మూఢనమ్మకాలు,ఆచారాలు అంటూ  ఈ కంప్యూటర్ యుగంలో కూడా వాటిని ఫాలో అవుతున్నారంటే నమ్మశక్యం కాదేమో.. కానీ కొన్ని కొన్ని సంఘటనల ద్వారా అవి నమ్మలనిపిస్తుంది.. ఇప్పుడు అలాంటి సంఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది.. పూర్వీకుల ఆచారాన్ని పాటించడంలో భాగంగా కుందుర్పి మండలం శ్రీమజ్జనపల్లి గ్రామం సోమవారం పూర్తిగా ఖాళీ అయింది. గ్రామం చుట్టూ ముళ్లకంచె వేసి సోమవారం మధ్యాహ్నం 12 నుంచి మంగళవారం మధ్యాహ్నం 12 గంటల వరకు గ్రామస్తులు ఊరు వదిలి వెళ్లారు. కర్ణాటక సరిహద్దున ఉన్న ఈ గ్రామంలో ఒకే సామాజిక వర్గానికి చెందిన 280 కుటుంబాలు ఉన్నాయి. 1,120 జనాభా ఉన్న శ్రీమజ్జనపల్లిలో నేటికీ 90 శాతం పూర్వపు ఆచారాలనే అనుసరిస్తూ వస్తున్నారు.శ్రీమజ్జనపల్లి వాసులు పాటిస్తున్న ఈ ఆచారం వెనుక సుదీర్ఘ కథనమే ఉంది.

 గ్రామ పెద్దలు తెలిపిన మేరకు 'వందేళ్ల క్రితం గ్రామంలో అతిసార సోకి పదుల సంఖ్యలో ప్రజలు మృత్యువాతపడ్డారు. ఆ సమయంలో గ్రామ దేవతలు పాలనాయక, పెద్దక్క రాయమ్మ అమ్మవారు అప్పట్లో అర్చకులుగా ఉన్న పుజారి పాలయ్య, ఓబయ్య, హనుమయ్య కలలో కనిపించి 24 గంటల పాటు అందరూ గ్రామాన్ని వదిలి వెళితే ఊరు సుభిక్షంగా ఉంటుందని తెలిపింది. అప్పటి నుంచి గ్రామస్తులు ఈ ఆచారాన్ని పాటిస్తూ వస్తున్నారు. ప్రతి మూడు లేదా ఐదేళ్లకు ఓసారి ఇలా పూరీ్వకుల ఆచారాన్ని పాటించడం ఆనవాయితీగా మారింది'.గ్రామం వదిలిన తర్వాత 24 గంటల పాటు ఆ ఊళ్లోకి ఎవరినీ అనుమతించకుండా చుట్టూ ముళ్ల కంచె వేశారు. స్థానికులతో పాటు ఇతర గ్రామాల ప్రజలు సైతం గ్రామంలోకి వెళ్లకుండా ఊరు చుట్టూ 30 మంది యువకులు కాపలా కాశారు.

 ఈ నిబంధన అతిక్రమించి, పొరబాటున ఎవరైనా గ్రామంలోకి కాలుపెడితే.. కాసిపుల్లతో నాలుకపై కాలుస్తారు. గ్రామాన్ని ఖాళీ చేసే ముందు వింత ఆచారాన్ని పాటించడం ఆనవాయితీగా వస్తోంది. గ్రామ శాంతి కోసం జంతు బలులు సమర్పించి పది బస్తాల బియ్యాన్ని వండి పసుపు కుంకుమతో కలిపి గ్రామం చుట్టూ చల్లుతారు. అనంతరం ఏకమొత్తంగా రెండు పూటలకు సరిపడు బియ్యం, బేడలు, కాయగూరలు, పాత్రలు తీసుకుని గ్రామం వదిలి వెళ్లిపోతారు. ఈ క్రమంలోనే సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు గ్రామాన్ని ఖాళీ చేసిన శ్రీమజ్జనపల్లి వాసులు.. తిరిగి మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ఇళ్లకు చేరుకుంటారు. ఇళ్లను శుద్ధి చేసిన అనంతరం లోపలకు ప్రవేశిస్తారట...!!

మరింత సమాచారం తెలుసుకోండి: