ఇంటర్నెట్ డెస్క్: ఆన్‌లైన్‌లో ఏదైనా కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి. మనం కొనే వెబ్ సైట్ మంచిదేనా..? కొంటున్న ప్రొడక్ట్ కంపెనీ మంచిదేనా..? అనే విషయాలను తీక్షణంగా పరిశీలించుకోవాలి. లేకపోతే కచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. తాజాగా అలాంటి పరిస్థితే ఓ మహిళకు ఎదురైంది. దీంతో సదరు మహిళకు వేల రూపాయల నష్టం జరిగింది.

ఆన్‌లైన్‌లో వస్తువులను కొనేవారికి తరచుగా ఎదురయ్యే సమస్య ఒక వస్తువు ఆర్డరిస్తే మరో వస్తువు రావడం. పాడైన వస్తువులు రావడం వల్ల నష్టపోయిన వారు కూడా ఉంటారు. అయితే.. చైనాకు చెందిన లియూ అనే మహిళకు మాత్రం ఆన్ లైన్ షాపింగ్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది.

ఈ కామర్స్ సంస్థలను కాదని ఆమె కొద్ది రోజుల క్రితం నేరుగా యాపిల్ వెబ్‌సైట్‌కు వెళ్లి ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్ ఫోన్‌ను ఆర్డరిచ్చింది. ఆ తరువాత డెలవరీ కోసం ఆతృతగా ఎదురుచూడసాగింది. ఇటీవల ఓ రోజు ఆమెకు తన మొబైల్ డెలివరీ అందింది. దీంతో ఆనందంతో ఎగిరి గంతేసిన ఆమె ఫోన్ ప్యాకేజీని ఆతృతగా విప్పింది. బాక్స్ తెరవగానే ఒక్కసారిగా షాక్ అయింది. ఎందుకంటే అందులో ఉండాల్సిన ఆపిల్ఫోన్ బదులు  యాపిల్ జ్యూస్ కనిపించింది.

అనుకోని ఈ ఘటనతో షాకైన లియో వెంటనే యాపిల్ కంపెనీకి ఫిర్యాదు చేసింది. అయితే డెలివరీ బాయ్ తనకు నేరుగా పార్శిల్ ఇవ్వలేదని తనుంటున్న అపార్ట్‌మెంట్‌లోని తన లాకర్లో వదిలి వెళ్లాడని తెలిపింది. మహిళ ఫిర్యాదుపై వెంటనే స్పందించిన యాపిల్ సంస్థ దర్యాప్తు ప్రారంభించింది. పార్సిల్ డెలవరీ చేసిన కొరియర్ సంస్థ కూడా ఈ పొరపాటు ఎలా జరిగిందో తెలుసుకునేందుకు విచారణ జరుపుతోంది.

ఏది ఏమైనా ఆన్ లైన్ లో ఏదైనా కొనేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండడం, డెలివరీ వచ్చిన తర్వాత కూడా వస్తువులు సరిగ్గా ఉన్నాయా లేవా అనే విషయాలను డెలివరీ బాయ్ ముందే చెక్ చేసుకోవడం బెటర్.

మరింత సమాచారం తెలుసుకోండి: