మనిషి జీవించాలి అంటే.. రక్తం తప్పనిసరి. సగటు మనిషికి ఐదు లీటర్ల రక్తం అవసరం అవుతుంది. అయితే ఏదైనా ప్రమాదానికి గురైనప్పుడు లేదా సరిగా ఆహారం తీసుకోనప్పుడు శరీరంలో రక్తం స్థాయి తగ్గి, అనారోగ్య సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది. ముఖ్యంగా ఓ నెగిటివ్ , ఏ బి నెగిటివ్ వంటి రక్త గ్రూపులను రేర్ బ్లడ్  గ్రూపులుగా గుర్తించడం జరిగింది. అంతేకాదు ఓ నెగటివ్ యూనివర్సల్ బ్లడ్ గ్రూప్ గా కూడా గుర్తించారు. అయితే ఈ బ్లడ్ గ్రూప్ కలిగిన వ్యక్తులు రక్తహీనత సమస్యతో బాధపడుతున్నట్లయితే, ఇలాంటి వారికి రక్తాన్ని ఇతరుల నుంచి తీసుకోవాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. పైగా ఇతరుల నుంచి రక్తం తీసుకునేటప్పుడు వారి ఆరోగ్యం సరిగ్గా ఉందో.. లేదో.. చూసుకొని, వారి బ్లడ్ మనకు సెట్ అవుతుందో.. లేదో.. పరీక్షించుకున్న  తర్వాతనే రక్తం ఎక్కించుకోవడం ఉత్తమం..ఇక కొంతమంది ఎమర్జెన్సీ టైం లో బ్లడ్ బ్యాంకులని, బంధువులను, మిత్రులను కలిసి సరైన బ్లడ్ గ్రూప్ కోసం వెతుకుతూ వుంటే, మరికొంతమంది సరైన సమయానికి రక్తం అందక చనిపోయిన వారిని కూడా మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు ఎలాంటి వారైనా సరే భయపడాల్సిన అవసరం లేదంటున్నారు శాస్త్రవేత్తలు. కృత్రిమ రక్తాన్ని కనుగొని , అది అన్ని రకాల బ్లడ్ గ్రూపులకు సెట్ అయ్యే విధంగా తయారు చేయడం ఇప్పుడు అద్భుతంగా ఉంది. అయితే దీనిని ఎక్కడ.. ఎవరు.. కనుగొన్నారు అంటే, జపాన్ దేశానికి చెందిన ఒక శాస్త్రవేత్తల బృందం, తికోరోజవా నగరంలో ఉన్న నేషనల్ డిఫెన్స్ మెడికల్ కళాశాలలో ఈ కృత్రిమ రక్తాన్ని రూపొందించడం జరిగింది.సహజ రక్త వర్గం లో ఉండే ఆక్సిజన్ కలిగిన ఎర్రరక్తకణాలు, అలాగే రక్తాన్ని గడ్డకట్టించే ప్లేట్లెట్స్ కూడా ఇందులో ఉండడం గమనార్హం. అయితే మొదట కుందేళ్ళపై ఈ పరిశోధన జరపగా, విజయవంతం అయినట్లు పరిశోధకులు తెలిపారు. రక్త హీనతతో బాధపడుతున్న 10 కుందేళ్ళపై ఈ రక్తాన్ని ప్రయోగించారు. అయితే వీటిలో 6 ప్రాణాలతో వుండగా,  నాలుగు మాత్రమే చనిపోవడం జరిగింది. సాధారణంగా మనం దాతల నుండి సేకరించిన రక్తాన్ని ,అటు ఇటు కదుపుతూ నాలుగు రోజుల వరకు నిల్వ ఉంచవచ్చు. ఇక తక్కువ ఉష్ణోగ్రతల వద్ద నిల్వ  చేసినప్పుడు 20 రోజులకు మించి దానిని నిల్వ చేయలేము. కానీ ఈ కృత్రిమ రక్తాన్ని దాదాపు సంవత్సరం పాటు నిల్వ చేయవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇంకా ఈ కృత్రిమ రక్తం ద్వారా ఎంతో మంది ప్రాణాలను నిలబెట్టవచ్చు అని వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: