హైదరాబాద్: హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు అవగాహన కల్పించేందుకు కొత్త పంథాను అందుకున్నారు. వాహనదారులు చేసే తప్పులకు పడిన చలానాలను ఆన్‌లైన్‌లో షేర్ చేయడమే కాకుండా వారిని ట్రోల్ చేస్తూ విపరీతంగా మీమ్స్ షేర్ చేస్తున్నారు. దీనిద్వారా వాహనదారులపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. నిబంధనలు అతిక్రమిస్తే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందో సినిమాల్లోని పాపులర్ డైలాగులను, హీరోల ఫోటోలను వాడుకుంటున్నారు. అయితే ఎవరినీ వ్యక్తిగతంగా ట్రోల్ చేయడం లేదు. ఉల్లంఘనలకు శిక్షలు, చలానాలు తదితర అంశాలను షేర్ చేసేందుకు సోషల్ మీడియాను వాడుకుంటున్నారు.

తమ ట్విటర్ ఖాతాల్లో పోస్ట్ చేసే మీమ్స్, ట్రోల్స్‌ యువతను బాగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ట్రాఫిక్ పోలీసులు కొన్ని ఫొటోలను పోస్ట్ చేస్తూ అది తప్పని చాటి చెప్పేందుకు వాటికి మీమ్స్ జత చేశారు. దీంతో ఇవి యువతను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

-ద్విచక్ర వాహనం నడుపుతున్న ఓ యువకుడి ఫోటోను షేర్ చేసిన పోలీసులు.. అతడు మామూలుగా నడిపితే అందులో వింతేముంది అనుకోకండి. ఆ కుర్రాడు హ్యాండిల్ మీద కాళ్లు పెట్టి వాహనాన్ని నడుపుతున్నాడు. ఈ విషయాన్ని ఎవరో ఫొటో తీసి సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు పంపారు. ఆ ఫొటోను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్వీట్ చేశారు.

''చూడండి రా వాడిని, కోతికి కొబ్బరి చిప్ప ఇస్తే ఏం చేస్తది అని అడిగారు కదా.'' అంటూ కామెంట్ మీమ్ రూపొందించారు. ఇందుకోసం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో సన్నివేశమైన వెంకటేశ్-ప్రకాశ్ రాజ్-మహేశ్ బాబు ఫ్రేమ్ను వాడుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ పోస్ట్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. చాలా మంది దీనిపై కామెంట్లు, రీ ట్వీట్లు చేస్తున్నారు. లైక్ చేస్తున్నారు. కొందరు మాత్రం ఆ నెంబర్ ప్లేట్ కూడా చూపించాల్సిందని అడుగుతున్నారు.

– పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ నటించిన అత్తారింటికి దారేది చిత్రంలో క్లైమాక్స్ సీన్ గుర్తుంది కదా.. అయితే తాజాగా ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన కల్పించేందుకు పవన్ కల్యాణ్ తన అత్త నదియాతో మాట్లాడే సీన్ పిక్‌ను జత చేశారు. 'నువ్వేమో 1300 సేవ్ చేద్దామని కాలు అడ్డుగా పెట్టావు. కానీ నాకు పోలీసులు ఇంకో రూ.1500 అదనంగా ఫైన్ వేశారు' అనే అర్థం వచ్చేలా ఆ మీమ్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఓ యువతి తన భర్త, పాపతో కలిసి బెక్పై వెళ్తుంది. ట్రిపుల్ రైడింగ్‌ తెలిస్తే చలానా కట్టాల్సి వస్తుందని ఆమె బైక్ వెనుకాల ఉన్న నెంబర్ ప్లేట్‌కు కాలు అడ్డుగా పెట్టింది. అయినా పోలీసులు ఆ బైక్‌ను పట్టుకున్నారు. దీంతో ఆ బైక్ ఎంత ఫైన్ పడిందో కూడా పొందుపరిచారు. చలాన్లు తప్పించుకోవాలంటే ట్రాఫిక్ రూల్స్ పాటించండి.. అంతేగాని ఇలా విన్యాసాలు చేయకండి అంటూ.. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వాహానదారులకు విజ్ఞప్తి చేశారు.

-ట్విట్టర్ వేదికగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ విభాగం ఓ ట్వీట్ చేసింది. నంబర్ ప్లేట్ కనపడకుండా ఉద్దేశపూర్వకంగా దాచే వారినుద్దేశించి చేసిన ట్వీట్ అది. చలానా తప్పించుకోవడానికి బండి నంబర్ ప్లేట్ ఉద్దేశపూర్వకంగా దాచడం నేరమని ట్విట్టర్‌లో పేర్కొంది. దీనిపై క్రిమినల్ కేసు కూడా నమోదు చేయవచ్చు అంటూ సూపర్ హిట్ మూవీ 'కేజీఎఫ్' సినిమాలోని ఓ సీన్‌తో మీమ్‌ను రూపొందించింది.
 నంబర్ ప్లేట్‌ను కనపడకుండా చేస్తున్న ఓ వాహనదారుడి ఫొటో పెట్టి ''ఇప్పుడేం చేస్తారు మీ పోలీసులు'' అనే డైలాగ్ రాశారు. దీనికి కౌంటర్‌గా కింద.. 'ఉద్దేశపూర్వకంగా బండి నెంబర్ ప్లేట్ కనపడకుండా చేసినందుకు రూ.500 ఎక్కువ చలానా వేస్తారు' అని పేర్కొన్నారు. 'కేజీఎఫ్' సినిమా సీన్‌తో రూపొందించిన ఈ మీమ్ పలువురిని ఆకట్టుకుంటుంది.

పాకిస్థాన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ సర్ఫరాజ్ ఫొటోను కూడా మన ట్రాఫిక్ పోలీసులు వాడుకున్నారు. ప్రపంచ వరల్డ్ కప్‌లో భాగంగా ఇండియా-పాక్ మధ్య జరిగిన మ్యాచ్‌లో సర్ఫరాజ్ గట్టిగా ఆవలిస్తున్న ఫొటో ఒకటి వైరలైన విషయం తెలిసిందే. ఆ ఫొటోపై సోషల్ మీడియాలో ఎన్నో మీమ్స్ కూడా వచ్చాయి. ఇక ఇప్పుడు అదే ఫొటోను సైబరాబాద్ పోలీసులు వాడుకున్నారు. సర్ఫరాజ్ ఆవలిస్తోన్న ఫొటోను షేర్ చేసిన పోలీసులు..

''నిద్ర వస్తున్నా.. ఆపుకొని మరీ బలవంతంగా డ్రైవింగ్ చేయకండి. అది చాలా డేంజర్'' అని కామెంట్ పెట్టారు. అయితే ఈ ఫొటో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుటుంటోంది. పోలీసులకు సెన్సాఫ్ హ్యూమర్ ఎక్కువే అంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు. ఈ తరహాలో పోలీసులు ట్రోల్ చేయడం, సినిమాల్లో డైలాగ్‌లతో కొత్త కొత్త సెటైర్లను పోలీసులు సృష్టించడం ఇదే ఫస్ట్ కాదు.. ఇంతకుముందు కూడా ఇలాంటి ఎన్నో ట్వీట్లను పోలీసులు షేర్ చేశారు.




మరింత సమాచారం తెలుసుకోండి: