తరతరాలుగా ప్రపంచంలోని చాలా దేశాల్లో మగవారే ఇంటి పెద్దగా ఉంటున్నారు. చరిత్రలో కొన్ని రాజ్యాలు మాత్రం మహిళలకే ప్రాధాన్యం ఇచ్చాయి. అక్కడ రాజుకన్నా రాణే ముఖ్యం. రాణి తీసుకున్న నిర్ణయమే ఫైనల్. ఇలా ఉండటం వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? అంటే మగవారు ఇంటి పెద్దగా ఉండటం లేదా ఆడవారు ఇంటి పెద్దగా ఉండటం.. ఈ రెండింటిలో ఎవరికి ఏది బెటర్? అనే డౌట్ వచ్చింది కొందరు పరిశోధకులకు. అంతే యూనివర్సిటీ ఆఫ్ న్యూ మెక్సికోకు చెందిన ఓ బృందం ఈ విషయంపై పరిశోధన ప్రారంభించింది. దానికోసం హిమాలయాలకు దగ్గర్లో ఉన్న ఓ చైనా తెగను వాళ్లు ఎంచుకున్నారు.

 దక్షిణ చైనాలో టిబెట్ సరిహద్దుకు చాలా దగ్గరగా ఉండే మోసో తెగ వారి టార్గెట్. ఈ తెగకు సంబంధించిన ఈ ప్రాంతంలో చాలా గ్రామాలున్నాయి. అలాగే వీటిలో కొన్ని మహిళల అధికారంలో ఉంటే, మరికొన్ని మాత్రం పురుషుల ఆధీనంలో ఉన్నాయి. దీంతో ఈ రెండు విధానాలపై ఒకేసారి పరిశోధన చేసే అవకావం లభించింది. ఈ అవకాశాన్ని వదులు కోకూడదని న్యూమెక్సికో యూనివర్సిటీకి చెందిన మ్యాటిసన్ అనే పరిశోధకుడు డిసైడ్ అయ్యాడు. ఈ పరిశోధనలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయని తెలుస్తోంది.

మోసో తెగలో మహిళల ఆధీనంలోని గ్రామాల్లో కొన్ని ప్రత్యేక రూల్స్ ఉన్నాయి. అవేంటంటే.. ఆస్తి వారసత్వం మహిళలదే, కుటుంబ ఖర్చులు తదితరాలన్నీ ఆడవారే చూసుకుంటారు, అంతే కాదండోయ్ వీళ్లకు నచ్చినంత మంది అబ్బాయిలను పెళ్లి చేసుకోవచ్చు కూడా. ఇలాంటి ఆచారాలున్న గ్రామాల్లో మహిళలు ఆరోగ్యంగా ఉన్నారట. వారికి హృదయ సంబంధిత రోగాలు కానీ, డయాబెటీస్ గానీ మచ్చుక్కు కూడా లేదట.

అదే సమయంలో పురుషులు కుటుంబ పెద్దలుగా ఉన్న గ్రామాల్లో పరిస్థితిలో తేడా ఉందట. ఇక్కడి మహిళల్లో బీపీ ఎక్కువగా ఉండటం, డయాబెటీస్ తదితర సమస్యలు ఉన్నట్లు మ్యాటిసన్ బృందం చేసిన పరిశోధనలో తేలింది. మొత్తానికి మహిళలకు ప్రాధాన్యం ఇచ్చే విధానం ఆడవారి ఆరోగ్యానికి చాలా మంచిదని ఈ పరిశోధకులు తేల్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: