదేశాన్ని అభివృద్ధి పథంలో ముందు నిలుపుతుంది అనడంలో ఎంత మాత్రం సందేహం లేదు ఇప్పటికే ప్రపంచ దేశాలు సాంకేతికపరంగా భారత్ వైపు చూస్తున్నాయి ఇప్పుడు విమానయాన రంగంలో మరో ముందడుగు వేయడం అది కూడా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఈ ఘనత దక్కడం ప్రతి ఒక్కరికి గర్వకారణం.

మరింత సమాచారం తెలుసుకోండి: