చెన్నై: సింగం సినిమాలో పోలీస్ క్యారెక్టర్ ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందో తెలుసు కదా..? తప్పు చేసిన వారిని వెంటాడి.. వేటాడి... పట్టుకునే పవర్ ఫుల్ క్యారెక్టర్ అది. అలాంటి పోలీస్ ఆఫీసర్‌ను నిజంగా చూశారా..? లేకపోతే ఈ వీడియో చూడండి. చెన్నైకు చెందిన ఈ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ బైక్‌పై వెళుతున్న దొంగలను ఛేజ్ చేసి మరీ పట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

శాంతిభద్రతలను కాపాడేందుకు పోలీసులు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. పగలూ, రాత్రీ తేడా లేకుండా అంకిత భావంతో పనిచేస్తుంటారు. అలాంటి పోలీసుల్లో కొంతమంది సూపర్ కాప్‌లూ ఉంటారు. వాళ్లలో ఒకరే రమేశ్. ఆయన చెన్నైలోని ఓ జోన్‌కు ఎస్‌ఐగా పనిచేస్తున్నారు. ఆయన కళ్లెదురుగా బండిపై వచ్చిన ఇద్దరు దొంగలు పక్కనే ఓ వ్యక్తి చేతిలోని మొబైల్‌ను లాక్కుని బండిపై పారిపోయారు. అక్కడే ఉన్న రమేశ్ వెంటనే వారిని తన బైక్‌పై వెంబడించారు.

ఓ మూల మలుపు వద్ద దొంగలు టర్నింగ్ తీసుకునేందుకు ప్రయత్నించారు. అయితే అప్పుడే తన బండితో అడ్డగించిన రమేశ్.. వారిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. అయితే వెనక కూర్చున్న దొంగ పారిపోయాడు. కానీ ముందున్న దొంగను మాత్రం రమేశ్ ఒడిసి పట్టుకున్నారు. ఇంతలోనే ఆ దొంగ బండి రేజ్ చేసి పారిపోబోయాడు. కానీ రమేశ్ అతడిని వదిలిపెట్టలేదు. అతడి బండితో పాటు పరిగెత్తుతూ అతడిని కింద పడేశారు. తాను కూడా పడిపోయినా.. వెంటనే లేచి దొంగను అదుపులోనికి తీసుకున్నారు. ఈ సూపర్ ఫీట్ అంతా పక్కనే ఉన్న సీసీ కెమెరాలో రికార్డయింది.

ఈ వీడియో చూసిన గ్రేటర్ చెన్నై అడిషనల్ పోలీస్ కమిషనర్ మహేష్ అగర్వాల్ వెంటనే తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇది సినిమాల్లో సీన్ కాదని, మొబైల్స్ దొంగతనం చేసి పారిపోతున్న ఇద్దరు దొంగలను అంట్లిన్ రమేష్ అనే ఎస్‌ఐ వెంటాడి పట్టుకున్న దృశ్యమని అగర్వాల్ రాసుకొచ్చారు. ఈ వీడియో మొత్తం చూస్తే సింగం సినిమాలో సీన్లే గుర్తొస్తాయనడంలో అతిశయోక్తి లేదని, రమేశ్‌ను రియల్ హీరో అని ప్రశంసించారు. ‘రమేష్ ఒంటి చేత్తో మొబైల్ స్నాచర్స్‌ను వెంటాడి పట్టుకున్నాడు. అతడో రియల్ హీరో. ఈ వీడియో చూస్తుంటే సింగం సినిమాలో సన్నివేశాలే గుర్తుకొస్తున్నాయ’ని మహేశ అగర్వాల్ పేర్కొన్నారు.

రమేశ్‌ను స్యయంగా ప్రశంసించారు. ఆయనకు ఓ చిన్న బహుమానం కూడా అందించారు. అయితే కమిషనర్ అగర్వాల్ వీడియో షేర్ చేసిన వెంటనే అది విపరీతంగా వైరలైంది. సూపర్ కాప్ అంటూ నెటిజన్లు రమేశ్‌ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. వృత్తి పట్ల అతడి అంకిత భావానికి ఫిదా అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: