ఇంకా అసలు వైఎస్ షర్మిల పార్టీ పెట్టనేలేదు అప్పుడే మిగిలిన పార్టీల్లో చిచ్చు మొదలైపోయింది.  పార్టీ ఏర్పాటుపై షర్మిల చెప్పిన మాటలను పట్టకుని ఇటు బీజేపీ అటు కాంగ్రెస్ మధ్యలో టీఆర్ఎస్ నేతలు విరుచుకుపడిపోతున్నారు. షర్మిల పార్టీ పెట్టింది మీకోసమే అంటే కాదు మీకోసమే అంటు ఒకరిపై మరొకరు ఆరోపణలు, విమర్శలు చేసుకుంటున్నారు. బీజేపీ నేతలేమో షర్మిలతో కేసీయారే పార్టీ పెట్టిస్తున్నట్లుగా మండిపోతున్నారు. ఇక కాంగ్రెస్ లోని కొందరు నేతలేమో కాంగ్రెస్ ను దెబ్బ కొట్టడానికే షర్మిల పార్టీ పెడుతున్నట్లుగా అభిప్రాయపడుతున్నారు.




ఇదే సమయంలో మాజీ ఎంపి విహెచ్ లాంటి మరికొందరు నేతలేమో బీజేపీ అగ్రనేతలే షర్మిలతో కొత్తగా పార్టీ పెట్టిస్తున్నారంటూ తీవ్రస్ధాయిలో రెచ్చిపోతున్నారు. వివిధ రాష్ట్రాల్లో కొత్త పార్టీలు పెట్టించి కాంగ్రెస్ ను దెబ్బకొట్టడం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కు కొత్తేమీ కాదంటు విహెచ్ మండిపోయారు. ఇక టీఆర్ఎస్ నేతలైతే షర్మిల అసలు తెలంగాణాలో పార్టీ పెట్టడం ఏమిటంటు మండిపోతున్నారు. తెలంగాణాలో ఏపి బిడ్డ పార్టీ పెడితే నమ్మి ఓట్లేసేవాళ్ళు ఎవరు లేరంటు ఎకసెక్కాలాడారు. అప్పటికేదో తెలంగాణా అంటే తెలంగాణా బిడ్డలే పార్టీ పెట్టాలన్నట్లుగా మాట్లాడుతున్నారు గులాజీ నేతలు. అయితే దీనికి కాంగ్రెస్ నేతలు మంచి రిటార్ట్ ఇఛ్చారు. ఖమ్మంకు చెందిన బ్రదర్ అనీల్ కుమార్ ను వివాహం చేసుకున్న తర్వాత షర్మిల కూడా తెలంగాణా బిడ్డయిపోయిందంటున్నారు.




ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే పై పార్టీల్లో నేతలు ఒకవైపు షర్మిలపై మండిపోతునే అదే సమయంలో షర్మిల పెట్టబోయే పార్టీ వల్ల తమకు వచ్చే నష్టం ఏమీ లేదని చెబుతున్నారు. షర్మిల పెట్టబోయే పార్టీ వల్ల ఇపుడున్న పార్టీల్లో దేనికీ నష్టం లేదనుకున్నపుడు మరి ఎందుకింత ఆగ్రహంతో ఊగిపోతున్నారో ఎవరికీ అర్ధం కావటంలేదు. మంగళవారం మీడియాతో మాట్లాడినపుడు షర్మిల కూడా తాను పార్టీ పెడతానని స్పష్టంగా చెప్పలేదు. అయితే తెలంగాణాలో రాజన్న రాజ్యం తెస్తానని ప్రకటించారు. కొత్తగా పార్టీ పెట్టి అధికారంలోకి రావాలన్న ఆలోచన లేకపోతే రాజన్నరాజ్యం ఎలా తెస్తారు ? అన్నది పాయింట్. సో నేరుగా చెప్పకపోయినా తొందరలోనే పార్టీ పెట్టడం ఖాయమనే అర్ధమైపోతోంది. పార్టీని ప్రకటించకముందే ప్రత్యర్ధిపార్టీలు ఇంతగా రెచ్చిపోతుంటే ఇక పార్టీ పెట్టిన తర్వాత ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: