టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరో గా చేస్తున్న మూడవ చిత్రం పుష్పకవిమానం. దామోదర అనే నూతన దర్శకుడు ఈ చిత్రానికి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు పాటలు విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకోగా సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేలా చేశాయి. నటనాపరంగా ఆనంద్ దేవరకొండ మొదటి సినిమా నుంచి మంచి నటనను కనబరుస్తు వస్తున్నాడు. ఆయన నటించిన మొదటి సినిమా దొరసాని ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయినా నటనలో తనదైన మార్క్ ను చూపించాడు ఆనంద్ దేవరకొండ.

ఇక రెండో సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టి మంచి విజయాన్ని సంపాదించు కున్నాడు. డిజిటల్ గా రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అయింది. ఈ సినిమాతోనే ప్రేక్షకుల్లో కొంత క్రేజ్ ను అందుకున్నాడు ఆనంద్ దేవరకొండ. అన్నకు తగ్గ తమ్ముడుగా మంచి హిట్ కొట్టి టాలీవుడ్ యంగ్ హీరోలలో మంచి క్రేజ్ ఉన్న వారిలో తాను కూడా ఒక హీరో అని చెప్పాడు. చిన్న చిత్రాలను తనదైన స్టైల్ లో చేస్తూ మంచి కామెడీ పండించే సత్తా ఉన్న హీరోగా ఆనంద్ దేవరకొండ ఎదగగా ఇప్పుడు అదే స్టైల్ లో పుష్పకవిమానం సినిమాను కూడా తెరకెక్కిస్తున్నాడు.

ఈ సినిమాకి రామ్ మిరియాల సంగీత దర్శకత్వం వహిస్తుండగా ఈ సినిమా నుంచి వచ్చిన రెండు పాటలు కూడా సూపర్ హిట్ గా నిలిచాయి ముఖ్యంగా కళ్యాణం అనే పాట ఇటీవలే విడుదల కాగా యూట్యూబ్ లో ట్రెండింగ్ గా నిలుస్తోంది. సిద్ శ్రీరామ్ ఆలపించిన ఈ పాట వన్ మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతుంది. త్వరలోనే థియేటర్లలో విడుదల కాబోతున్న ఈ సినిమా ఈ ఒక్క పాటతోనే భారీ బిజినెస్ ను అందుకుందట. ఆనంద్ దేవరకొండ కెరియర్ లో ఇంత వరకు ఏ సినిమా కూడా చేయని బిజినెస్ ను ఈ సినిమా చేస్తుందని అంటున్నారు. ఇకపోతే ఈ సినిమాను విజయ్ దేవరకొండ తన సొంత నిర్మాణ సంస్థలో నిర్మించడం విశేషం. టాంగా ప్రొడక్షన్స్ అనే మరో సంస్థ కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగం పంచుకుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: