గ్వాలియర్: ప్రపంచ దేశాల్లోనే మహిళలకు పురుషులతో సమానమైన హక్కులు వచ్చేశాయి. ఆడవారు కూడా అన్నిరంగాల్లోనూ మగవారితో సమనంగా అవకాశాలను చేజిక్కించుకుంటున్నారు. ప్రపంచ దేశాలతో పోలిస్తే మనదేశంలో మహిళలకు మరింత గౌరవం ఇస్తామని గొప్పలు చెప్పుకుంటాం. ఇప్పటికే మనదేశంలో మహిళలపై దురాచారాలు, దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అనేక చోట్ల  స్త్రీలపై అత్యాచారాలు చేసి పాశవికంగా హతమారుస్తున్న ఘటనలు ఇప్పటికే అనేకచోట్ల మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ పాశవకత్వానికి పరాకాష్ఠగా మధ్యప్రదేశ్‌లో ఇప్పటికీ ఓ దురాచారం కొనసాగుతోంది. అదేంటంటే అక్కడి మహిళలను అంగడి సరుకుల్లా విక్రయిస్తుంటారు. ఇంకా హేయం ఏంటంటే సొంత భర్తలే తమ భార్యలను పరాయి పురుషులకు డబ్బుకోసం అద్దెకిస్తుంటారు.

మీరు కార్లు, బైకులు అద్దెకు తీసుకున్నారా..? ఎప్పుడైనా..? దాదాపు ఎంతోమంది ఇలా వాహనాలను అద్దెకు తీసుకునే ఉంటారు. ఇదేం వింత కాదు. అయితే ఈ ప్రాణం లేని వాహనాల్లాగే మహిళలను కూడా అద్దెకిస్తారని మీకు తెలుసా..?  మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ జిల్లా, శివపురి గ్రామంలో ఇలాంటి దురాచారమే తరతరలుగా కొనసాగుతోంది. శివపురి ప్రాంతంలో గ్వాలియర్ రాజపుత్రులు నివశిస్తుంటారు. వీరిలో అనేకమంది డబ్బున్నవారు ఉన్నారు. వీరికోసం ఈ ప్రాంతంలో ఓ అనాచారమైన సౌకర్యం అందుబాటులో ఉంది. అదేంటంటే ఆ ప్రాంతంలో ఉండే పేద మహిళల్లో తమకు నచ్చిన వారిని, నచ్చిన సమయంలో అద్దెకె తీసుకునే అవకాశం ఉంటుంది. దీనికి ఆ పేద మహిళల కుటుంబాల్లో భర్తలు కూడా నిర్మొహమాటంగా అంగీకరిస్తారు. దీనికోసం వారికి కొంత మొత్తంలో నగదు కూడా లభిస్తుంది. అంటే అగ్నిసాక్షిగా తాళికట్టి పెళ్లి చేసుకున్న భార్యలను వారి భర్తలే చిల్లర డబ్బుల కోసం ఇతర పురుషులకు అద్దెకిస్తుంటారన్నమాట.

ఈ దురాచారంలో అమ్మాయి అందానికి, వయసుకే ప్రాముఖ్యత. 18 సంవత్సరాల నుంచి 35 ఏళ్ల మహిళలను ఇలా అద్దెకిస్తుంటారు వారి భర్తలు. అయితే దీనిపై మహిళల అభిప్రాయాలకు కానీ, వారి ఆత్మాభిమానానికి కానీ ఎలాంటి విలువ ఉండదు. వారి కేవలం అంగడిలో బొమ్మల్లా, రోడ్లపై ఉంచే సరుకుల్లా అద్దెకిచ్చేస్తుంటారు. ఒకసారి అద్దెకు ఒప్పందం కుదిరిన తరువాత ఆ మహిళకు నచ్చినా, నచ్చకున్నా కచ్చితంగా ఆమె సొమ్ము చెల్లించిన వ్యక్తితో వెళ్లిపోవలసిందే. అమ్మాయి అందం, వయసును బట్టి, అద్దెకు తీసుకునే కాలాన్ని బట్టి రూ.10 నుంచి లక్ష, 2 లక్షల వరకు సదరు భర్తలు అద్దె తీసుకుంటారు.

అయితే ప్రస్తుతం ఈ కుటుంబాల్లో పుట్టిన కొందరు యువతులు వేరే ప్రాంతాల్లో చదువుకుని రావడంతో ఈ దురాచారంపై గళమెత్తుతున్నారు. దీనిని రూపుమాపేందుకు ఆందోళనలు సైతం చేస్తున్నారు. విచిత్రం ఏంటంటే ఇక్కడ ఇంత జరుగుతున్నా.. అధికారులు ఏ మాత్రం పట్టించుకోరు. ప్రభుత్వ పెద్దలు సైతం అంతా తెలిసినా తెలియనట్లే ఉంటారు. అంటే చట్టవ్యతిరేకమైన, హేయమైన ఈ కార్యక్రమం చట్టబద్ధంగా జరుగుతున్నా పాలకులు మాత్రం కళ్లుమూసుకుని ఉంటారన్నమాట.

ఇలాంటి దురాచారాలు ఇప్పటికే మన దేశంలో అనేకం ఉన్నాయి. వాటన్నింటిపైనా పోరాడి రూపుమాపాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: