పోలీస్ అధికారిని కోడి పుంజు చంపేసింది. వినడానికి విచిత్రంగా ఉన్నా కూడా ఇది నిజం. అప్పుడెప్పుడో బాలకృష్ణ హీరోగా బి. గోపాల్ దర్శకత్వంలో వచ్చిన 'పల్నాటి బ్రహ్మనాయుడు' సినిమాలో ఒక కోడి భారీ ఆజానుబాహుడిని చంపే సన్నివేశం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఇప్పుడు నిజంగానే అలాంటి సన్నివేశం నిజజీవితంలో జరగడం ఆశ్చర్యకరం. వివరాల్లోకి వెళితే ఫిలిప్పీన్స్‌లోని ఉత్తర సమార్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తరహాలోనే ఫిలిప్పీన్స్‌లో కూడా కోడి పందాలు జరుగుతుంటాయి. మనం ఇక్కడ కేవలం సంక్రాంతి సంబరాల వరకు మాత్రమే పరిమితం చేస్తే.. అక్కడ మాత్రం నిత్యం జరుగుతూనే ఉంటాయి. కోళ్లపై భారీగా బెట్టింగులు కాస్తూ.. గుట్టుచప్పుడుగా ఈ పోటీలు జరుగుతుంటాయి. దీంతో పోలీసులు కోడి పందాలపై నిఘా పెట్టారు. అక్టోబరు 26న పోలీసులు కోళ్ల పందాల బెట్టింగులపై సమాచారం అందింది. దీంతో ప్రొవిజన్స్ పోలీస్ చీఫ్ కాలోనెల్ ఆర్నెల్ అపౌడ్ తన టీమ్‌తో అక్కడికి చేరుకున్నారు. కోళ్ల పందాల నిర్వాహకులపై దాడి చేశారు. ఈ సందర్భంగా ఓ కోడి పుంజు అపౌడ్ మీదకు దూసుకొచ్చింది. ఆయనపై దాడి చేసి గాయపరిచింది. అది తన కాళ్లకు ఉన్న విషపూరిత కోడి కత్తితో ఆయన తొడను చీల్చేసింది. అంతే, ఆయనకు తీవ్రంగా రక్తస్రావమైంది. హాస్పిటల్‌కు చేరే లోపే ఆయన ప్రాణాలు విడిచారు.

ఈ సమాచారం తెలియగానే పోలీసు ఉన్నతాధికారులు ఆశ్చర్యపోయారు. ఇక ఈ ఘటనకు కారణమైన నిందితులను ఇప్పటికే అరెస్టు చేశారు అని అధికారులు తెలిపారు. ఆ దేశంలో రెండు రకాలుగా కోడి పందాలు జరుగుతాయి. వారానికి ఒకసారి పోలీసుల అనుమతితో అధికారికంగా పోటీలు జరుగుతాయి. కొందరు మాత్రం మిగతా రోజుల్లో ఎలాంటి అనుమతులు లేకుండా చట్ట వ్యతిరేకంగా కోడి కాళ్లకు కత్తులు కట్టి మరీ పోటీలు నిర్వహిస్తారు. ప్రత్యర్థి కోడి చనిపోతేనే బెట్ గెలిచినట్లు. కరోనా వైరస్ నేపథ్యంలో పోలీసులు ఈ పోటీలపై నిఘా పెంచారు. ఈ పోటీలు చూసేందుకు వేలాది మంది ఒకే చోటుకు చేరడం వల్ల వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉన్న నేపథ్యంలో కోడి పందాలపై ప్రస్తుతం పూర్తి నిషేదం విధించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: