మొన్నామధ్య అమెరికాలోని ఎడారి ప్రాంతంలో ఉన్నట్లుండి ఓ స్తంభం కనపడి శస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురి చేసింది. అదెక్కడి నుంచి వచ్చిందా అని ఆరా తీసేలోపు మళ్లీ కనిపించకుండా పోయింది. ఇదేంటో అంతుపట్టని శాస్త్రవేత్తలు తలలు పట్టుకున్నారు. అయితే ‘ఎలాగో కనిపించకుండా పోయింది కదా.. వదిలేద్దాం’ అనుకుని ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో మళ్లీ మరో చోట అదే స్తంభం ప్రత్యక్షమైంది.అమెరికాలోని వైల్డ్‌ లైఫ్ డివిజన్‌కు సాయం చేస్తున్న కొందరు అధికారులు హెలికాప్టర్లో వెళ్తుండగా ఈ స్తంభం మొదటి సారిగా కనిపించింది. పొడవుగా సిల్వర్ రంగులో మెరుస్తున్న 12 అడుగుల ఈ స్తంభం వారికి కనపడింది. ఇది చూసిన సదరు సిబ్బంది మరోసారి కన్‌ఫర్మ్ చేసుకునేందుకు అక్కడే దిగి దానిని పరిశీలించారు. ఆ స్తంభం అక్కడ ఎందుకుందో వారికి అర్థం కాలేదు. స్థానిక అధికారులను అడిగితే వారికి కూడా దీని గురించి తెలియదని తేలింది.

ఈ స్తంభం ఎవరో పొరబాటున పడేసిందో, లేక భూమిలోంచి బయటకు పొడుచుకు వచ్చిందో కాదని, ఎవరో కావాలనే చాలా జాగ్రత్తగా దీన్ని ఇక్కడ నిలబెట్టినట్లుందని అధికారులు భావించారు. అసలు ఈ స్తంభం ఇక్కడ ఎందుకుంది? అనే ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకలేదు. ఈ ప్రాంతంలో ఈ స్తంభాన్ని ఎప్పుడూ స్థానికులు ఇంతవరకూ చూసింది కూడా లేదట. దీంతో ఈ స్తంభం సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే దీనిని చూసిన నెటిజన్లు.. గ్రహాంతర వాసులే దీనిని ఇక్కడ పెట్టి ఉంటారని కామెంట్లు చేయడం మొదలెట్టారు. ఈ నేపథ్యంలోనే దీని ఫొటోలను తీయడానికి బెర్నార్డ్ అనే ఫొటోగ్రాఫర్ 6 గంటలు ప్రయాణించి అక్కడకు చేరుకున్నారు. బెర్నార్డ్‌తో పాటు అతడి ఫ్రెండ్స్ కూడా తోడుగా వచ్చారు.


ఎడారి ప్రాంతంలో కనిపించిన స్తంభాన్ని రకరకాల యాంగిల్స్‌లో ఫొటోలు తీసిన బెర్నార్డ్స్.. దీనికి సంబంధించిన వివరాలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. స్తంభంపై ఏవో వింత గుర్తులున్నాయని, ఏదో రాసినట్లు కనబడుతోందని అభిప్రాయపడ్డాడు. దీంతో నెట్టింట్లో ఇది మరింత సంచలనంగా మారింది. అయితే ఇలా హఠాత్తుగా ప్రత్యక్షమైన స్తంభం.. అంతే హఠాత్తుగా మాయమైంది. ఇది ఎక్కడికి పోయిందో కూడా ఎవరికీ తెలీదు. అయితే కొందరు మాత్రం ఎవరో నలుగురు వ్యక్తులు ఇక్కడకు వచ్చి, చాలా వేగంగా దీన్ని ఎత్తుకెళ్లి పోయారని అంటున్నారు.


ఇదిలా ఉంటే ఈ స్తంభం మళ్లీ తాజాగా రోమేనియాలో ప్రత్యక్షమైంది. దీనికి సంబంధించిన ఫొటోలు కూడా ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అయితే ఇది పాత స్తంభం కాదంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. రొమేనియాలోని నీమ్ట్ ప్రాంతంలో కనిపించిన ఈ స్తంభం పూర్తికా కాపీ అని, కనీసం కాపీ కూడా సరిగా చేయలేదని, దానిపై వెల్డింగ్ చేసిన గుర్తులు కూడా కనిపిస్తున్నాయని అంటున్నారు. అయితే ఈ స్తంభం కూడా ఉన్నట్లుండి మాయమైపోయింది. ‘ఎంత వింతగా ప్రత్యక్షమైందో అంతే వింతగా ఈ స్తంభం మాయమైపోయింది’’ అని ఓ వార్తా సంస్థ చెప్పుకొచ్చింది. అయితే నెటిజన్లు మాత్రం ఉటాలో జరిగిన ఘటనను చూసి ఎవరో కాపీ కొట్టాలనే ఉద్దేశ్యంతోనే ఇలా చేశారని అంటున్నారు. మరి వీటి వెనుక ఏదైనా కనెక్షన్ ఉందా? లేక ఎవరో చిలిపిగా చేస్తున్న తుంటరి చర్యా? అనేది ఇంకా తెలియరాలేదు.

అయితే కొంతమంది నెటిజన్లు మాత్రం ‘ఏలియన్లూ ఏంటింది..? ఈ స్తంభం ఎందుకో చెప్పండి’ అంటూ పోస్టులు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: