ఇంటర్నెట్ డెస్క్: మార్కెటింగ్ అనేది ఒక కళ. దానిని ఎంత బాగా ఉపయోగిచుకుంటే బిజినెస్‌ అంతబాగా వృద్ధి చెందుతుంది. అయితే బిజినెస్‌ను ముందుకు తీసుకెళ్లడానికి తన బిజినెస్‌నే ఆకాశానికి పంపిస్తే.. సరిగ్గా అలాంటి ఆలోచనే వచ్చింది బ్రిటన్‌లోని నీరజ్ అనే వ్యక్తికి. నీరజ్ బ్రిటన్‌లో చాయ్‌వాలా పేరుతో ఓ రెస్టారెంట్ నడుపుతున్నాడు. అక్కడి జనాలకు భారతీయ ఫాస్ట్ ఫుడ్ విపరీతంగా నచ్చడంతో అతడి రెస్టారెంట్‌ వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతోంది. అయితే తన రెస్టారెంట్‌కు ఓ కొత్తదనం ఉండాలని అనుకునేవాడు. ఈ క్రమంలోనే తనకు ఇష్టమైన సమోసాని అంతరిక్షంలోకి పంపించాలని అనుకున్నాడు. ఈ క్రమంలోనే అనేకసార్లు ప్రయత్నం కూడా చేశాడు. కానీ విఫలమయ్యాడు.

నిజానికి అంతరిక్షంలోకి సమోసాను పంపించాలనే ఆలోచన నీరజ్‌కు కరోనా లాక్‌డౌన్ సమయంలోనే వచ్చిందట. సరదాగా వచ్చిన ఈ ఆలోచన తన బిజినెస్‌కు కూడా బాగా ఉపయోగపడుతుందని నీరజ్‌ భావించాడు. సమోసాని అంతరిక్షంలోకి పంపిస్తే జనాలను ఆకర్షించవచ్చని, తద్వారా తన బిజినెస్ బాగా అభివృద్ధి చెందుతుందని అనుకున్నాడు. ఇంతకుముందు ఇలాంటి ప్రయోగాలు కొన్ని సార్లు చేశాడు. కానీ ప్రతి సారీ నిరాశే ఎదురైంది. కానీ ఈ సారి మాత్రం స్నేహితుల సలహాలు, నిపుణుల సలహాలు తీసుకుని మరీ ప్రయోగం మొదలు పెట్టాడు. ఈ దఫా కచ్చితంగా సక్సెస్ అవుతానని పట్టుదలగా ఉన్నాడు నీరజ్.

తన రెస్టారెంట్‌లో తయారు చేసిన సమోసాని చక్కగా ప్యాక్ చేసి వాటిని రెండు హీలియం బెలూన్లకు కట్టాడు. దానికి ఓ జీపీఎస్ ట్రాకర్, గో-ప్రో కెమెరా ఏర్పాటు చేశాడు. ఎక్కడా ఊడిపోకుండా పటిష్ఠ బందోబస్తు చేశాడు. తర్వాత అందరి ముందు వాటిని వదిలిపెట్టాడు. అలా వదలడమే ఆలస్యం హీలియం బెలూన్లు గాలిలోకి ఎగిరిపోయాయి. ఈ తంతునంతా వీడియో తీసిన నీరజ్ సోషల్ మీడియాలో విడుదల చేశాడు. దీంతో ఈ వీడియో తెగ వైరల్ అయింది. అయితే అనుకోకుండా ఓ సమస్య వచ్చి పడింది.

సమోసాతో పాటు ఏర్పాటు చేసిన జీపీఎస్ ట్రాకర్ ద్వారా అది ఎక్కడుంతో తెలుసుకోవాలని అనుకున్న నీరజ్‌కు నిరాశే ఎదురైంది. బెలూన్లు గాలిలోకి వెళ్లిన కొద్ది సేపటి నుంచే జీపీఎస్ ట్రాకర్ పనిచేయకుండా పోయింది. దీంతో నీరజ్ బాధపడ్డాడు. కానీ ఓ రోజు తరువాత ట్రాకర్ పనిచేయడం ప్రారంభించింది. దీంతో సమోసా ఫ్రాన్స్‌లోని ఓ అడవిలో ఉన్నట్టు తెలిసింది. నీరజ్ వీడియో చూసిన కొందరు నెటిజనులు ఆ లొకేషన్ ఆధారంగా అడవిలో శోధించి బెలూన్‌తో పాటు జీపీఎస్, గో-ప్రో కెమెరా కనుకొన్నారు. కానీ సమోసా మాత్రం దొరకలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: