జనవాక్యం   మంచు మనోజ్ కి లైఫ్ టైమ్ డ్రీమ్ ప్రాజెక్ట్. శేఖర్ రాజా నాలుగేళ్ళ కృషి ఫలితం. మోహన్ బాబు వద్దని ఎంత చెప్పినా వినకుండా లక్ష్మీ ప్రసన్న పెట్టిన భారీ వ్యయం, ఫలితం ఎలా ఉంటుందోనని మనోజ్ నిద్రపోని రాత్రులు, మొహమాటానికి పోయి సినిమా బావుందని ఊదరగొట్టిన ఇతర రచయితలు... ఇవేవీ సినిమా హిట్ ను నిర్దేశించలేవనడానికి నిలువెత్తు నిదర్శనం ‘ఊ కొడతారా ఉలిక్కిపడతారా’. సినిమా చూసి బయటికి వచ్చిన వారిలో ఏ ఒక్కరు కూడా సినిమా బావుందని అనడం లేదంటే రంగు రంగు పువ్వులను కుట్టిన దారం స్ట్రాంగ్ గా లేదని అర్థం. సంస్థ – మంచు ఎంటర్ టైన్ మెంట్స్ సమర్పణ – మంచు మోహన్ బాబు  నిర్మాత – లక్ష్మీ ప్రసన్న మంచు సంగీతం – బోబో శశి  పాటలు – ఆర్.రాము నటీనటులు – బాలకృష్ణ, మంచు మనోజ్, సోనూసూద్, దీక్షాసేథ్, మంచు లక్ష్మి, పంచి బోరె, సాయికుమార్, ప్రభు, భానుచందర్, గొల్లపూడి మారుతీరావు, రిషి, తదితరులు  కథా కమామీషు గంధర్వమహల్ రుద్రమ వంశస్థులకు మిగిలిన ఏకైక ఆస్తి. రాయుడు (బాలకృష్ణ) ఆ మహల్లో తన భార్యా (పంచి), కొడుకు, చెల్లెలితో జీవితాన్ని సాగిస్తుంటాడు. అతని దగ్గర పాలేరుగా భానుచందర్ ఉంటాడు. రాయుడు తన చెల్లెల్ని తండ్రి స్నేహితుడి కుమారుడు భూపతి (సోనూసూద్)కిచ్చి వివాహం చేస్తాడు. గత్యంతరం లేక తను ఉంటున్న గంధర్వమహల్ ను చెల్లెలికి ఇచ్చేస్తాడు రాయుడు. కానీ మోజుపడిన తన ప్రేయసి అమృతవల్లి (లక్ష్మీప్రసన్న)ను పట్టపు మహిషి చేయాలని రాయుడి చెల్లెల్ని చంపేస్తాడు భూపతి. ఆ విషయం బయటపడగానే రాయుడు, భూపతి కూడా చనిపోతారు. రాయుడు మనవరాలి పెళ్ళి చేయాలనుకున్నప్పుడు పెళ్ళి కొడుకు తరఫు వారు గంధర్వమహల్ ను కోరుతారు. ఇవ్వడానికి ప్రభు కూడా ఒప్పుకుంటాడు. కానీ హీరో (మనోజ్) ఆ మహల్ ను కాపాడటానికి ముందుకొస్తాడు. చివరికి గంధర్వమహల్ వీరి చేయిదాటి పోయిందా? ఏమైంది? అనేది కథ. బాలకృష్ణకి టైలర్ మేడ్ క్యారక్టర్. ఆయన కనిపించిన ప్రతి సన్నివేశంలోనూ రాజసం ఉట్టిపడుతుంది. బాలకృష్ణ ఇంట్రడక్షన్ సీన్ చాలా బావుంది. లక్ష్మీప్రసన్న పాత్ర కూడా సినిమాకి ప్లస్సే. తన శరీరంలోని భూపతి ఆత్మ ప్రవేశించినప్పడు ఆమె నటించిన తీరు బావుంది. ఈ తరహా నటన గతంలో ‘పొగరు’ చిత్రంలో శ్రేయారెడ్డి కూడా చేసి శభాషనిపించుకుంది. శేఖర్ రాజా దర్శకత్వం అక్కడక్కడా మెరిపిస్తుంది. చాలా చోట్ల అతనికి లాక్ ఆఫ్ ఎక్స్ పీరియన్స్ కనిపిస్తుంది. గొల్లపూడి లాంటి సీనియర్ నటులను కొన్ని సీన్లకే పరిమితం చేయడం బాధాకరం. ఏ నటుడినీ తెరపై సంపూర్ణంగా ఉపయోగించుకోలేదు. సోనూసూద్ లాంటి నటుడిని కూడా సరిగా వినియోగించుకోలేకపోయారు. ఎక్కువ మంది కాస్టింగ్ ను ఎంచుకున్న దర్శకుడు సబ్జెక్ట్ ను డీల్ చేయలేకపోయారన్నది వాస్తవం. ఇంటర్వెల్ దాకా అసలు కథలోకే అడుగుపెట్టకపోవడం శోచనీయం. దీక్షాసేథ్ కేవలం అందాలు ఆరబోయడానికే పనికొచ్చింది. మనోజ్ చేష్టలన్నీ దేనికవే బావున్నట్టు అనిపించినా, మొత్తంగా గుదిగూర్చి చూస్తే పెదవి విరవక తప్పదు.  సాంకేతిక పనితనం  బోబోశశి పాటలు గొప్పగా లేవు. రీరికార్డింగ్ చాలా వీక్. గంధర్వమహల్ సెట్ సినిమాకు ఆయువులాంటిది. సెట్ ను బాగానే ఉపయోగించుకున్నారు. సోనూసూద్ కి కూడా సాయికుమారే డబ్బింగ్ చెప్పినట్టు ఉంది. సాయికుమార్ గొంతు, సోనూసూద్ గొంతులకు పెద్ద తేడా ఏమీ ఉండదు. లక్ష్మీ ప్రసన్న డబ్బింగ్ కూడా ఆ పాత్రకు అతకలేదు. అమెరికా నుంచి వచ్చినట్టుంది గొంతు. గ్రాఫిక్స్ బాగానే ఉన్నాయి. సినిమాలో బలమైన విలనీగానీ, దృఢమైన సన్నివేశాలు గానీ లేవు. స్క్రీన్ ప్లే చప్పగా ఉంది. కెమెరా పనితనం కూడా సాదాసీదానే. బాలకృష్ణ మాత్రమే సినిమాను మలిసగంలో మోశారన్నది వాస్తవం.  మా మాట-  డ్రీమ్ ప్రాజెక్టులను ప్రచారం చేసుకోవడంలో చూపించిన శ్రద్ధ సినిమా కథ, కథనం విషయంలో చూపించి ఉంటే బావుండేది. మిగిలిన వారి మాట ఏమోగానీ ముందు నుంచి మోహన్ బాబు స్వయంగా చెప్తున్నట్టు రిజల్ట్ విని ఆయన ఉలిక్కిపడటం మాట వాస్తవం. రేటింగ్ – 4.5 \ 10 - మిథున్. 

మరింత సమాచారం తెలుసుకోండి: