పుట్టుక ఎలా అయినా ఉండొచ్చు కాని చావు మాత్రం ఎవరూ ఊహించని విధంగా ఉండాలని చెబుతుంటారు. అంటే.. పుట్టుకతో నువ్వు పేదవాడిగా బాధలు పడుతున్నా.. చనిపోయే సమయానికి నీకంటూ చరిత్రలో కొన్ని పేజీలు రాసుకోవాలనేది దాని అర్థం అన్నమాట. ఇప్పుడు ఈ మాటలు ఎందుకు చెబుతున్నానంటే.. కేరళకు చెందిన ఓ మహిళ ఏ ఆఫీసులో అయితే చీపురు పట్టుకుని ఊడ్చే పని చేసిందో ఇప్పుడు అదే ఆఫీసులో అధికారిగా బాధ్యతలను చేపట్టింది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది వందకు వంద శాతం నిజం. కేరళలోని ఆనందవల్లి అనే మహిళ స్థానిక పంచాయతీ ఆఫీసులో స్వీపర్‌గా పదేళ్ల పాటు పనిచేసింది. అయితే కొల్లాం జిల్లాలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆనందవల్లి కూడా వార్డు మెంబర్‌గా పోటీ చేశారు.

పఠాన్‌పురం పంచాయతీ వార్డు సభ్యురాలిగా పోటీ చేసిన ఆమె విజయం సాధించారు. ఆఫీసులో పదేళ్లుగా నేలను శుభ్రం చేయడమే కాదు..  కుర్చీలు, టేబుళ్ల మీద ఉన్న దుమ్మును దులపడం వంటి పనులు కూడా చేస్తూ వచ్చారు. అనంతరం ఆఫీసు అటెండర్‌గా కూడా పనిచేసిన అనుభవం ఉంది. ఆమె భర్త పెయింటింగ్‌ పనిచేస్తారు. ఆయన సీపీఎం స్థానిక కమిటీలో సభ్యుడుగా కూడా ఉన్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కాగా.. భార్యాభర్తలిద్దరూ మొదటి నుంచి కమ్యూనిస్ట్‌ పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటూ వస్తున్నారు.

ఇదే వారికి ప్లస్ పాయింట్‌గా మారింది. ఈ సారి ఆ సీటు దళిత మహిళకు రిజర్వేషన్‌ రావడంతో పార్టీ సభ్యులు కూడా ఆనందవల్లిని పోటీకి నిలబెట్టాలని నిర్ణయించి ఆమెను పెట్టారు. ఆమెపై ఉంచిన నమ్మకాన్ని ఆనందవల్ల నిలబెట్టుకుంది. ఈ కారణంగానే మొదటి ఎన్నికల్లోనే గెలవడమే కాకుండా ప్రెసిడెంట్‌ పదవిని కూడా అలంకరించే స్థాయికి ఎదిగారు. నిన్నటి వరకు ఏ ఆఫీసులో అయితే నేలను తుడిచారో.. అదే ఆఫీసులోని ప్రధాన అధికారి కుర్చీలో ఆమె కూర్చున్నారు. పంచాయతీ సభ్యులంతా చప్పట్లు కొడుతూ ఆమెను ప్రెసిడెంట్‌ కుర్చీలో కూర్చోబెట్టారు. ఆ నిమిషాన్ని తాను జీవితంలో మర్చిపోనని ఆనందవల్లి అంటున్నారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: