దేశంలో రోజు రోజుకీ మహిళలపై దారుణ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.  కట్నం తీసుకురాలేదన్న కోపంతో కోడలిని రెడ్‌లైట్ ఏరియా నిర్వాహకులకు అమ్మేశారు అత్తమామలు.బిహార్‌లో ఈ  దారుణ ఘటన చోటుచేసుకుంది. దీనిపై నాలుగేళ్ల తర్వాత బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.

బిహార్‌లోని అరియారియా జిల్లాకు చెందిన మహ్మద్ షమీమ్‌తో , కతిహార్ జిల్లా ఠానా కోడా ప్రాంతానికి చెందిన యువతికి  ఏడేళ్ల క్రితం వివాహమైంది. ముందుగా మాట్లాడుకున్న ప్రకారం వధువు తల్లిదండ్రులు అన్ని లాంఛనాలు పూర్తిచేశారు. అయితే పెళ్లయిన కొద్దిరోజులకే అదనపు కట్నం తీసుకురావాలంటూ ఆమెను భర్త , అత్తమామలు వేధించడం మొదలుపెట్టారు. దీనిపై 2015లో పంచాయతీ జరగడంతో యువతిని అత్తింట్లో జాగ్రత్తగా చూసుకోవాలని పెద్దలు సూచించారు.

కానీ రెండ్రోజుల తర్వాత ఆమె కనిపించకుండా పోయింది. తమ కోడలు ఎక్కడికి వెళ్లిందో తమకు తెలీదని అత్తమామలు చెప్పడంతో యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె కోసం కొంతకాలం వెతికినా ఎక్కడా ఆచూకీ లభించలేదు. దీంతో అందరూ ఆ విషయాన్ని మరిచిపోయారు.

 అయితే కొద్దిరోజుల క్రితం పుట్టింటికి చేరుకున్న ఆమె అత్తమామలు తనను రెడ్‌లైట్ ఏరియాలో అమ్మేశారని, అక్కడ నాలుగేళ్లుగా తనను బంధించి బలవంతంగా వ్యభిచారం చేయించారని చెప్పి వాపోయింది. దీంతో ఆమె తల్లిదండ్రులు బాధితురాలిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి ఫిర్యాదు చేయించారు. పంచాయతీ జరిగిన రెండ్రోజుల తర్వాత తనకు భర్త, అత్తమామలు మత్తు మందిచ్చారు. తేరుకునేసరికే కాన్పూర్‌లోని రెడ్‌లైట్ ఏరియాలో ఉన్నాను, నన్ను డబ్బుల కోసం వారికి అమ్మేశారని తెలుసుకుని షాకయ్యాను. తప్పించుకునే మార్గం లేక నాలుగేళ్లుగా అక్కడే వ్యభిచార కూపంలో మగ్గుతూ ఉన్నాను. చివరికి తప్పించుకుని ఇన్నాళ్లకు ఇంటికి చేరుకోగలిగాను అంటూ బాధితురాలు  పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన జీవితాన్ని నాశనం చేసిన భర్త, అత్తమామలను కఠినంగా శిక్షించాలని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై కోడా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: