న‌వంబ‌ర్ 08న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ 2020కి సంబంధించిన  పద్మశ్రీ పురస్కారాలను ప్రదానం చేసిన సంగతి తెలిసిన‌దే. అయితే ఇందులో ముఖ్యంగా ట్రాన్స్‎జెండర్, జానపద నృత్యకారిణి మంజమ్మ జోగతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.  రాష్ట్రపతి భవన్‌లో సోమ‌వారం  జరిగిన అవార్డుల ప్ర‌దానోత్స‌వంలో  రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నుంచి పద్మ అవార్డును అందుకునే ముందు మంజమ్మ జోగతి రాష్ట్రపతికి దిష్టి తీశారు.

ఆ తర్వాత రామ్ నాథ్ కోవింద్ వద్దకు వెళ్లిన  మంజమ్మ కొంగుతో ఆయనను ఆశీర్వదించింది. ఈ సన్నివేశం స్టేజ్ పై ఉన్న ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఆమె హావభావాలకు ముగ్ధులైన వారంతా చిరునవ్వులు చిందించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన‌ది.

తన స్టైల్లో రాష్ట్రపతిని నమస్కరించి.. అందరినీ ఆకట్టుకున్నారు మంజమ్మ. గొప్ప సంఘ సంస్కర్తగా ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. సమాజసేవ చేసి కూడ ఆమె గుర్తింపు తెచ్చుకున్నారు. క‌ర్ణాట‌క జాన‌ప‌ద అకాడ‌మీకి అధ్యక్షురాలిగా ప‌నిచేసిన తొలి ట్రాన్స్‌విమెన్‌గా మంజమ్మ చరిత్రలో నిలిచారు. అంతేకాకుండా దేశంలో పద్మశ్రీ అందుకున్న తొలి ట్రాన్స్ జెండర్‌గా రికార్డు సృష్టించారు.

 ఆమె దశాబ్దాలపాటు సామాజిక, ఆర్థిక పోరాటాలు చేశారు. చిన్ననాటి నుంచి ఎన్నో అవమానాలు కూడ ఎదుర్కొన్నారు. వాటన్నింటిని తట్టుకుని ప్ర‌స్తుతం సన్మానాలు అందుకుంటూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు మంజ‌మ్మ.  బళ్లారి జిల్లాలోని కల్లుకంబ గ్రామానికి చెందిన మంజమ్మ అసలు పేరు ఏమిటంటే మంజునాథ్ శెట్టి.

ఆమె యుక్త వయసులో తనను తాను స్త్రీగా గుర్తించి  పేరు మార్చుకున్నారు మంజ‌మ్మ‌.  దీనిని ఆమె కుటుంబం కూడా అంగీకరించి,  మంజమ్మను జోగప్పగా మార్చడానికి హోస్పేట్ సమీపంలోని హులిగేయమ్మ ఆలయానికి తీసుకువెళ్లి పూజలు చేసారు.  ఆ త‌రువాత  మంజమ్మ జోగతి చిన్ననాటి నుంచి పలు కళారూపాలు, జోగతి నృత్యం, దేవతలను స్తుతిస్తూ జానపద పాటలు పాడటంలో ప్రావీణ్యం సంపాదించుకున్నారు. జానపద నృత్యకారిణిగా తన వృత్తిని ప్రారంభించి.. జోగిని కాళవ్వ మరణానంతరం జోగటి బృందం బాధ్యతలు స్వీకరించి రాష్ట్రవ్యాప్తంగా ప్రదర్శనలు ఇచ్చారు మంజ‌మ్మ‌.



మరింత సమాచారం తెలుసుకోండి: