మరీ చిన్న వయసులో 14 నుంచి 18 ఏళ్లలోపు గర్భం దాల్చినా కష్టమే! 30 ఏళ్లు దాటిన తర్వాత గర్భం దాల్చినా క్లిష్టమే! పెళ్లీడుకు తగిన వయసు 20 నుంచి 25 ఏళ్లు. ఈ వయసు కంటే ముందు గర్భాశయం పూర్తిగా వికసించి ఉండదు. గర్భం దాల్చడానికి తగినట్టుగా శరీరం ఎదిగి ఉండదు. 20 నుంచి 25 ఏళ్ల వయసులో నాణ్యమైన అండాలు విడుదలవుతాయి. తద్వారా ఆరోగ్యకరమైన బిడ్డ పుట్టే వీలుంటుంది. 25 ఏళ్లు దాటినప్పటి నుంచి అండాల నాణ్యత సన్నగిల్లడం మొదలవుతుంది. కాబట్టి ఆరోగ్యకరమైన పిల్లలు కావాలని కోరుకునేవారు 30 ఏళ్లలోపే బిడ్డకు జన్మనివ్వాలి. వ్యక్తిగత కారణాలరీత్యా గర్భం దాల్చడాన్ని వాయిదా వేయాలనుకుంటే, అండాలను ఎగ్‌ బ్యాంక్‌లో నిల్వ చేసుకోవాలి. ఆ తరువాత అవసరమైనప్పుడు గర్భం దాల్చవచ్చు. ఆరోగ్యకరమైన జీవనశైలి కీలకంవేళకు నిద్ర, ఆహారం, వ్యాయామం గర్భధారణకు ఉపకరించే అంశాలు. భార్యాభర్తల్లో ఎలాంటి శారీరక అనారోగ్యం లేకపోయినా పిల్లలు కలగకపోవడానికి కొన్ని కారణాలున్నాయి. సమతులాహారం, క్రమం తప్పని వ్యాయామం, రోజుకు 8 గంటల నిద్ర…. వీటిని అనుసరించకపోతే శరీర జీవక్రియలు క్రమం తప్పుతాయి. నెలసరి సమస్యలు తలెత్తుతాయి. 

 

అండాల విడుదల అటకెక్కుతుంది. దాంతో గర్భం దాల్చే అవకాశాలు సన్నగిల్లుతాయి. కాబట్టి వేళకు పోషకాహారం తీసుకుంటూ, కంటి నిండా నిద్రపోతూ, రోజుకి కనీసం 30 నిమిషాలపాటు వ్యాయామం చేస్తూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించాలి.  బయోలాజికల్‌ క్లాక్‌ దెబ్బతిందా?పగటి వేళను నిద్రకు కేటాయిస్తూ, రాత్రి వేళ డెస్కులకు అతుక్కుపోయి పని చేసే ఉద్యోగినుల బయొలాజికల్‌ క్లాక్‌ అస్తవ్యస్తం అవడం సహజం. ఫలితం… నెలసరి స్రావాల్లో హెచ్చుతగ్గులు, తేదీల్లో తారుమార్లు. బయొలాజికల్‌ క్లాక్‌ పనితీరు దెబ్బతింటే శరీరంలో హార్మోన్ల విడుదలలోనూ అవకతవకలు చోటు చేసుకుంటాయి. దాంతో నెలసరి క్రమం తప్పుతుంది. దాంతో గర్భం దాల్చే అవకాశాలు తగ్గుతాయి. ఎంబ్రియో ఎలర్జీగర్భం నిలవకపోవడం, పదే పదే గర్భస్రావం జరగడం నేటి యువతులు ఎదుర్కొంటున్న అతి ప్రధాన సమస్య. ఈ సమస్యను వైద్య పరిభాషలో ‘ఎంబ్రియో ఎలర్జీ’ అంటారు. 

 

ఈ ఎలర్జీ కలిగిన వారి శరీరం అండాన్ని రిజెక్ట్‌ చేస్తుంది. దాంతో గర్భం దాల్చినా నెలసరి ఆగిపోదు. అండం గర్భాశయంలో నాటుకోకపోవడం మూలంగా గర్భం దాల్చినా, నెలసరి స్రావంతోపాటు పిండం బయటకు వచ్చేస్తుంది. ఇలా జరుగుతున్న విషయం ఎవరంతట వాళ్లు గ్రహించలేనంత సహజంగా జరిపోతూ ఉంటుంది. నెలసరి క్రమం తప్పక వస్తున్నప్పటికి, ఎటువంటి గర్భనిరోధక పద్ధతులూ పాటించకుండా ఏడాదిపాటు కాపురం చేసినా పిల్లలు కలగకపోతే వైద్యుల్ని సంప్రతించి ఎంబ్రియో ఎలర్జీ ఉందేమో నిర్థరించుకోవాలి. గర్భం – మధుమేహంగర్భం దాల్చినప్పుడు మధుమేహం తలెత్తితే దాన్ని ‘జెస్టేషనల్‌ డయాబెటిస్‌’ అంటారు. గర్భం దాల్చే సమయానికే మధుమేహం ఉన్నా, లేకపోయినా ఈ స్థితి ఎవరికైనా తలెత్తవచ్చు. మరీ ముఖ్యంగా తల్లితండ్రులకు మధుమేహం ఉంటే, ఆ యువతులు గర్భం దాల్చినప్పుడు, జెస్టేషనల్‌ డయాబెటిస్‌కు గురయ్యే అవకాశాలు ఎక్కువ. ఒకసారి ఈ సమస్యకు గురయితే, ఆ మహిళలు జీవితాంతం మధుమేహంతో బాధపడవలసి ఉంటుంది. పుట్టే బిడ్డ కూడా అధిక బరువుతో పుట్టే అవకాశాలుంటాయి. కాబట్టి ఈ కోవకు చెందిన మహిళలు మరింత జాగ్రత్తగా ఉండాలి. 

 

గర్భం దాల్చింది మొదలు తీపి పదార్థాలకు దూరంగా ఉండాలి. గర్భం దాల్చడానికి ఎంతోముందు నుంచీ సమతులాహారం తీసుకుంటూ, వ్యాయామాన్ని దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలి. ఒకవేళ మధుమేహం ఉన్న మహిళలు గర్భం దాల్చితే, మందులతో చక్కెరను అదుపులో ఉంచుకోవాలి. వైద్యుల పర్యవేక్షణలో ఉంటూ అవసరం మేరకు ఇన్సులిన్‌ మోతాదును సరిచేసుకుంటూ, ప్రత్యేకమైన ఆహార నియమాలు పాటిస్తూ ఉండాలి. అధిక రక్తపోటు ఉంటే?అధిక రక్తపోటు ఉన్న మహిళలు గర్భం దాల్చినప్పుడు కచ్చితంగా రక్తపోటు పెరుగుతుంది. ఇలాంటి మహిళలు కూడా గర్భం దాల్చింది మొదలు వైద్యులను సంప్రతిస్తూ రక్తపోటును అదుపులో ఉంచుకోవాలి. అలాగే మూత్రపిండాలు, కాలేయం పనితీరులను పరిశీలించుకుంటూ ఉండాలి. అధిక రక్తపోటు ఉండి గర్భం దాల్చిన మహిళలకు మూర్ఛ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువ. కాబట్టి వైద్యుల పర్యవేక్షణలో ఉంటూ, అవసరమైన పరీక్షలు చేయించుకుంటూ జాగ్రత్తగా మెలగాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: