ఇంటర్నెట్ డెస్క్: ఫేస్‌బుక్ ఓ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఇకమీదట ప్రపంచమంతా ఆ నిర్ణయాన్నే అమలు చేస్తామని ప్రకటించింది. అంతేకాదు దీనికి సంబంధించి తాజా మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. ఈ విషయాన్ని ఫేస్‌బుక్ అధినేత మార్క్ జుకెర్‌బర్డ్ వెల్లడించారు. ఫేస్‌బుక్ యూజర్ల నుంచి వచ్చిన సూచనల ఆధారంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు జుకర్ బర్గ్ వెల్లడించారు. ఈ నిర్ణయంతో ప్రపంచంలోని అనేక రాజకీయ పార్టీలు, ఆయా పార్టీలకు సంబంధించి ఫేస్‌బుక్‌లో ఉన్న గ్రూపులపై ప్రభావం పడనుంది.

అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో ప్రజలను తప్పుదారి పట్టించే సందేశాలు, హింసాత్మక విషయాలు ప్రజలప తీవ్ర ప్రభావం చూపకుండా ఉండేందుకు ఫేస్‌బుక్ పటిష్ఠ చర్యలు తీసుకుంది. అయితే 6న అమెరికన్ కాపిటల్‌ భవనంపై ట్రంప్ అభిమానుల దాడి ఘటన ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో ట్రంప్ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను ఫేస్‌బుక్ సస్పెండ్ చేసింది. అవి మంచి ఫలితాలను కూడా ఇచ్చాయి. దీంతో ప్రస్తుతం అవే విధానాలను ప్రపంచ వ్యాప్తంగా అమలు చేయాలని ఆలోచన చేస్తోంది. అంతేకాదు ఇప్పుడు ఆయన అధ్యక్షుడిగా పదవి కోల్పోయిన తరవాత కూడా ట్రంప్‌ ఖాతాలపై సస్పెన్షన్ కొనసాగించాలా? వద్దా? అనే అంశంపై ఫేస్‌బుక్ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపింది.

ఫేస్‌బుక్ కొత్త మార్గదర్శకాల ప్రకారం.. ఇకమీదట ఎఫ్‌బీ యూజర్లకు రాజకీయ సంబంధిత గ్రూపులు రికమెండ్ కావు. అమెరికాలో ఇప్పటికే ఈ చర్యలు అమలు చేస్తున్నారు. గతంలో రాజకీయ గొడవల వల్ల ఫేస్‌బుక్‌కు వ్యతిరేకత వచ్చింది. ఈ క్రమంలోనే మళ్లీ పూర్వ వైభవం సంపాదించుకునేందుకు ఫేస్‌బుక్ రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే సివిక్, పొలిటికల్ గ్రూపులను రికమండేషన్ల జాబితా నుంచి తొలగించే దిశగా ఆలోచన చేస్తున్నట్లు జుకెర్‌బర్గ్ తెలిపారు. అలాగే ఫేస్‌బుక్‌లో వచ్చే న్యూస్ ఫీడ్ నుంచి కూడా రాజకీయ విషయాలను ప్రమోట్ చేసే విషయాలను, పోస్టులను సాధ్యమైనంత తగ్గించనున్నట్లు ప్రకటించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: