మనిషి ఆలోచనలు ఎప్పుడూ తటస్థంగా ఉండవు, అవి నిరంతరం మారుతూనే ఉంటాయి. అయితే కొన్ని సందర్భాల్లో ఇది వరం అయితే, మరికొన్ని సందర్భంలో ఇదే శాపంగా మారుతుంది. మనకు చెడు చేసిన వారిని మర్చిపోవచ్చు. కానీ మనకు మంచి చేసిన వారిని మాత్రం అస్సలు మర్చిపోకూడదు. అదే విధంగా నోటి నుండి మాట వచ్చే సమయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ప్రతి ఒక్కరు వారి జీవితంలో తప్పక గుర్తుంచుకోవలసిన అంశం. నోటి నుంచి మాట జారితే వెనక్కు తీసుకోవడం అసాధ్యం. అందుకే ఏదైనా అనే ముందే ఆలోచించాలి, లేదంటే ఆ తర్వాత ఎంత యోచించినా ప్రయోజనం ఉండకపోవచ్చు. ముఖ్యంగా ఎవరైతే మన మంచిని కోరుకుంటారో వాళ్ల మనసును నొప్పించకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంటుంది.

మనం అంటే నచ్చని వ్యక్తులకు, మనం ఏం మాట్లాడినా, ఏం చేసినా వారికి ఎక్కువగా తప్పే కనిపిస్తుంది. కాబట్టి ఇటువంటి వారితో ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. కానీ మన మంచి కోరుకునే వ్యక్తులతో మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. వారిని ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడి వారిని దూరం చేసుకోకూడదు. మనకు బాధ కలిగింది కదా అని ఆలోచించకుండా టక్కున ఏదో ఒకటి అనడం వలన మనకే నష్టం వాటిల్లుతుంది. మనల్ని ఇష్టపడుతూ మనం బాగుండాలని కోరుకునే వారిని మన మాటలతో సంతోష పెట్టక పోయినా పర్వాలేదు కానీ, కష్టం మాత్రం కలిగించకూడదు.

నరం లేని నాలుకకు అడ్డూ అదుపూ ఉండదంటారు పెద్దలు. మంచి చెడులను ఎరిగిన మనిషి మాట్లాడే ముందు ఆలోచించాలి. నాలుకను అదుపులో పెట్టుకోవడం నేర్చుకోవాలి. సందర్భం ఏదైనా సమయస్ఫూర్తితో వ్యవహరించాలి. అప్పుడే మనం అనుకున్న వ్యక్తులు ఎప్పటికీ మనకు దగ్గరగానే ఉంటారు. అదే విధంగా మనల్ని అభిమానించే వారి సంఖ్య పెరుగుతుంది. సమాజంలో బ్రతుకుతున్నాం కాబట్టి మనకంటూ కొందరు మనుషులు మన పక్షాన నిలబడేవారు ఉండాలి. అలా జరగాలంటే పై విషయాలను తప్పక పాటించాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: