గర్భిణీ సమయంలో జాగ్రత్తలు – వ్యాధి నిరోధక టీకాలు – అమ్మ అనే మాటలోనే ఉంది కమ్మతనం. ఆ పిలుపు కోసం అమ్మ ఎంతగానో తాపత్రయపడుతుంది.బిడ్డ కడుపులో పడ్డప్పటినుండి  భూమి మీదకి వచ్చేదాకా ఆతృతగా ఎదురుచూస్తుంది. అయితే గర్భంతో ఉన్న మహిళ కొన్ని ఆరోగ్య సూత్రాలు పాటించాలి. అలాగే తప్పకుండా వ్యాధినిరోధక టీకాలు వేయించుకోవాలి.  టెటనస్  టాక్సయిడ్ (ధనుర్వాత టీకా).

 

 

ధనుర్వాతం రాకుండా గర్భిణీ స్త్రీకి టీకాలు యివ్వాలి. ఇది తల్లికి మాత్రమే కాక గర్భస్థ శిశువుకి కూడా రక్షణ కల్పిస్తుంది. ధనుర్వాతాన్ని కలిగించే సూక్ష్మ క్రిములు గుర్రం, పశువుల పేడలో సాధారణంగా ఉంటాయి. ఈ పేడ వల్ల కలుషితమైన ఏ వస్తువైనా వ్యక్తులకు పిల్లలకు తగిలినప్పుడు అంటు సోకే అవకాశం ఉంది. ముఖ్యంగా దెబ్బలు తగిలి చీరుకుపోయినప్పుడు, పుళ్ళు, కోసిన బొడ్డు వంటి గాయాలకు ఈ అంటు సోకే ప్రమాదం ఉంది. ధనుర్వాతం చాలా ప్రమాదకరమైన వ్యాధి. చనిపోయే అవకాశాలు చాలా ఎక్కువ. పేడతో కలుషితమైన కొడవళ్ళను బొడ్డు తాడు కోయడానికి ఉపయోగించే అలవాటు వల్ల పూర్వం కాన్పు సమయంలో ఎంతో మంది పిల్లలు చనిపోయేవారు. ప్రస్తుతం కాన్పు సమయంలో  శుభ్రతలు పాటించడం వల్ల మరణాలు చాలా వరకు తగ్గిపోయాయి. ధనుర్వాతం చికిత్స ఖర్చుతో కూడినది. ఏరియా మరియు జిల్లా స్థాయి ఆసుపత్రులలో మాత్రమే లభ్యమవుతుంది.

 

 

టీకాలు యివ్వడం ద్వారా ధనుర్వాతాన్ని నివారించవచ్చు. గర్భిణీ నమోదు చేసిన రోజు ఒక డోసు టి.టి. యింజెక్షన్ యివ్వాలి. ఒక నెల తరువాత రెండవ డోసు ఇవ్వాలి. కాన్పుకు ఒక నెల ముందే రెండు డోసులు యివ్వడం పూర్తవ్వాలి. ఒక వేళ గర్భిణీ అంతకు ముందే టి.టి. యింజెక్షన్ తీసుకుని ఉన్నట్లయితే ఒక డోసు యిస్తే చాలు. పిల్లలకు యిచ్చే డి.పి.టి. టీకాలలో ధనుర్వాత టీకా కూడా ఉంది. మొత్తం మూడు డోసులు, బూస్టర్ డోసు తీసుకున్నట్లయితే పిల్లలకు ధనుర్వాతం రాకుండా నివారించవచ్చు. ఏవైనా గాయాలు తగిలినప్పుడు కూడా అదనపు టి.టి. యింజక్షన్ యివ్వడం అవసరం.ఎలా టీకాలు వేయించుకోవడం వల్ల తల్లికి బిడ్డకి ఇద్దరికి మంచిది.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: