మనలో చాలామంది వారి గురించే వారే గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. మాటలు కోటలు దాటుతూ ఉంటాయి. కానీ ఆ చెప్పిన మాటలను మాటలకే పరిమితం చేస్తారు. చెప్పే మాటలకు చేసే పనులకు అసలు పొంతనే ఉండదు. ఇలాంటి వారు వ్యక్తిత్వాన్ని కోల్పోతూ ఉంటారు. అవతలి వ్యక్తులు కూడా వీరి మాటలకు పెద్దగా ప్రాధాన్యతనివ్వరు. ఇతరులు కూడా వీరు మాటలకు మాత్రమే పరిమితమవుతారని త్వరలోనే గ్రహిస్తారు. 
 
సాధారణంగా వీరు వారి మాటలతో ఇతరులను ప్రభావితం చేయాలని ప్రయత్నిస్తారు. కొందరు మాటలతో ఇతరులను ప్రభావితం చేస్తారు. కానీ వీరు చెప్పిన మాటలు వీరే జీవితంలో పాటించరు. ఇలాంటి వ్యక్తుల మాటలను నమ్మి నిర్ణయాలు తీసుకున్న వారు కూడా చాలా సందర్భాల్లో నష్టపోతూ ఉంటారు. జీవితంలో చెప్పింది చేయటాన్ని వ్యక్తిత్వంగా మలుచుకున్నవారికి విజయం సులభంగా సొంతమవుతుంది. 
 
జీవితంలో ఎల్లప్పుడూ చెప్పింది చేయడం... చేసేది చెప్పడం అలవరచుకోవాలి. అలా అలవరచుకున్నవారికే సమాజంలో గౌరవం, గుర్తింపు లభిస్తాయి. అలా కాకుండా గొప్పలు చెప్పుకుంటూ చేసే పనులలో నిర్లక్ష్యం వహిస్తే ఎప్పటికీ సక్సెస్ సొంతం కాదు. అలాంటి వాళ్లు జీవితాంతం ఎదుగూబొదుగూ లేకుండా జీవించాల్సి ఉంటుంది. ఇతరులకు కూడా అలాంటి వ్యక్తులపై దురభిప్రాయం కలిగే అవకాశం ఉంది. 
 
జీవితంలో మనం మాట్లాడే మాటలను అవసరానికి తగిన విధంగా మాట్లాడాలి. మనం ఉన్నతస్థాయిలో ఉన్నా మన గురించి మనం గొప్పలు చెప్పుకోకూడదు. అవతలి వ్యక్తులు సలహాలు, సూచనలు కోరితే మాత్రమే మనం స్పందించాలి. వృథా మాటల వల్ల ఫలితం శూన్యం. ఆ మాటల వల్ల చేకూరే ప్రయోజనం కంటే కలిగే నష్టమే ఎక్కువ. జీవితంలో మాటల కంటే చేతలతోనే మనమేంటో అవతలి వాళ్లకు చెప్పాలి. మాటలను పొదుపుగా వాడాలి. అనవసర మాటల వల్ల సమయం వృథా కావడం తప్ప ఎటువంటి ప్రయోజనం ఉండదని గుర్తుంచుకోవాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: