డిజిటల్‌ ఇండియాలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ ఈజీ గ్యాస్‌ కార్డు వల్ల అనేక లాభాలు ఉన్నాయి. లొకేషన్‌ రిజిష్టర్‌ కావడం వల్ల వినియోగదారునికి గ్యాస్‌ డెలివరీ పారదర్శకంగా జరుగుతుంది. కష్టమర్స్‌కు ముందే డెలివరీ కన్ఫర్మేషన్‌ అవుతుంది. గ్యాస్‌ రాయితీ ఖచ్చితంగా బదిలీ అవుతుంది.సిలెండర్‌ బుకింగ్‌, డెలివరీ వినియోగదారుడే చేసుకోవచ్చు. నగదు రహిత చెల్లింపులు చేసుకోవచ్చు. నగదు రహిత చెల్లింపులు వల్ల వాలెట్స్‌, గూగుల్‌ పే, ఫోన్‌ పే, హెచ్‌పీ రివ్యూయల్‌ యాప్స్‌ ఇచ్చే క్యాష్‌ బ్యాక్‌లు కూడా పొందవచ్చు. ఈజీ గ్యాస్‌ కార్డులు పంపిణీ రూ. 20లకే జరుగుతోంది.ఈ కార్యక్రమం పూర్తయితే వినియోగదారులకు గ్యాస్‌ మరింత అందు బాటులోకి రానుంది. వినియోగదారుల కష్టాన్ని తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఈజీ గ్యాస్‌ కార్డులు ప్రవేశపెడుతోంది.
 



కేంద్ర ప్రభుత్వం గ్యాస్‌ పంపిణీ విధానంలో సమూల మార్పులు తీసుకువస్తోంది. ఇంతవరకూ సెల్‌ఫోన్ల ద్వారా గ్యాస్‌ బుకింగ్‌ చేసుకుని గ్రామానికి వచ్చిన గ్యాస్‌ బండి వద్దకు వెళ్లి డబ్బులు చెల్లించి విడిపించుకునేవారు. ఒకవేళ బుకింగ్‌ చేసిన వినియోగదారుడు రాలేని పక్షంలో ఏ షాపు వద్దకో తీసుకొని వెళ్లి ఆ షాపు యజమానికి అదనంగా రూ. 50ల వరకు ఇచ్చి విడిపించుకొనేవారు. కానీ కేంద్రం ఆలోచనతో ఇప్పుడు ఆ పరిస్థితులు మారబోతున్నాయి. గ్యాస్‌ బుకింగ్‌ నుంచి డెలివరీ అయ్యేంతవరకు గ్యాస్‌ వినియోగదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రవేశపెట్టబడే కార్డులు. దీనిపై ఉన్న 16 అంకెల నంబరు చాలా ప్రత్యేకం. దేశంలో ఎవరి నంబర్‌ వారిదే. ఇవి ఏటీఎం, డెబిట్‌ కార్డుల వలే పనిచేస్తాయి. ఇదీ మన ఆధార్‌ నంబర్‌, సెల్‌ నంబరు వంటిదే. దీనిని గ్యాస్‌ కనెక్షన్‌కు కనెక్ట్‌ చేసి డెలివరీ బాయ్‌ ఇవ్వగానే స్వైప్‌ చేసేలా కేంద్రం ఏర్పాటు చేస్తోంది.
 



గ్యాస్‌ వినియోగదారుడు లేకపోతే పక్కింటి వారికి ఈ కార్డు ఇచ్చి డెలివరీ చేసుకోవచ్చు. గ్యాస్‌ తీసుకోగానే వినియోగదారుని సెల్‌కు మెసేజ్‌ వస్తుంది. ఈ 16 అంకెల ఈజీ గ్యాస్‌ కార్డును ఏటీఎం కార్డు సైజులో హెచ్‌పీసీఎల్‌ అందజేస్తోంది. ఈ 16 అంకెల నంబరు మన కన్జుమర్‌ నంబర్‌కు లింక్‌ అవుతుంది. గ్యాస్‌ డెలివరీ సమయంలో మన సెల్‌ నంబర్‌కు ఒక ఓటీపీ వస్తుంది. గ్యాస్‌ డెలివరీ చేసేటప్పుడు బోయ్‌ ఈ 16 అంకెలున్న కార్డును తన దగ్గరున్న స్వైపింగ్‌ మిషన్‌లో స్వైప్‌ చేస్తారు. అందులో కన్జ్యుమర్‌ నంబరు ఎంటర్‌ చేయగానే మన సెల్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్‌ చేయమని అడుగుతుంది. ఓటీపీ ఎంటర్‌ చేసిన తరువాత పేమెంట్‌ అంశం (ఎంత డబ్బులు చెల్లించాలో) తెరపై కనిపిస్తుంది. దీని ఆధారంగా క్రెడిట్‌ కార్డు గాని, డెబిట్‌ కార్డు గాని, పేటీఎం గాని, ఫోన్‌ పే ద్వారా గానీ చెల్లించవచ్చు. ఈ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం మొట్టమొదట మహరాష్ట్రలోని పూణేలో ప్రవేశపెట్టింది. ఇది విజయవంతం కావడంతో ఇప్పుడు అన్ని చోట్లా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: