పంచుమర్తి అనురాధ... బహుశా తెలుగుదేశం పార్టీ గురించి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి కనీస అవగాహన ఉన్న ఎవరికి అయినా సరే ఈ పేరు పరిచయం. తెలుగుదేశం పార్టీలో మహిళలకు ఇచ్చిన అవకాశాలను ఆమె సద్వినియోగం చేసుకున్నారో లేదో తెలియదు గాని చిన్న వయసులోనే మేయర్ గా పని చేసి సంచలనం సృష్టించారు. దాదాపు 20 ఏళ్ళ క్రితం ఆమె పట్టుమని 30 ఏళ్ళు కూడా రాకుండానే విజయవాడ మేయర్ గా ఎంపిక య్యారు. అప్పుడు ఎందరో ఉద్దండులను ఎదుర్కొని ఆమె మేయర్ అయ్యారు. 

 

ఇప్పుడు మంత్రులుగా ఎమ్మెల్యేలు గా ఉన్న వారిలో చాలా మంది కృష్ణా జిల్లాలో ఆమె తర్వాత వచ్చిన వాళ్ళే. తెలుగుదేశం పార్టీలో ఆమె నిర్వహించిన పదవులు కూడా ఏమీ లేవు. రాజకీయంగా ఆమె నిలబడటానికి చంద్రబాబు పెద్దగా అవకాశాలు ఇవ్వలేదు. ఎప్పుడో రెండేళ్ళు మిగిలి ఉన్న ఎమ్మెల్సీ పదవి వద్దని అన్నారని, చంద్రబాబు ఆమెకు ఇప్పటి వరకు పదవి ఇవ్వలేదు. అయినా సరే పార్టీ మీద ఉన్న ప్రేమ తో ఆమె రాజకీయాల్లో కొనసాగారు. ఆ పార్టీ వాణిని బలంగా వినిపించారు అనురాధ. 

 

ఇప్పుడు ఆమె పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నారు. ఈ సమయంలో ఆమె క్యాన్సర్ ని కూడా జయించారు. క్యాన్సర్ తో పోరాడిన ఆమె ఇప్పుడు రాజకీయాల్లో పోరాటం చేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం ఎక్కువగా చేస్తూ... ఏ విమర్శలు వచ్చినా సరే తట్టుకుని నిలబడుతున్నారు. చంద్రబాబు కూడా ఇప్పుడే ఆమె కృషి ని గుర్తిస్తున్నారు. మీడియా సమావేశాల్లో ఆమె పాల్గొని ప్రభుత్వాన్ని ఎండగట్టే కార్యక్రమాలు చేస్తున్నారు. సోషల్ మీడియా లో ఆమె లక్ష్యంగా అధికార పార్టీ కార్యకర్తలు ఎన్ని విమర్శలు చేసినా ఆమెను ఎన్ని రకాలుగా విమర్శించినా ఆమె మాత్రం వెనక్కు తగ్గలేదు. అయితే ఈ సారి ఆమెకు ప్రత్యక్ష ఎన్నికల్లో అవకాశం ఇవ్వాలి అనే డిమాండ్ వినపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: