ఇంటర్నెట్ డెస్క్: సంక్రాంతికి మీరు ఎలాంటి పిండి వంటలు వండుకున్నారు..? చక్కగా అరిసెలు, జంతికలు, పూర్ణాలు, పులిహోర, పరమాన్నం వండుకుని తింటున్నారా..? అయితే యూరోపియన్ దేశాలు కూడా తాజాగా ఓ వంటకాన్ని వండుకోబోతున్నాయి. అదేంటో తెలుసా..? పురుగులు. అవునండీ. అక్కడ పురుగులు తినడానికి నిన్న(బుధవారమే) అధికారికంగా అనుమతులు లభించాయి. మీల్‌వర్మ్స్‌ అనే బీటిల్ జాతికి చెందిన లార్వాలను తినేందుకు అక్కడి ఫుడ్ బోర్డు యూరోపియన్ ఫుడ్ సేఫ్టీ ఏజెన్సీ(ఈఎఫ్‌ఎస్‌ఏ) అనుమతులు జారీ చేసింది.

ఇన్నాళ్లూ పక్షులు, తొండలు, కప్పలు వంటి పెంపుడు జంతువులకు మాత్రమే ఆహారంగా ఉన్న ఈ పురుగులు ఇప్పటి నుంచి మనుషుల మెనూలోనూ చేరనున్నాయి. అయితే వీటిని తినడానికి అనుమతులు ఇచ్చే సమయంలో ఈఎఫ్ఎస్ఏ ఏం చెప్పిందో తెలుసా..? ఈ పురుగుల్లో రిచ్ ప్రోటీన్లు, ఫ్యాట్, ఫైబర్, విటమిన్స్ అన్నీ పుష్కలంగా ఉంటాయట, అందుకే వీటిని మనుషులు సైతం తినేందుకు అనుమతులిచ్చామని చెబుతోంది. మనుషుల్లో ఏర్పడే పోషకాహార లోపం ఈ పురుగులసాయంతో తగ్గించవచ్చని యూరోపియన్ యూనియన్ చెబుతోంది.

ఈ అనుమతులపై ఈఎఫ్‌ఎస్‌ఏ ఫుడ్ కెమిస్ట్, సైంటిస్ట్ ఎర్మోలావోస్ వెర్వెరీస్ మాట్లాడుతూ, యూరోపియన్ల ప్లేట్లలో ఉండబోతున్న తొలి పురుగుల ఆహారం ఇదేనని, ఇందులో పోషకాహార విలువలపై పరిశోధన చేసిన తరువాతనే ఈ విధంగా అనుమతులిచ్చామని అంటున్నాడు. అంతేకాదు ఆహారానికి పురుగులను వినియోగించడంపై ఇప్పటికే యూరప్‌లోని శాస్త్రవేత్తలతో పాటు ఇక్కడి ఫుడ్ ఇండస్ట్రీ కూడా చాలా ఉత్సుకతతో ఉందని చెబుతున్నాడు.

తన వాదనకు ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్, ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే పురుగులను ఆహారంగా వినియోగిస్తున్నారని రుజువులు సైతం చూపిస్తున్నారు. ఆ దేశాల్లో ఇప్పటికే బొద్దింకలతో బర్గర్లు, పురుగులతో చాక్లెట్ బార్లు తయారు చేసుకుని తింటున్నారని, దీనివల్ల పోషకాలు అందుతున్నాయని అంటున్నాడు.

అయితే ఇప్పుడు విదేశాలన్నీ అనుమతులిస్తున్నాయి కదా.. అని మన దేశ ఆహార బోర్డులు కూడా ఇలాంటి అనుమతులిస్తే ఏం చేయాలో. మీరైతే చేస్తారు..? టేస్ట్ చేస్తారా..?

మరింత సమాచారం తెలుసుకోండి: