తమిళనాడు
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు
కమల్‌హాసన్ రాష్ట్రమంతటా విస్త్రత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఆయన
పార్టీ తరఫున ఓటర్లకు మిగతా పార్టీలకు తీసిపోని రీతిలో తాయిలాలు కూడా ప్రకటించారు. దక్షిణ కోవై నియోజకవర్గం నుంచి కమల్ పోటీచేస్తున్నారు. ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న కాలికి కొద్దిగా వాపు రావడంతో ప్రచారానికి విరామం ప్రకటించారు. దక్షిణకోవై, తొండముత్తూరు నియోజకవర్గాల్లో ఇంటింటికీ తిరిగి ఓట్లు అభ్యర్థించారు. టీస్టాల్ లో ప్రజలతో కూర్చొని టీ తాగారు. ఈ సందర్భంగా స్థానికులంతా తమ సమస్యలను కమల్‌కు వివరించారు. ఆయనతో సెల్ఫీ తీసుకునేందుకు పోటీపడటంతో కొందరు అనుకోకుండా శస్త్రచికిత్స జరిగిన కాలిని తొక్కడంతో వాపు ఏర్పడింది. విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పడంతో సింగానల్లూరు బహిరంగరసభ తప్ప మిగతా కార్యక్రమాలన్నీ రద్దుచేసుకున్నారు. కాలికి గాయమైందని తేలడంతో ఆయనపై పోటీచేస్తున్న
బీజేపీ అభ్యర్థి కమల్ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.