హీరోయిన్ మాధవీ లతపై పోలీసులు కేసు పెట్టారు. ఆమెపై 295-ఎ సెక్షన్ కింద రాచకొండ స్టేషన్లో కేసు నమోదైంది. అసలింతకీ మాధవీ లత చేసిన తప్పేంటి? ఆమెపై కేసు ఎందుకు పెట్టారు? ఈ విషయాలు ఆరా తీస్తే ఆసక్తికర అంశాలు బైటపడ్డాయి. సోషల్ మీడియాలో ఆమె పెట్టిన ఓ పోస్టింగ్ వల్ల హైదరాబాద్ వనస్థలిపురానికి చెందిన ఓ విద్యార్థి ఫిర్యాదు చేశారని, దీనిపై పోలీసులు కేసు పెట్టారని అంటున్నారు.
నచ్చావులే వంటి సూపర్ హిట్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన మాధవీ లత.. ఆ తర్వాత అడపాదడపా మరికొన్ని సినిమాల్లో నటించినా పెద్దగా పేరు తెచ్చుకోలేకపోయింది. ఆ తర్వాత కొన్నాళ్లకు బీజేపీలో చేరి ప్రస్తుతం యాక్టివ్ లీడర్ గానే ఉంటూ వస్తోంది. బీజేపీ విధానాలను, ఆశయాలను ప్రజలకు దగ్గర చేసేందుకు ఆమె సోషల్ మీడియాను వేదికగా చేసుకుంది. మాధవీలత పోస్ట్ చేసే అంశాలన్నీ, బీజేపీ రిలేటెడ్ గా ఉంటాయి. అయితే ఇటీవల ఆమె చేసిన ఓ పోస్టింగ్ కాస్త కలకలం రేపిందని తెలుస్తోంది. ఆ పోస్టింగ్ పైనే పోలీసులకు ఫిర్యాదు అందిందని, అందుకే కేసు నమోదు చేశారని చెబుతున్నారు.
మాధవీలతకు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా.. ఆమె పోస్ట్ లను ట్రోలింగ్ చేసేవారు కూడా చాలామందే ఉన్నారు. అయితే వారందరికీ తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చేవారు మాధవీ లత. ఆమె సమాధానాలు చాలా ఘాటుగా ఉంటాయి. దీంతో సోషల్ మీడియాలో ఆమెపై విమర్శలు గుప్పించేవారు మరీ ఎక్కువయ్యారు. అయినా కూడా మాధవీ లత ఎక్కడా వెనక్కి తగ్గలేదు. తనదైన శైలిలో పోస్టింగ్ లు పెడుతూ వచ్చారు. తాజాగా ఆమె పెట్టిన పోస్టింగ్ లో తమ మనోభావాలు దెబ్బతిన్నాయని సదరు విద్యార్థి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వ్యవహారం పోలీస్ కేసు వరకూ వెళ్లింది. అయితే ఈ వ్యవహారంలో బీజేపీ నేతలు కొంతమంది జోక్యం చేసుకుంటున్నారని, త్వరలోనే అంతా సద్దుమణిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: