అందాల అడవులకు పెట్టింది పేరు కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా. కొమురం భీం జిల్లాలోని అడవుల్లో ఎత్తైన కొండ‌లు... అందమైన జలపాతాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా తిర్యాని అడ‌వుల‌లో ఇప్పటికే ఎన్నో జలపాతాలను గుర్తించగా తాజాగా మరో అద్భుతమైన జలపాతాన్ని ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. ఈ జలపాతం దాదాపు 60 మీటర్ల ఎత్తు నుండి పడుతోంది. దీనిని తిర్యానీ అడవుల్లోని అటవీ ప్రాంతంలో కొద్ది రోజుల క్రితం ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. ఈ జలపాతం గుండాల జ‌ల‌పాతానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ప్ర‌వీణ్ తెలిపిన వివరాల ప్రకారం... నేను అడవిలో తిరుగుతున్నప్పుడు ఒక్కసారిగా నీటి శబ్దం వినిపించింది. 



అటు వైపు వెళ్ళి చూస్తే దాదాపు 60 అడుగుల ఎత్తు నుండి నీరు కిందకు ప్రవహిస్తోంది. దానిని చూసి ఆశ్చర్యపోయాను. జలపాతం అద్భుతంగా ఉండటంతో నా ఫోన్లో వీడియో తీసి అందరికీ చూపించాను. ఈ జలపాతానికి బైసన్ జలపాతం అని నామకరణం చేశాం. అని చెప్పారు. అంతేకాకుండా ఈ జలపాతానికి వెళ్లడానికి అనుకూలంగా అన్ని ఏర్పాట్లను చేస్తే పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెంద‌వ‌చ్చ‌ని తెలిపారు. ఇదిలా ఉండగా తిర్యానీ అడవుల్లో చింతల మాదారం జలపాతం కూడా ఎంతో పాపుల‌ర్ అయ్యింది. ఈ జ‌ల‌పాతానికి పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. వర్షాకాలం వచ్చిందంటే చుట్టుపక్కల ప్రాంతాల వారు వచ్చి ఎంజాయ్ చేస్తుంటారు.

 
గోదావరిఖని, కరీంనగర్, మంచిర్యాల లాంటి చుట్టుపక్కల ఉన్న పట్టణాలనుండి పర్యాటకులు వస్తుంటారు. అంతే కాకుండా ప‌క్క‌రాష్ట్రం మ‌హారాష్ట్ర నుండి కూడా ప‌ర్యాట‌కులు వ‌చ్చి ఇక్క‌డ ఎంజాయ్ చేస్తుంటారు. అయితే ఈ జలపాతం వద్ద ఎలాంటి సెక్యూరిటీ లేకపోవడం తో ప్రమాదాలు జరిగిన ఘటనలు కూడా ఉన్నాయి. దాంతో పలువురు ప్రాణాలు కోల్పోయారు. నీటిలో దిగకుండా దూరంనుంచి చూడటానికి మాత్రం ఈ జలపాతం అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా తిర్యాణి అడ‌వుల్లో చిచ్చర లొడ్డి, పిల్లి గుండం జ‌ల‌పాతాలు కూడా ఉన్నాయి. మరోవైపు తిర్యానీలో చెలమల  ప్రాజెక్టు కూడా ఉంది. చుట్టూ అడవులు మధ్యలో ఉన్న ఈ ప్రాజెక్టు ఎంతో ఆహ్లాదకరంగా అందంగా కనిపిస్తుంది. ప్రభుత్వం గ‌నుక‌ శ్రద్ధ పెట్టాలి కానీ ఆసిఫాబాద్ జిల్లాలోని తిర్యాని అడవులు గొప్ప పర్యాటక కేంద్రంగా తయారవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: