త‌న పెళ్లి నిశ్చితార్థం తీపి క‌బురు తాత‌తో పంచుకోవాల‌ని, తాత ముఖంలో ఆనందం చూడాల‌నుకున్న ఆ యువ‌తికి కరోలినాలోని రీహాబిలిటేషన్‌ సెంటర్ అధికారుల నుంచి చేదు అనుభ‌వ‌మే ఎద‌రైంది. అమెరికాలో క‌రోనా విజృంభిస్తున్న వేళ అధికారులు చాలా క‌ఠిన నియ‌మాల‌ను అమ‌లు చేస్తున్నారు. అయితే తాత‌ను నేరుగా చూసి గుండెలకి హ‌త్తుకుని త‌న పెళ్లి ముచ్చ‌ట్ల‌ను వివ‌రించాల‌నుకున్న ఆ యువ‌తికి అధికారుల నుంచి అనుమ‌తి ద‌క్క‌లేదు. ఎలాగోలా అధికారుల‌ను బ‌తిమాలి..అది కూడా కొద్ది నిముషాలే సెంట‌ర్ వెనుకభాగంలోకి వెళ్లి అద్దాల్లోంచి తాత‌ను చూసి క‌ల‌త చెందింది.

 

 పెళ్లి సంగ‌తులన్నీ కూడా తాత‌ను అద్దాల్లోంచి చూసి..సైగ‌ల ద్వారా విష‌యం చెప్పాల్సి రావ‌డంతో క‌న్నీటి ప‌ర్యంత‌మైంది. యువ‌తి భావోద్వేగం చెంద‌డంతో తాత‌కు కూడా క‌న్నీళ్లు ఆగ‌లేదు. చిన్నత‌నం నుంచి త‌న చేతుల మీదుగా అల్లారు ముద్దుగా పెంచిన పాపాయి పెళ్లి కూతురు కాబోతున్న వేళా అన్ని ద‌గ్గ‌రుండి చూసుకోవాల్సిన తాను ఇలా నాలుగు గోడ‌ల మ‌ధ్య బంధీ అయిపోయానే అనుకుంటూ ఆ తాత చిన్న పిల్లాడిలా ఏడ్చేశాడు. ఈ హృదయ విదారక సంఘటనకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు  సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా వైరల్‌గా మారాయి. అమెరికాలోని నర్సింగ్‌ విద్యార్థిని కార్లీ బోయ్డ్‌ అనే యువతికి ఇటీవల నిశ్చితార్థం జరిగింది.

 

 నార్త్‌ కరోలినాలోని రీహాబిలిటేషన్‌ సెంటర్‌లో నివసిస్తున్న ఆమె తాత షెల్టాన్‌ మహాలా(87)తో ఈ విషయాన్ని కార్లీకి వివ‌రించి ఆనంద‌ప‌డాల‌ని అనుకుంది. కానీ కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో రీహాబిలిటేషన్‌ సెంటర్ నిర్వాహాకులు కార్లీని క‌లుసుకునేందుకు అవ‌కాశం ఇవ్వ‌లేదు. దీంతో కార్లీ నేరుగా ఆ సెంటర్‌కు వెళ్లి తన తాత ఉండే గది వెనుకకు వెళ్లింది. అద్దం కిటికీ నుంచే తన నిశ్చితార్థపు ఉంగరం చూపిస్తూ భావోద్వేదానికి లోనైంది. అలా కార్లీ అద్దంపై చేయి ఉంచగా.. ఆమె తాత కూడా చేతిని తాకుతున్నట్లుగా అద్దంపై చేయి ఉంచాడు. రీహాబిలిటేషన్‌ సెంటర్ నిర్వాహాకుల్లో ఒక‌రు తీసిన ఈ ఫొటోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్గా మారాయి. ఈ ఫొటోకు ఇప్పటి వరకూ 2 లక్షలకు పైగా లైక్‌లు రాగా వేలల్లో కామెంట్లు రావ‌డం గ‌మ‌నార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: