జీవితంలో, కెరీర్ లో మనలో ఉండే కొన్ని మంచి లక్షణాలు మనకు మంచి చేస్తే కొన్ని లక్షణాలు చెడు చేస్తాయి. అలా చెడు చేసే లక్షణాలలో మొహమాటం మొదటి లక్షణం. మొహమాటం చాలా సందర్భాల్లో మొదటికే మోసం తెస్తుంది. మొహమాటం ఉన్న వ్యక్తి జీవితంలో చాలా కోల్పోయే అవకాశం ఉంటుంది. మొహమాటం ఉన్న వ్యక్తులను చాలామంది తమ పనుల కోసం వినియోగించుకుంటారు. 
 
ఇలాంటి వ్యక్తులు ఇతరుల సహాయ సహకారాలకు తీసుకోవడానికి కూడా ఇష్టపడరు. మొహమాటాన్ని వీడితే మాత్రమే జీవితంలో ఏ పనిలోనైనా సులభంగా విజయం సాధించడం సాధ్యమవుతుంది. కొన్ని చిట్కాలు పాటించి మొహమాటాన్ని తగ్గించుకోవచ్చు. మొహమాటంతో ఇబ్బందులు పడే వాళ్లు ఇతరుల కోసం ఇష్టం లేని పనులు చేసి బాధ పడుతూ ఉంటారు. చాలా మంది తమ వస్తువులు అవతలి వ్యక్తులకు ఇవ్వడం ఇష్టం లేకపోయినా మొహమాటంతో ఇచ్చి బాధ పడుతూ ఉంటారు. 
 
ఇతరులకు వస్తువులు ఇవ్వడం ఇష్టం లేకపోతే నిర్మొహమాటంగా చెప్పేయడం మంచిది. ఇతరులు ఏమనుకుంటారో అని ఆలోచిస్తే మనం బాధ పడాల్సి వస్తుంది. మన జీవితంలో మనకంటూ కొన్ని హక్కులు, ఇష్టాలు, అభిప్రాయాలు ఉంటాయి. మన అభిప్రాయాలను, నమ్మకాలను ఇతరులకు స్పష్టంగా తెలియజేయాలి. చాలా మంది మొదట అవతలి వ్యక్తులకు ఇష్టం లేకపోయినా పని చేస్తామని మాట ఇచ్చి ఆ తరువాత బాధ పడుతూ ఉంటారు. 
 
అలా కాకుండా ఇష్టం లేకపోతే మొదట్లోనే చెప్పేయడం మంచిది. మనలో చాలామంది కొత్తవారితో పరిచయాలను పెద్దగా ఇష్టపడరు. కొత్తవారితో మాట్లాడాలంటే సిగ్గు పడుతూ నలుగురితో కలవలేక అవకాశాలను కోల్పోతూ ఉంటారు. ఎప్పుడైతే సమాజంలో పరిచయాలు పెరుగుతాయో అప్పుడే ఇబ్బందులు, మొహమాటాలను అధిగమించడం సాధ్యమవుతుంది. ఉత్సాహవంతమైన పలకరింపుల ద్వారా పరిచయాలను పెంచుకోవచ్చు. మొహమాటాన్ని వీడి ప్రయత్నాలు చేస్తే మాత్రమే ప్రస్తుత కాలంలో విజయం సాధించడం సాధ్యమవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: