వెటర్నరీ డాక్టర్ దిశపై హత్యాచారం చేసిన నిందితులు నలుగురు ఎన్ కౌంటర్ అయిపోయారు.   నలుగురు నిందితుల ఎన్ కౌంటర్ తో దిశ ఆత్మ శాంతించిందని కూడా అంటున్నారు.  ఎన్ కౌంటర్ చేసినందుకు దేశవ్యాప్తంగా పోలీసులకు అభినందనలు, హర్షాతిరేకలు పొంగి పొర్లుతున్నాయి.  ఇంతవరకూ బాగానే ఉంది. రేపటి కోర్టు, మానవ హక్కుల విచారణల్లో ఈ ఎన్ కౌంటర్లను పోలీసులు ఎలా సమర్ధించుకుంటారు ? ఇపుడిదే అసలైన సమస్యగా మారబోతోంది.

 

హత్యాచారం ఘటన వెలుగు చూడగానే ముందు జనాల ఆగ్రహమంతా పోలీసులపైకే మళ్ళింది. నిజానికి ఈ ఘటనలో బాధితురాలు చేసిన తప్పులు కూడా ఉన్నాయి. తనకు భయంగా ఉందని చెల్లెలితో ఫోన్లో చెప్పిన బాధితురాలు ఒక్కసారి కూడా 100 డయల్ చేసి పోలీసులతో మాట్లాడటానికి ఇష్టపడలేదు. పోనీ టోల్ గేటు దగ్గరే ఉందా అంటే అదీలేదు. భయం భయం అంటూనే నిందితులతో పాటు వెళ్ళింది. దాన్నే నలుగురు అడ్వాంటేజ్ గా తీసుకున్నారు.

 

సరే ఘటన తర్వాత బాధితురాలిపై సానుభూతి ఉండటం సహజం కాబట్టి ఆమె తప్పులను పట్టించుకోకుండా అందరూ పోలీసులపైనే ఆగ్రహం వ్యక్తం చేశారు. తర్వాత ఆ ఆగ్రహం కాస్త నిందితులపైకి మళ్ళింది. ఎప్పుడైతే పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారో అప్పటి నుండి వారిని వెంటనే ఉరి తీసేయాలని, రాళ్ళతో కొట్టి చంపమని, తమకు ఐదు నిముషాలు అప్పగించాలంటూ డిమాండ్లు పెరిగిపోయాయి.

 

సరే తమపై పడిన నిందను తుడిపేసుకునేందులో లేకపోతే జనాగ్రహానికి అనుగుణంగా నడుచుకోవాలనో మొత్తానికి నలుగురిని పోలీసులు ఎన కౌంటర్ చేసేశారు. ఇంత వరకూ ఓకేనే. కానీ పోలీసులు చేసిన ఎన్ కౌంటర్ కోర్టు సమీక్షలో నిలబడుతుందా ? మానవ హక్కుల కమీషన్ వేసే ప్రశ్నలకు పోలీసులు ఏమని సమాధానం చెబుతారు ? అన్నదే ప్రధాన ప్రశ్న.

 

ఎందుకంటే మీడియా సమావేశంలో సజ్జనార్ మాట్లాడుతూ తాము ఎన్ కౌంటర్ ఎందుకు చేయాల్సొచ్చింది ? నిందుతులు తమ అధికారులను ఏ మేరకు గాయపరిచారు ? తాము ఎంత దూరం నుండి కాల్చారు ? ఎన్ని రౌండ్లు కాల్చారనే విషయాలను పూసగుచ్చినట్లు చెప్పారు. ఇవన్నీ కోర్టు విచారణలో పోలీసులు నిరూపించుకోగలగాలి. పైగా తాము కాల్చిన ప్రతీ బుల్లెట్ కు లెక్క చెప్పాలి.

 

పోస్టుమార్టమ్ లో  వచ్చే నివేదికకు, పోలీసులు చెప్పే సమాధానినికి లెక్క సరిపోవాలి. ఏమాత్రం తేడా వచ్చినా పోలీసులపైనే ఉల్టా కేసులు పడతాయి. గతంలో ఇలా రివర్స్ కేసులను ఎదుర్కొన్న పోలీసులున్నారు. కోర్టు తర్వాత పోలీసులు మానవహక్కుల కమీషన్ విచారణను కూడా ఎదుర్కోవాల్సుంటుంది. ఎన్ కౌంటర్ చేసినంత సులువు కాదు విచారణను ఎదుర్కోవటమంటే.  కోర్టులో కానీ మానవ హక్కుల కమీషన్ విచారణలో కానీ గట్టి లాయర్ ఎవరైనా ఎదురైతే అప్పుడుంటుంది పోలీసులకు  అసలైన సినిమా.

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: