హైదరాబాద్ నగరానికి త్వరలోనే మరో మణిహారం జాతకానుంది. తెలంగాణ ప్ర‌భుత్వం ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించిన దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జి అతి త్వరలోనే అందుబాటులోకి రాబోతుంది. కేబుల్‌ బ్రిడ్జిని సెప్టెంబర్ 19వ తేదీన ప్రారంభించడానికి ముహూర్తం ఖరారు చేసారు. శనివారం రోజు సాయంత్రం 5 గంటలకు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఈ కేబుల్‌ బ్రిడ్జిని ప్రారంభించనున్నారు. ఇక ఈ వంతెన హైదరాబాద్ నగరానికి మరో ఐకానిక్ గా నిలవనుంది.

ఇప్పటికే దుర్గం చెరువుపై నిర్మించిన కేబుల్‌ బ్రిడ్జి పనులు పూర్తయ్యాయి. జూబ్లీహిల్స్‌ రోడ్డు నంబర్‌ 45 నుంచి దుర్గం చెరువు మీదుగా ఇనార్బిట్‌మాల్‌ రోడ్డుకు కలిసేలా  754.38 మీటర్ల పొడవుతో ఆరు లేన్ల వెడల్పుతో ఈ కేబుల్‌ బ్రిడ్జిని నిర్మించారు. సస్పెన్షన్ బ్రిడ్జి పొడవు 426 మీటర్లు కాగా... రెండు పిల్లర్ల మధ్య పొడవు 244 మీటర్లు.ఈ   వంతెన నిర్మాణం పూర్తి చేయడానికి రూ.184 కోట్ల ఖర్చు అయింది. ఆసియాలోనే అతి పెద్ద తీగల వంతెనగా దీనిని పేర్కొంటున్నారు. 8 దేశాల ఇంజినీర్లు 22 నెలల పాటు శ్రమించి ఈ వంతెన నిర్మాణాన్ని పూర్తి చేశారు.  దుర్గం చెరువు నీటి మట్టానికి 20 మీటర్ల ఎత్తులో బ్రిడ్జి నిర్మితమైంది. ఒక్కో పైలాన్‌కు 26 ధృఢమైన ఐరన్ కేబుళ్లను వాడారు. బ్రిడ్జిపై పాదచారులు, సైకిలిస్ట్‌ల కోసం ప్రత్యేకంగా ట్రాక్‌లు కూడా ఏర్పాటు చేశారు.

బ్రిడ్జి రాత్రి సమయంలో మరింత ఆకర్షణీయంగా కనిపించేలా  సరికొత్త టెక్నాలజీతో థీమ్‌ పార్కును  ఏర్పాటు చేశారు. ఇప్పటికే పలు థీమ్‌ లు అక్కడ అలరిస్తుండగా.... మొత్తం  100 వరకు థీమ్‌లను ప్రదర్శించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.  దీంతో  ఈ బ్రిడ్జి రాత్రి వేళల్లో  పర్యాటకులను మరింత  ఆకట్టుకోనుంది. ఈ ప్రాంతాన్ని మరింత సుందరంగా తీర్చి దిద్దేందుకు త్వరలో కేబుల్‌ బ్రిడ్జికి రెండు వైపుల వాటర్‌ ఫౌంటేన్‌లు కూడా  ఏర్పాటు చేయనున్నారు. దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జి  అందుబాటులో వస్తే ఐటీ ఉద్యోగుల ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి.  ఇప్పటికే బ్రిడ్జి వద్దకు పర్యాటకుల తాకిడి పెరిగింది. బ్రిడ్జికి సంబంధించి  నైట్ విజన్ లో డ్రోన్ కెమెరాతో చిత్రీకరించిన ఒక వీడియోను మంత్రి కేటీఆర్  ట్విట్టర్ లో పోస్ట్ చేయగా... ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: