ఈమధ్య దేశవ్యాప్తంగా సోషల్ నెట్ వర్కింగ్ యాప్ లో  టిక్ టాక్ యాప్  విపరీతమైన క్రేజ్ సంపాదించింది .ఈ యాప్ డైలాగ్స్, ఎమోషన్స్, సాంగ్స్ ఇలా అన్ని ఉన్నందువల్ల  యువతను విపరీతంగా ఆకర్షిస్తోంది. అలాగే ఈ యాప్ యువకుల వయస్సు రీత్యా అడ్డదారులు తొక్కడానికి కూడా సహకరిస్తోంది. సరదాల కోసం వాడేఈ  యాప్  వల్ల  కొన్ని మోసాలు కూడా  జరగడం మొదలైయ్యాయి.

  ఇలాంటి టిక్ టాక్ యాప్ ద్వారా సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని యుక్తమాసాన్పల్లి గ్రామానికి చెందిన ఇద్దరు యువతులు ప్రేమ పేరుతో మోసపోయారు. టిక్ టాక్ లో అనంతపురం జిల్లాలోని బొమ్మనహళ్ మండలం దర్గాహోన్నూరుకి చెందిన వంశీ, వన్నూరు స్వామి అనే ఇద్దరు యువకులతో ఆరు నెలల క్రితం అమ్మాయిలకి టిక్ టాక్ లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వారి మధ్య ప్రేమగా మారింది.

ఆరు నెలలు ఘాటుగా ప్రేమించుకున్న వారు పెళ్లితో ఒక్కటవ్వాలనుకున్నారు. ఈ మేరకు అమ్మాయిలు నిశ్చయించుకుని అబ్బాయిలతో ఈ విషయం చెప్పారు. వారు కూడా సరే పెళ్లి చేసుకుంటామని నమ్మ బలికారు. వంశీ, వన్నూరు స్వామి మాటలు నమ్మిన యువతులు  ప్రేమించిన వారి కోసం యువకుల గ్రామానికి చేరుకున్నారు. ఎంతో ఆశతో వెళ్లిన వారికి యువకులు ఇద్దరు మాట మార్చి పెళ్లి చేసుకోవడం కుదరదని తేల్చి చెప్పారు.

దీంతో తల్లిదండ్రులను వదిలి వచ్చిన వారికి ఏం చేయాలో తోచలేదు. మాయ మాటలు నమ్మి మోసపోయామని యువతులు ఆలస్యంగా తెలుసుకున్నారు. దీంతో అమ్మాయిలు ఇద్దరు స్థానిక పోలీస్ స్టేషన్ లో వంశీ, వన్నూరు స్వామిపై ప్రేమించి మోసం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసుల వారిపై కేసు నమోదు చేశారు. యువతులను  స్థానిక ఉజ్వలహోమ్ కు తరలించి పోలీసులు ప్రశ్నిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: