ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు మ‌రొక ముప్పు పొంచి ఉన్న‌ది. మ‌రోసారి ఏపీ రాష్ట్రంలో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం క‌నిపిస్తోందని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు ఇప్ప‌టికే వెల్ల‌డించారు. న‌వంబ‌ర్ లో 29న అండ‌మాన్ తీరంలో అల్ప‌పీడ‌నం ఏర్ప‌డే అవ‌కాశం ఉన్న‌దని వాతావ‌ర‌ణ శాఖ పేర్కొంది. ఈ నేప‌థ్యంలోనే రేపు, ఎల్లుండి ద‌క్షిణ కోస్తాంద్ర‌, రాయ‌ల‌సీమ‌కు భారీ వ‌ర్ష సూచ‌న ఉందని తెలిపింది. ముఖ్యంగా మ‌రో రెండు రోజుల పాటు చిత్తూరు, నెల్లూరు జిల్లాల‌లో భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని వెల్ల‌డించిన‌ది. సుమారు 13 సెంటిమీట‌ర్ల  వ‌ర‌కు వ‌ర్షపాతం న‌మోదు కావచ్చు అని అంచెనా వేసింది.

వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో చిత్తూరు జిల్లా యంత్రాంగం ఇప్ప‌టికే అప్ర‌మత్త‌మైన‌ది.  చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో విద్యాలయాలకు సెలవు ప్రకటించారు అధికారులు. ముఖ్యంగా తూర్పు ప్రాంతాల్లో ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండటంతో అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ హరిణారాయన్ సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు కాజ్‌వేలు దాటరాదని హెచ్చరిక జారీ చేసారు. అవ‌స‌రం అయిన ప్ర‌తి చోట పున‌రావాస కేంద్రాల ఏర్పాటు చేసేందుకు అధికారులు సిద్దంగా ఉండాలని ఆదేశించారు.

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కడప, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో తీవ్ర ప్రభావం చూపిన విషయం విధిత‌మే.  ఈ త‌రుణంలోనే మూడు రోజుల పాటు  కేంద్ర బృందం ఏపీలో పర్యటిస్తుంది. ఇప్ప‌టికే శుక్ర‌వారం చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి మండలంలో వరి పంటను పరిశీలించారు. ఇవాళ  కడప జిల్లాలో  మరో బృందం పర్యటించనుంది. రేపు నెల్లూరు జిల్లాలో కేంద్ర బృందం పర్యటించనున్న‌ది. ఈనెల 29న కేంద్ర బృంద సభ్యులు సీఎం జగన్‌తో కూడా సమావేశం కానున్నారు.

అదేవిధంగా రాబోయే మూడు, నాలుగు రోజుల్లో త‌మిళ‌నాడులో కూడా భారీ  వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్ల‌డించింది. త‌మిళ‌నాడులోని  28 జిల్లాలపై ఈ ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. మ‌రోవైపు శ్రీ‌శైలం ప్రాజెక్టుకు వ‌ర‌ద కొనుగుతూనే ఉంది. ప్ర‌స్తుతం ప్రాజెక్ట్ ఇన్‌ప్లో 13,254 క్యూసెక్కులుకాగా.. ఔట్ ప్లో 19, 229 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మ‌ట్టం 885 అడుగులు ప్ర‌స్తుతం 867 అడుగుల వ‌ర‌కు నీరు చేరి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: