ఇంటర్నెట్ డెస్క్: ప్రభుత్వాన్ని వ్యతిరేకించినా, ప్రభుత్వ పెద్దలపై అనుచిత వ్యాఖ్యలు చేసినా వారిని అరెస్టు చేయడం చిన్నా, చితకా శిక్షలతో వారిని విడిచిపెట్టడం మనదేశంలో చూస్తునే ఉంటాం. అయితే కొన్ని దేశాల్లో మాత్రం అలా ఉండదు. ఏ మాత్రం ప్రభుత్వానికి కానీ, అక్కడి అత్యున్నత వ్యాక్తులను గానీ విమర్శిస్తే ఇక అంతే సంగతులు. అక్కడి ప్రభుత్వాలు ఏ మాత్రం క్షమించవు. తీవ్రాతి తీవ్రంగా శిక్షిస్తాయి. అలాంటి ఓ సంఘటనే థాయ్‌ల్యాండ్‌లో చోటు చేసుకుంది.

ప్రపంచంలో అనేక దేశాలు ప్రజాస్వామ్యం వైపు అడుగులు వేస్తున్న కొన్ని దేశాలు మాత్రం ఇప్పటికీ రాచరికంలోనే ఉన్నాయి. అలాంటి దేశాల్లో థాయ్‌ల్యాండ్ ఒకటి. అక్కడి రాజును కానీ, రాచరికాన్ని కానీ ఎవరైనా విమర్శించినా, తప్పు బట్టినా వారికి కఠినమైన శిక్షలు ఉంటాయి. అయితే తాజాగా అక్కడ ఇదే తప్పు చేసిన ఓ మహిళకు ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా అసాధారణమైన శిక్ష విధించారు.

అంచన్ అనే 60 ఏళ్ల మహిళ ప్రభుత్వ మాజీ ఉద్యోగి. ఆమె 2015లో యూట్యూబ్‌లో దాదాపు 26 వీడియోలు అప్‌లోడ్ చేశారు 2014-15 మధ్య ఫేస్‌బుక్‌లో 3సార్లు వీడియోలు అప్‌లోడ్ చేశారు. ఈ వీడియోల్లో రాచరికంపై తీవ్ర విమర్శలు చేశారు. 2014లో మిలటరీ తిరుగుబాటుకు ముందు, ఆ తర్వాత కొంతకాలం పాటు  యూట్యూబ్, ఇతర ఫైల్ షేరింగ్ వెబ్‌సైట్లలో ఆమె చురుగ్గా ఉండేవారు. అయితే ఈ వీడియోలు ప్రభుత్వం కంట పడడంతో ఆమెను అరెస్టు చేయడం జరిగింది. కంప్యూటర్ నేరాల చట్టాన్ని ఉల్లంఘించిన అభియోగాలను ఆమెపై అధికారులు నమోదు చేశారు.

అంచన్ తొలుత తనపై వచ్చిన వార్తలను ఖండించారు. అయినప్పటికీ నేరం రుజువు కావడంతో ఆమెకు 87 ఏళ్ల శిక్షించే అవకాశం ఉందని న్యాయస్థానం తెలిపింది. ఈ క్రమంలో అంచన్ తన చర్యలను అంగీకరించింది. దీంతో ఆమె శిక్షా కాలాన్ని తగ్గిస్తున్నట్లు అక్కడి న్యాయస్థానం ప్రకటించింది. 87 ఏళ్లు కాకుండా 43 ఏళ్ల 6 నెలల పాటు ఆమెకు జైలు శిక్ష విధిస్తున్నట్లు ప్రకటించింది. అయితే విచారణ సమయంలో ఆమె దాదాపు 9 నెలల పాటు జైలు జీవితం గడిపారు. ఈ కాలాన్ని ఆమె శిక్షా కాలంలో నుంచి తొలగించనున్నారు.

అంటే ఇప్పటికే 60 ఏళ్ల వయసున్న అంచన్ 43 ఏళ్ల శిక్ష అనుభవించడమంటే ఆమె జీవితం అక్కడే ముగిసిపోతుంది. ఈ విధంగా థాయ్‌ల్యాండ్ కోర్టు శిక్ష విధించడం గతంలో ఎన్నడూ లేదు. అయితే ఈ తీర్పుతో దేశంలో రాచరికాన్ని వ్యతిరేకించే వారికి ఓ గట్టి హెచ్చరికనే ప్రభుత్వం జారీ చేసినట్లయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: