ఇంటర్నెట్ డెస్క్: బిచ్చగాడు సినిమా చూశారు కదా..? అందులో హీరో తన తల్లి ఆరోగ్యం కోసం కోట్ల ఆస్తి ఉన్నా బిచ్చగాడిగా మారతాడు. అలానే జివిస్తాడు. అయితే తాజాగా మధ్యప్రదేశ్‌లో అలాంటి వ్యక్తిని కనుగొన్నారు. ఇతడికి కూడా కోట్ల ఆస్తి ఉంది. కానీ బిచ్చగాడిగా మారాడు. అయితే సినిమాలోలా ఏదో గొప్ప కారణం కోసం కాదు. మద్యానికి బానిసగా మారి. అవును, మద్యం వ్యసనం ఎక్కువ కావడంతో ఎక్కడున్నానో, ఏం చేస్తున్నానో కూడా తెలియకుండా ఓ గుడి మెట్లపై చేరి మద్యం తాగుతూ బతికేస్తున్నాడు. తాజాగా అక్కడి అధికారులు ఇతడి గురించి తెలిసి షాకయ్యారు.

అనాథ వ్యక్తులను ఆదుకునేందుకు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో మున్సిపల్ సిబ్బంది, జిల్లా అధికారులు సంయుక్తంగా దీనబంధు పునరావాస యోజన ద్వారా ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 24న కూడా అలాంటి కార్యక్రమమే నిర్వహించారు. అందులో బిచ్చగాళ్లకు పునరావాసం కల్పించే దిశగా అనేకమందిని తమతో తీసుకొచ్చారు. ఈ కార్యక్రమానికి మొత్తం 109 మంది అనాథలను తీసుకువచ్చారు. వీరికి తగిన వైద్య చికిత్స అందించారు. వారిలో ఓ వ్యక్తి రమేశ్. రమేష్ రెండేళ్లుగా ఓ ఆలయం వద్ద బిచ్చగాడిగా యాచన చేసుకుంటూ కాలం గడుపుతున్నాడు.

అందరినీ అడుగుతున్నట్లే రమేశ్‌ను కూడా అధికారులు.. ‘నీవు ఎవరు..? ఎక్కడి నుంచి వచ్చావు..? అని అడిగారు. రమేశ్ తన ఇంటి వివరాలు చెప్పాడు. అధికారులకు రమేష్ ఇచ్చిన సమాచారంతో ఆ అడ్రస్‌కు వెళ్లారు. ఆ ఇంటిని చూడగానే వారంతా షాకయ్యారు. ఆ ఇంట్లో సకల సౌకర్యాలు ఉన్నాయి. రమేష్‌కు ఒక సొంత భవనం, ప్లాట్ ఉన్నాయి. వాటి విలువ కోట్ల రూపాయలలో ఉంటుంది. అయితే రమేష్‌కు ఉన్న ఒక్క అలవాటు అతనిని బిచ్చగానిగా మార్చివేసింది. అతని మద్యం అలవాటే అతనిని ఈ దుస్థితికి తీసుకువచ్చింది.  విపరీతంగా మద్యం తాగే అలవాటు కారణంగా అతను ఆలయం దగ్గర బిచ్చమెత్తుకుంటూ కాలం గడుపుతున్నాడు.

రమేష్ పరిస్థితిని గమనించిన అధికారులు అతనికి కౌన్సెలింగ్ ఇప్పించారు. ప్రస్తుతం రమేష్ ఆరోగ్యం మెరుగుపడింది. తిరిగి రమేష్ తన ఇంటికి చేరుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: