ఇంటర్నెట్ డెస్క్: సమాజంలో తప్పులు జరగకుండా, తప్పుడు పనులు చేసేవారిని పట్టుకుని న్యాయస్థానం ముందు నిలిపే గొప్ప ఉద్యోగం పోలీసులది. రాజ్యాంగబద్ధంగా పోలీసులకు ఎంతో విలువుంది. కానీ తాజాగా ఇద్దరు పోలీసుల చేసిన పని పోలీసుల గౌరవానికే భంగం కలిగించేలా ఉంది. నడిరోడ్డుపై ఒకరికొకరు కుస్తీ పడుతూ ఒకరిపై ఒకరు కిందా మీదా పడుతూ.. జనాలందరి ముందే వారు కొట్టుకోవడం అక్కడి వారందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. దానికంటే మరో విచిత్రం ఏంటంటే వారు కొట్టుకోవడానికి గల కారణం. ఆ కారణం తెలిసిన జనాలంతా షాకయ్యారు. ఆ కారణం ఏంటి..? వారిద్దరూ ఎందుకు కొట్టుకున్నారు..? అనే ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం తెలుసుకుందాం.

అది ఝార్ఖండ్ రాష్ట్రం. రాంచీలోని సహజానంద్ చౌక్ దగ్గర్లో ఓ పోలీస్ హెల్మెట్ ధరించకుండా బైక్పై వెళ్తున్నారు.ఇక పక్కనే ఉన్న ట్రాఫిక్ పోలీస్ అది గమనించి ఆయన వాహనాన్ని ఆపి ఫైన్ వేశాడు. దీంతో మరో పోలీసు అధికారి ఫైన్‌కు సరేనని వెళ్లిపోయేందుకు ప్రయత్నించాడు. అయితే ఏమయిందో ఏమో.. అతడిని వెంబడించిన ట్రాఫిక్ పోలీస్.. నడిరోడ్డుపైనే దాడి చేశాడు. దీంతో అక్కడంతా హల్‌చల్ రేగింది.

ఈ ఘర్షణలో ఇద్దరు పోలీసులు హద్దులు మీరారు. నడిరోడ్డుపై కాలర్లు పట్టుకుని చొక్కాలు చించుకుంటూ ఘర్షణకు దిగారు. దీంతో చుట్టుపక్కల జనాలంతా వారిని నిలువరించేందుకు ప్రయత్నించారు. బైక్ వెళుతున్న పోలీస్ హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్లే వారిద్దరూ ఇలా కొట్టుకుంటున్నారని తెలిసి తొలుత అవాక్కయినా.. కొద్ది సేపటికి తేరుకుని ఇద్దరినీ మందలించి వివాదాన్ని సర్దుమణిగేలా చేశారు. ఇక ఈ ఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్స్.. ‘ఇలా నడిరోడ్డుపైనే కొట్టుకునే పోలీసులా.. ప్రజలను కాపాడేది, న్యాయాన్ని రక్షించేది’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే పోలీసుల బాహాబాహీకి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ విషయం ఉన్నతాధికారులకు చేరింది. దీనిపై విచారణ జరిపి త్వరలోనే చర్యలు తీసుకుంటామని రాంచీ సిటీ ఎస్పీ సౌరభ్ వెల్లడించారు. ఘటనపై దర్యాప్తు చేపట్టామన్న ఆయన తప్పు ఎవరిదనే విషయాన్ని తేల్చి.. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: